వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి చాలా కంపెనీలు స్వస్తి చెప్పేశాయి. కొంతకాలం హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన కంపెనీలు ఇప్పుడు మొత్తంగా ఆఫీస్‌కి రావాల్సిందేనని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీస్‌కు రాబోమంటూ ఎదురు తిరుగుతున్నారు.
జర్మన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం శాప్ (SAP) ఇటీవల రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీని తీసేసింది. దీంతో ఉద్యోగులు ఎదురుతిరిగారు. బలవంతంగా ఆఫీసులకు పిలిస్తే రాజీనామా చేస్తామంటూ సుమారు 5 వేల మంది ఉద్యోగులు యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి అందరూ తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని ఆన్-సైట్ వర్క్ గైడెన్స్ జారీ చేయడం ఉద్యోగులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
ఇప్పటివరకు ఉద్యోగులకు లొకేషన్ ఫ్లెక్సిబులిటీ ఇచ్చిన కంపెనీ ఆకస్మికంగా విధానాలను మార్చడం అసమంజసమని శాప్ యూరోపియన్ వర్క్స్ కౌన్సిల్ పేర్కొంది. అయితే కంపెనీ సీఈవో క్రిస్టియన్ క్లైన్ మాత్రం ఉద్యోగులను సాంస్కృతికంగా దగ్గర చేయడం, మార్గదర్శకత్వం, ఉత్పాదకత వంటి వాటి కోసం క్యాంపస్ కో-లొకేషన్ చాలా అవసరమని నొక్కి చెబుతున్నారు.
ప్రమోషన్‌లకు కీలకం..
రిమోట్, ఆన్-సైట్ అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి హైబ్రిడ్ విధానంలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకతను పరిశ్రమ ఉత్తమ పద్ధతులు, అంతర్గత అభ్యాసాలు తెలియజేస్తున్నాయని శాప్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు అనువైన పని అవకాశాన్ని కల్పించిన మొదటి టెక్ కంపెనీలలో శాప్ కూడా ఒకటి. కానీ 2022 తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు ఆన్-సైట్ వర్క్ విధానంపై దృష్టి పెట్టాయి. ప్రోత్సాహకాలు, ప్రమోషన్‌లు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయడానికి ఆఫీసుకి హాజరును నిర్ణయాత్మకంగా చూస్తున్నాయి.
టీసీఎస్ కూడా..
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా పెరగనున్న జీతాలు, ప్రమోషన్‌లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్ టు ఆఫీస్ పాలసీపై ఆధారపడి ఉంటాయని చెప్పనట్లు నివేదికలు వచ్చాయి. వేరియబుల్ చెల్లింపులను సైతం ఈ పాలసీతో అనుసంధానం కంపెనీ చేసింది. అసైన్డ్ కోర్సులు పూర్తి చేసి, ప్రారంభంలో ఏడాదికి వేతనం రూ.3 లక్షలకు మించి శాలరీలు తీసుకుంటున్న ఫ్రెషర్లకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment