ఇన్ఫీ అమెరికా బాట!
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఫలించింది. వచ్చే రెండేళ్లలో పది వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తామని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా వివిధ మీడియా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాపై విదేశీ కార్మికులను రప్పించి స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు దక్కకుండా చేయడాన్ని అనుమతించబోమనే హామీపై అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ ఈ వీసా కార్యక్రమాలను కట్టడిచేస్తూ నిర్ణయాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఉద్యోగులనే నియమించక తప్పని పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ ఎంచుకున్న ‘కొత్త దారి’లో మిగిలిన ఐటీ దిగ్గజాలూ పయనిస్తాయని సిక్కా మాటలు సూచిస్తున్నాయి.
అమెరికా వత్తిడి కాదు– ఇనోవేషన్ కేంద్రాల ఏర్పాటు కోసమే
హెచ్1బీ వీసాల ద్వారా అమెరికన్ల ఉద్యోగాలు ఇతరులు కొల్లగొట్టకుండా ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన వత్తిడితో తాము అమెరికన్లకు ఉద్యోగాలివ్వడం లేదనీ, మారిన పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటుచేసే నాలుగు టెక్నాలజీ, ఇనోవేషన్(నవకల్పన) కేంద్రాలు కూడా దీనికి కారణమని సిక్కా చెప్పారు.
అయితే, హెచ్1బీ వీసాల కేటాయింపునకు నిర్వహించే లాటరీకి టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వేలాది అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా పంపి సగానికి పైగా ఈ వీసాలు కైవసం చేసుకున్నాయని, లాటరీ ప్రక్రియను ఇవి ‘రిగ్’ చేశాయని కూడా అమెరికా సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ అనుసరిస్తున్న ‘గ్లోబల్ డెలివరీ మోడల్’ను సమీక్షించి స్థానిక నిపుణుల సేవలు వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిక్కా వివరించారు.
హెచ్1బీ వీసాలతో తక్కువ జీతాలు!
ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు హెచ్1బీ వీసాలతో తక్కువ జీతాలిచ్చి ఇండియా నుంచి సిబ్బందిని అమెరికాకు తరలిస్తున్నాయి. ఇన్ఫీ సగటున ఒక్కో హెచ్1బి వీసా దరఖాస్తుదారుకు 81,705 డాలర్ల వేతనాన్ని కిందటేడాది ఇవ్వజూపిందని మైవీసాజాబ్స్.కామ్ వెల్లడించింది. అయితే, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అత్యంత భారీ గ్లోబల్ టెక్ కంపెనీలు సగటున 1,30,000 డాలర్లు ఆఫర్ చేశాయి. అమెరికాలో స్థానికులు కాని 25 వేలమంది విదేశీ సిబ్బంది ఇన్ఫోసిస్ కేంపస్‌లలో పనిచేస్తున్నారు. వారికిచ్చే జీతాలు హెచ్1బీ వీసాలతో నడిచే ఇతర 55 ఔట్‌సోర్సింగ్ కంపెనీలతో పోల్చితే తక్కువే.
సిక్కా ప్రకటనతో అమెరికా ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకోవడానికి ట్రంప్ అనుకూల నిర్ణయాలు ప్రకటించిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, అలీబాబా హోల్డింగ్స్ ఆసియా దిగ్గజాల జాబితాలో ఇప్పుడు ఇన్ఫోసిస్ చేరింది. ఇప్పటికే అమెరికాలో అత్యంత ప్రతిభావంతులను ఎంపికచేసి భారీ జీతాలతో ఉద్యోగాలిస్తే ఇన్ఫోసిస్ వేతనవ్యయం పెరిగినాగాని, యాక్సెంచర్, ఐబీఎం వంటి అమెరికా ఐటీ దిగ్గజాలతో పోటీపడే స్థాయికి అది ఎదుగుతుందని అంచనా.
(సాక్షి నాలెడ్డ్ సెంటర్)