Pravin Rao
-
మెప్పించిన ఇన్ఫీ!
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్.. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం నికర లాభం స్వల్పంగా 2.2 శాతం క్షీణించి రూ. 4,019 కోట్లుగా నమోదైంది. మార్కెట్ వర్గాలు ఇది సుమారు రూ. 4,040 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. గతేడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 4,110 కోట్లు. మరోవైపు, రెండో త్రైమాసికంలో ఆదాయం 9.8% వృద్ధితో రూ. 20,609 కోట్ల నుంచి రూ. 22,629 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 11.4 శాతం వృద్ధి నమోదైంది. 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ గైడెన్స్‌ను ఇన్ఫోసిస్ పెంచింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 9–10 శాతానికి సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రెవెన్యూ వృద్ధి 7.5–9.5 శాతంగా ఉండొచ్చంటూ గైడెన్స్ ఇచ్చిన ఇన్ఫోసిస్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో దీన్ని 8.5–10 శాతానికి పెంచింది. తాజాగా కనీస ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను మరింత పెంచింది. సెప్టెంబర్ త్రైమాసికంలో షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. టీసీఎస్ లాభంలో స్వల్ప వృద్ధి సాధించగా, ఇన్ఫీ లాభాలు స్వల్పంగా తగ్గడం గమనార్హం. 2.8 బిలియన్ డాలర్ల డీల్స్.. మరో త్రైమాసికంలో అన్ని విభాగాల్లోనూ, ప్రాంతాలవారీగాను ఆల్ రౌండ్ వృద్ధి సాధించగలిగాం. క్లయింట్లకు మాపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. 2.8 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ కుదుర్చుకోగలిగాం. ఉద్యోగులకు మరింత ప్రయోజనాలు చేకూర్చేందుకు తీసుకుంటున్న చర్యలతో అట్రిషన్ రేటును తగ్గించుకోగలిగాం‘. – ప్రవీణ్ రావు, సీవోవో బహుముఖ వృద్ధి.. నిర్వహణ మార్జిన్లు, సామర్ధ్యాలు, ఆదాయాలు, డిజిటల్ విభాగం మెరుగుపడటంతో పాటు భారీ డీల్స్ కుదుర్చుకోగలిగాం. ఆట్రిషన్ తగ్గింది. దీంతో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు సాధించగలిగాం. వాటాదారులకు మరింత విలువ చేకూర్చడంతో పాటు క్లయింట్లకు అవసరమైన సేవలపై మరింతగా దృష్టి పెట్టే దిశగా కంపెనీ పురోగతి సాధిస్తోందనడానికి ఇవన్నీ స్పష్టమైన సంకేతాలు’. – సలిల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ 14% అదనంగా డివిడెండ్ నిర్వహణపరంగా అన్ని అంశాలను మెరుగుపర్చుకోవడంతో పాటు వ్యయాలు నియంత్రించుకోవడంతో రెడో త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్లు పెంచుకోగలిగాం. నిధులను మెరుగ్గా వినియోగించుకునే∙దిశగా మధ్యంతర డివిడెండ్‌ను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 14 శాతం పెంచగలిగాం’. – నీలాంజన్ రాయ్, సీఎఫ్ఓ మరిన్ని విశేషాలు.. ► సెప్టెంబర్ త్రైమాసికంలో డాలర్ మారకంలో నికర లాభం 569 మిలియన్ డాలర్లు కాగా ఆదా యం 3.21 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► సీక్వెన్షియల్‌గా నికర లాభం 6 శాతం, ఆదాయం 3.8 శాతం పెరిగింది. ► డిజిటల్ విభాగం ఆదాయాలు 38.4 శాతం వృద్ధి చెంది 1.23 బిలియన్ డాలర్లకు చేరాయి. మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 38.3 శాతానికి చేరింది. ► 21–23 శాతం శ్రేణిలో ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ యథాతథం. ► రూ. 8,260 కోట్ల విలువ చేసే షేర్ల బైబ్యాక్ కార్యక్రమం ఆగస్టు 26తో ముగిసింది. ► రెండో త్రైమాసికంలో నికరంగా 7,457 మంది నియామకాలు జరిగాయి. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.36 లక్షలకు చేరింది. ► ఆట్రిషన్ రేటు జూన్ ఆఖరు నాటికి 23.4 శాతంగా ఉండగా, సెప్టెంబర్ క్వార్టర్లో 21.7 శాతానికి తగ్గింది. స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడయ్యాయి. బీఎస్ఈలో సంస్థ షేరు 4.19% పెరిగి రూ. 815.70 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆయనే..
