
ఇన్ఫీపై వదంతులను నమ్మొద్దు: సిక్కా
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలపై కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా పెదవి విప్పారు. కార్పొరేట్ నైతికత, సమగ్రత, విలువల విషయంలో ఇన్ఫోసిస్‌కు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ఉద్యోగులను కోరారు. కంపెనీ సిబ్బందికి పంపిన అంతర్గత ఈ–మెయిల్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిక్కా వేతనం పెంపు, మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ వీడ్కోలు ప్యాకేజీలను ఆఫర్ చేయడంపై ఇన్ఫీ వ్యవస్థాపకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంపెనీ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఇప్పటికే ఇన్ఫోసిస్ వివరణ కూడా ఇచ్చింది. కంపెనీ పూర్తి ప్రయోజనాలమేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసింది.
‘క్లౌడ్, ఎడ్జ్ ఇతరత్రా కొత్త తరం సేవలపై మనం(కంపెనీ) అనుసరిస్తున్న వ్యూహంపై నిశితంగా దృష్టి కేంద్రీకరించండి. మీడియాలో వస్తున్న ఊహాగానాలను అసలు పట్టించుకోవద్దు. నైతికత, సమగ్రత, విలువలను కాపాడేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. ప్రస్తుతం నెలకొన్న కొత్త తరహా అసాధారణ పరిస్థితుల్లో సైతం ఇన్ఫోసిస్ అనే గొప్ప కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. మా అంకితభావం విషయంలో మరో ఆలోచనకు తావులేదు. మనమంతా ఇకపై కూడా ఇదే నిబద్ధతతో కలసికట్టుగా సాగుదాం’ అని సిక్కా పేర్కొన్నారు. కాగా, దాదాపు రెండేళ్ల క్రితం ఐటీ పరిశ్రమ వృద్ధితో పోలిస్తే దాదాపు 50% వెనుకబడిన ఇన్ఫోసిస్.. ప్రస్తుతం పరిశ్రమ వృద్ధితో సమాన స్థాయికి చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
నారాయణ మూర్తి తప్పు చేశారు: పాయ్
ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ఉన్న నాయకత్వం.. వాటాదారులకు విలువను సమకూర్చడంపై దృష్టిసారించడం లేదని కంపెనీ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. అయితే, సీఈఓ విశాల్ సిక్కా సారథ్యంపై మాత్రం విశ్వాసం వ్యక్తం చేశారు. కంపెనీకి ఇప్పుడు అత్యంత బలమైన చైర్మన్ అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. 2000 ఏడాది నుంచి 2011 వరకూ ఇన్ఫీ బోర్డు సభ్యుడిగా పాయ్ కీలక బాధ్యతలను నిర్వర్తించారు. కంపెనీతో 17 ఏళ్ల బంధాన్ని వదులుకొని 2011లో రాజీనామా చేశారు. ‘ఇన్ఫీ ప్రమోటర్లలో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి.. కేవలం వ్యవస్థాపకులు మాత్రమే సారథులయ్యే(సీఈఓలు) విధానంపై దృష్టిపెట్టి తప్పు చేశారు. చాలా మంది ఉద్యోగులు కంపెనీని వీడిపోయేందుకు ఇదే ప్రధాన కారణం.
ఇన్ఫీ లాంటి గొప్ప కంపెనీని నిర్మించడంలో మేమంతా కీలక భూమిక పోషించాం. అయితే, ఈ పరిస్థితులను చూసి చాలా బాధపడుతున్నా’ అని పాయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆర్.శేషసాయి వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయన పేరును ప్రస్తావించకుండా.. ‘ఒక కంపెనీకి బలమైన సీఈఓ ఉన్నప్పుడు అంతే బలమైన చైర్మన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ఫోసిస్ పటిష్టమైన చైర్మన్ నాయకత్వంలోనే బలోపేతం అయింది’ అని పాయ్ వ్యాఖ్యానించారు. కాగ్నిజంట్ తరహాలోనే ఇన్ఫీ కూడా షేర్ల బైబ్యాక్‌ను అమలు చేయాలన్నారు.