
తగ్గిన ఇన్ఫోసిస్ విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ
► 2015–16లో రూ.48.73 కోట్లు
► 2016–17లో రూ.43 కోట్లు
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ గత ఆర్థిక సంవత్సరానికి రూ.43 కోట్లు(66.8 లక్షల డాలర్లు)గా ఉంది. ఆయనకు వాగ్దా నం చేసిన వేతన ప్యాకేజీ(1.10 కోట్ల డాలర్లు)లో ఇది 61 శాతం. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరంలో ఆయన పొందిన వేతన ప్యాకేజీ (రూ. 48.73 కోట్లు) కంటే కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన పొందిన వేతన ప్యాకేజీ తక్కువగానే ఉండడం విశేషం. ఈ వేతన ప్యాకేజీలో మూల వేతనం, వేరియబుల్ పే, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్(ఆర్‌ఎస్‌యూ), పెర్ఫామెన్స్ స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరానికి విశాల్ సిక్కా పొందిన 66.8 లక్షల డాలర్ల వేతన ప్యాకేజీలో మూల వేతనం కాకుండా 8.2 లక్షల డాలర్ల వేరియబుల్ పే, 19 లక్షల డాలర్ల ఆర్‌ఎస్‌యూలు, 9.6 లక్షల డాలర్ల ఈసాప్స్.. ఈ మొత్తం 36.8 లక్షల డాలర్లుగా ఉంది. 70.8 లక్షల డాలర్లుగా ఉన్న విశాల్ సిక్కా వేతనాన్ని ఇన్ఫోసిస్ కంపెనీ గత ఏడాది ఏప్రిల్‌లో 1.1 కోట్ల డాలర్లకు సవరించింది. విశాల్ సిక్కా వేతన విషయమై కం పెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.