సిక్కా దెబ్బకు మార్కెట్లు ఢమాల్
ఇన్ఫోసిస్ సీఈవోగా, ఎండీగా విశాల్ సిక్కా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన తర్వాత మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సిక్కా దెబ్బ మార్కెట్లకు భారీగా తగిలింది. సెన్సెక్స్ 400 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ సైతం 9800 మార్కు దిగువకు దిగజారింది. మార్కెట్‌లో ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి నెలకొన్నట్టు విశ్లేషకులు చెప్పారు. చివరికి సెన్సెక్స్ 270.78 పాయింట్ల నష్టంలో 31524.68 వద్ద, నిఫ్టీ 66.75 పాయింట్ల నష్టంలో 9837.40 వద్ద ముగిశాయి. మరోవైపు సిక్కా కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి వైదొలగడం ఆ కంపెనీ షేరును భారీగా దెబ్బతీసింది.
ఇంట్రాడేలో ఆ కంపెనీ షేరు 13 శాతం మేర పడిపోయి 52 వారాల కనిష్టానికి పడిపోయింది. బైబ్యాక్ జోరుతో గురువారం సెషన్‌లో ఇన్ఫీ షేరు 4 శాతం మేర జోరు కొనసాగించిన సంగతి తెలిసిందే. నేడు వెలువడిన ప్రకటనతో బైబ్యాక్ జోరుకు కళ్లెం పడింది. బైబ్యాక్ ప్రతిపాదనపై రేపు(శనివారం) జరుగబోతున్న బోర్డు మీటింగ్ నేపథ్యంలో విశాల్ సిక్కా నుంచి ఈ అనూహ్య ప్రకటన వెలువడింది. గురువారం రూ.2,34,554.78 కోట్లగా ఉన్న ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్, నేటి ట్రేడింగ్‌లో రూ.2,07,553.94 కోట్లకు పడిపోయింది. అంటే సుమారు రూ.27 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది.
నేటి సెషన్‌లో రెండు సూచీల్లోనూ ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, జీ ఎంటర్‌టైన్మెంట్ టాప్ లూజర్లుగా భారీగా నష్టపోతుండగా.... టీసీఎస్, హెచ్‌యూఎల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, బీపీసీఎల్ లాభాల్లో నడుస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 64.13 వద్ద ఉంది.