విశాల్ సిక్కా రాజీనామా
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌లో సంచలనం చోటు చేసుకుంది. తన పనితీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న విశాల్ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎండీ, సీఈవో పదవులకు హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. రేపు బోర్డు సమావేశం జరగడానికి ముందే సిక్కా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేసే(బైబ్యాక్) ప్రతిపాదనపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయన వైదొలగడం గమనార్హం. విశాల్ సిక్కా రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారని అన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిస్ సమాచారం అదించింది. సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
మరోవైపు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి సహా కొందరు ప్రమోటర్లు కొంతకాలంగా ఇన్ఫోసిస్ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతన ప్యాకేజీలను భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని ప్రమోటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ ఆరోపణలు కూడా గుప్పించారు.
మరోపక్క, మోహన్‌దాస్ పాయ్ వంటి ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా యాజమాన్య నిర్ణయాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫీలోకి మూర్తి పునరాగమనం ఖాయమన్న ఊహాగానాలు వస్తున్నాయి. కంపెనీలో మళ్లీ ఏదైనా బాధ్యతలను చేపట్టాలని నారాయణమూర్తి భావిస్తే.. పరిశీలించేందుకు తాము సిద్ధమేనంటూ ఇటీవల ఇన్ఫీ సహ–చైర్మన్ రవి వెంకటేశన్ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి.
ffffffffff