లాస్ ఏంజెలిస్: సీఈవో, సీఎఫ్‌వోలపై ప్రజావేగుల ఫిర్యాదులతో సతమతమైన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు తాజాగా మరో తలనొప్పి ఎదురైంది. షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇన్ఫోసిస్‌పై క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు అమెరికాకు చెందిన న్యాయసేవల సంస్థ ది షాల్ లా ఫర్మ్ వెల్లడించింది. మార్కెట్‌ను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్ తప్పుడు ప్రకటనలు చేసిందని షాల్ ఆరోపించింది. స్వల్పకాలిక లాభాలను పెంచి చూపించడం కోసం ఆదాయాల లెక్కింపునకు తప్పుడు విధానాలు పాటించిందని ఫిర్యాదులో పేర్కొంది. పెద్ద డీల్స్‌పై ప్రామాణికంగా జరపాల్సిన సమీక్షలు జరగకుండా సీఈవో సలిల్ పరేఖ్ తప్పించారని షాల్ ఆరోపించింది. పైగా ఈ అకౌంటింగ్ లొసుగులు, వివాదాస్పద డీల్స్ వివరాలను ఆడిటర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లనివ్వకుండా ఫైనాన్స్ విభాగంపై యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని తెలిపింది. ‘ఈ అంశాలకు సంబంధించి కంపెనీ అందర్నీ తప్పుదోవ పట్టించేలా అవాస్తవమైన, తప్పుడు ప్రకటనలు చేసింది. ఈ వ్యవహారం గురించి మార్కెట్లకు నిజాలు తెలిసిన తర్వాత.. ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది‘ అని షాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. 1,00,000 డాలర్ల పైగా నష్టపోయిన ఇన్వెస్టర్లు.. క్లాస్ యాక్షన్ దావాలో భాగం అయ్యేందుకు తమను కలవాలని సూచించింది. 2018 జూలై 7–2019 అక్టోబర్ 20 మధ్య కాలంలో ఇన్ఫీ షేర్లను కొనుగోలు చేసిన వారు.. డిసెంబర్ 23లోగా సంప్రదించాలని పేర్కొంది.
వివరణ కోరిన బీఎస్‌ఈ ..
అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వార్తలపై వివరణనివ్వాలంటూ ఇన్ఫీకి స్టాక్ ఎక్సే్ఛంజీ బీఎస్‌ఈ సూచించింది. అయితే, దీనిపై కంపెనీ స్పందించాల్సి ఉంది. ఇన్ఫీ సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లు వ్యాపారపరంగా అనైతిక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచి్చన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ విచారణ జరుపుతోంది.
తాజా వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్ షేరు సుమారు 3 శాతం క్షీణించి, రూ. 702 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment