
ఇన్ఫీలో సీనియర్ల వలసలు తక్కువే
సీఈవో విశాల్ సిక్కా
న్యూఢిల్లీ: మిగతా కంపెనీలతో పోలిస్తే తమ కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగుల వలసలు (అట్రిషన్) చాలా తక్కువేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా చెప్పారు. సీనియర్లు పెద్ద ఎత్తున కంపెనీని వీడిపోతున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. గ్లోబల్ హెడ్ అనిర్బన్ డే, ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఫండ్ ఎండీ యూసుఫ్ బషీర్, ఈవీపీ రితికా సూరి తదితర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవలి కాలంలో నిష్క్రమించిన నేపథ్యంలో సిక్కా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ల నిష్క్రమణపై స్పందిస్తూ.. ఇదేమీ ఆందోళన కలిగించే అంశం కాదని సిక్కా చెప్పారు.
ఇన్ఫోసిస్ చేతికి బ్రిలియంట్ బేసిక్స్
కాగా ఇన్ఫోసిస్ తాజాగా బ్రిలియంట్ బేసిక్స్ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చిస్తున్నామన్నది చెప్పలేదు. లండన్‌కు చెందిన బ్రిలియంట్ బేసిక్స్... ప్రోడక్ట్ డిజైన్ తదితర సేవలు అందిస్తోంది.