ఇన్ఫీకి కొత్త సీఈవో ఎంపిక పెద్ద తంటా
సాక్షి, బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు, ఈ కంపెనీ మేనేజ్‌మెంట్‌కు గత కొంతకాలంగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తొలి వికెట్ పడింది. ఈ కంపెనీ సీఈవో, ఎండీగా ఉన్న విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేసేశారు. ఈ షాక్‌తో ఇన్ఫోసిస్ కొత్త చిక్కు వచ్చి పడింది. అదే విశాల్ సిక్కాను భర్తీచేసే కొత్త సీఈవో. ఆయన్ను భర్తీ చేస్తూ ఓ కొత్త వ్యక్తి ఇన్ఫోసిస్ సీఈవోగా ఆ పదవిలోకి రావాల్సి ఉంటుంది. అయితే ఆ పదవిని అలకరించేది ఎవరన్నది సర్వత్రా చర్చనీయాంశం. కానీ ఆ వ్యక్తిని గుర్తించేది ఎలా అన్నది ఇన్ఫోసిస్ తంటా. ఈ విషయాన్ని 2014లో కొత్త సీఈవోను ఎంపికచేసే సమయంలో సమస్యలు ఎదుర్కొన్న అధికారులే చెబుతున్నారు. 2014లోనే సీఈవోను వెతకడం అతిపెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. గ్రూప్ వ్యవస్థాపకులు కాక, మొదటిసారి బయట వ్యక్తి విశాల్ సిక్కా ఆ పదవిలోకి వచ్చారు. కానీ ప్రస్తుతం విశాల్ సిక్కా వైదొలగడంతో, ఈ కంపెనీకి కొత్త సీఈవోను నియమించాల్సిన పరిస్థితి వచ్చింది.
అప్పట్లోనే బయట వ్యక్తిని వెతికి నియమించడం చాలా కష్టమైందని, ప్రస్తుతం ఇది మరింత జటిలమని ఓ అధికారి చెప్పారు. కానీ ఈ సారి బయట వ్యక్తులకు అవకాశాలు తక్కువేనని కూడా తెలిపారు. కంపెనీలో పనిచేసే వారినే ఈ సారి సీఈవోగా నియమించే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా రాబోతున్న సీఈవోగా కచ్చితంగా 2014లో కంటే మరింత మంచిగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కొత్త ఏరియాలు క్లౌడ్, ఆటోమేషన్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌లపై ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. సిక్కా సీఈవోగా 2014లో ఇన్ఫీలోకి వచ్చినప్పటి నుంచి గురువారం వరకు ఇన్ఫీ షేరు ధర 22 శాతం పైకి ఎగిసింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో మంచి షేరుగా నిలిచింది. కానీ ప్రస్తుతం వచ్చే సీఈవో బ్రెగ్జిట్, అమెరికాలో అనిశ్చిత పరిస్థితులు, వీసా విధానాల్లో మార్పులు వంటి వాటన్నింటిన్నీ భరిస్తూ.. ఇన్ఫీని మరింత మెరుగైన బాటలో నడిపించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్పారు. మరోవైపు నుంచి ఇన్ఫీ కొత్త సీఈవోగా ఓ నలుగురు పేర్లు టెక్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు ఈ బాధ్యతలు చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వారిలో ఒకరు ప్రస్తుతం ఇన్ఫోసిస్ తాత్కాలిక సీఈవోగా వచ్చిన యూబీ ప్రవీణ్ రావు, రెండో వ్యక్తి సీఎఫ్‌ఓ రంగనాథ్ డీ మావినకేరి, తర్వాత వ్యక్తి ప్రెసిడెంట్, డిప్యూటీ సీఓఓ రవి కుమార్ ఎస్, ఇక నాలుగో వ్యక్తి బీఎఫ్‌ఎస్‌ఐ హెడ్ మోహిత్ జోషి అని తెలుస్తోంది.