ముంబై : విశాల్ సిక్కా రాజీనామాతో ఖాళీ అయిన ఇన్ఫోసిస్ సీఈవో పదవిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అయితే సిక్కా రాజీనామా అనంతరం ఇన్ఫోసిస్ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన యూబీ ప్రవీణ్ రావే, ఈ పదవిలో కొనసాగుతారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బీజీ శ్రీనివాస్, అశోక్ వేమూరిలు కంపెనీ కొత్త సీఈవో రేసులో ఉన్నారంటూ వచ్చిన రిపోర్టులను సంబంధిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కంపెనీలో భాగమైన వారినే కొత్త సీఈవోగా నియమించాలని మేనేజ్మెంట్ చేస్తుందని, అప్పుడైతేనే కంపెనీ నీతులను అర్థం చేసుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నాయి. బీజీ శ్రీనివాస్ మళ్లీ కంపెనీలోకి వచ్చే అవకాశం లేదంటూ తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నిలేకని ఎక్కువగా కంపెనీ అంతర్గత అభ్యర్థిని కొత్త సీఈవోగా ఎంపికచేయాలని కసరత్తు చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలిపాయి. ప్రస్తుతం శ్రీనివాస్ హాంకాంగ్‌కు చెందిన పీసీసీడబ్ల్యూ గ్రూప్‌కు సీఈవోగా ఉన్నారు. అశోక్ వేమూరి కూడా జిరాక్స్ బీపీఓకి సీఈవోగా కొనసాగుతున్నారు. దీంతో కొత్త సీఈవోగా యూబీ ప్రవీణ్ రావునే కొనసాగించనున్నారని సంబంధిత వర్గాలు చాలా బలంగా నొక్కిచెబుతున్నాయి. -
ఇన్ఫోసిస్ ఎండీగా ప్రవీణ్ రావు కొనసాగుతారా?
న్యూఢిల్లీ: భారతీయ రెండవ అతిపెద్ద సాఫ్టవేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మధ్యంతర సీఈవో, ఎండీయుఎన్ ప్రవీణ్ రావును కొత్త మేనేజింగ్ డైరక్టర్‌గా నియమించేందుకు యోచిస్తోంది. ఆయన్ను ఈ పదవిలో కొనసాగించేందుకు షేర్‌హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల సీఈవో, ఎండీగా ఉన్న విశాల్సిక్కా రాజీనామాతో కొత్త సీఎండీ ఎంపికకోసం ఇన్ఫోసిస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రవీణ్ రావును తిరిగిఎన్నుకునేందుకు వాటాదారుల అనుమతి కోసం చూస్తోంది. ప్రవీణ్ కనీసం అయిదేళ్ల పాటు లేదా, కొత్త సీఈవో ఎంపిక చేసే దాకా మధ్యంతర సీఈవో అండ్ ఎండీ పదవిలో కొనసాగుతారని ఇన్ఫోసిస్ పోస్టల్ బ్యాలెట్ లో ప్రకటించింది. దీంతో సెప్టెంబరు 8 నుండి అక్టోబరు 7 వరకు పోస్టల్ బ్యాలట్‌పై వాటాదారులు ఓటు వేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 9న గానీ, అంతుకుముందుగానీ ఫలితాలు ప్రకటించనుంది. దీంతోపాటుగా ఇన్ఫీ బోర్డులోకి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా డి సుందరం నియామకంపై కూడా వాటాదారుల అనుమతిని కోరుతోంది. మరోవైపు విశాల్ సిక్కా స్థానాన్ని భర్తీ చేయడంలో పంచ శోధన ఈగోన్ జహేందర్ సహాయాన్ని అర్థించింది ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన రావు ఆగష్టు 18 న తాత్కాలిక సీఈవో , మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితుడయ్యారు. అలాగే ఇన్ఫోసిస్ ఎనిమిది సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అప్పటి చీఫ్ విశాల్ సికా సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
విశాల్ సిక్కా రాజీనామా
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌లో సంచలనం చోటు చేసుకుంది. తన పనితీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న విశాల్ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎండీ, సీఈవో పదవులకు హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. రేపు బోర్డు సమావేశం జరగడానికి ముందే సిక్కా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేసే(బైబ్యాక్) ప్రతిపాదనపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయన వైదొలగడం గమనార్హం. విశాల్ సిక్కా రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారని అన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిస్ సమాచారం అదించింది. సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఎన్ఆర్ నారాయణ మూర్తి సహా కొందరు ప్రమోటర్లు కొంతకాలంగా ఇన్ఫోసిస్ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతన ప్యాకేజీలను భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని ప్రమోటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ ఆరోపణలు కూడా గుప్పించారు. మరోపక్క, మోహన్‌దాస్ పాయ్ వంటి ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా యాజమాన్య నిర్ణయాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫీలోకి మూర్తి పునరాగమనం ఖాయమన్న ఊహాగానాలు వస్తున్నాయి. కంపెనీలో మళ్లీ ఏదైనా బాధ్యతలను చేపట్టాలని నారాయణమూర్తి భావిస్తే.. పరిశీలించేందుకు తాము సిద్ధమేనంటూ ఇటీవల ఇన్ఫీ సహ–చైర్మన్ రవి వెంకటేశన్ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ffffffffff