మార్కెట్‌కు ఇన్ఫీ దెబ్బ | Sensex plunges 266 points; Infosys tanks 5.4% | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు ఇన్ఫీ దెబ్బ

Published Tue, Aug 22 2017 1:20 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

మార్కెట్‌కు ఇన్ఫీ దెబ్బ

మార్కెట్‌కు ఇన్ఫీ దెబ్బ

వరుసగా రెండో రోజూ పతనం  సెన్సెక్స్‌ 266 పాయింట్లు,
నిఫ్టీ 83 పాయింట్లు డౌన్‌


ముంబై: విశాల్‌ సిక్కా సీఈఓ పదవికి రాజీనామా చేసిన పరిణామాలతో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌తో పాటే మార్కెట్‌ కూడా సోమవారం వరుసగా రెండురోజు క్షీణించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరో 266 పాయింట్లు పతనమై 31,259 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం కూడా ఈ సూచి 270 పాయింట్లు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,800 పాయింట్ల స్థాయిని కోల్పోయి, 83 పాయింట్ల నష్టంతో 9,754 వద్ద క్లోజయ్యింది.

 ట్రేడింగ్‌ తొలిదశలో బ్యాంకింగ్, మెటల్‌ షేర్ల దన్నుతో సెన్సెక్స్‌ 31,641 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగినప్పటికీ, మధ్యాహ్న సెషన్‌ నుంచి ఆ రెండు రంగాల షేర్లలో కూడా అమ్మకాలు జరగడంతో ఇంట్రాడేలో గరిష్టస్థాయి నుంచి 420 పాయింట్లకుపైగా పడిపోయి 31,220 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. ఇదేబాటలో నిఫ్టీ 9,884 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన అనంతరం 9,740 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది.

అమెరికా–దక్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక కవాతులు జరుపుతున్నాయన్న వార్తలతో ఇన్వెస్టర్లు ముందుజాగ్రత్తగా లాభాల స్వీకరణకు పాల్పడినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్‌ ప్రీమియం ధరకు బైబ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించినప్పటికీ, ఆ షేరులో అమ్మకాల ఒత్తిడి కొనసాగిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మార్కెట్లో విక్రయాలు జరపడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని ఆయన వివరించారు.  

ఇన్ఫోసిస్‌ 5 శాతం డౌన్‌
గత శుక్రవారం 9 శాతంపైగా పతనమైన ఇన్ఫోసిస్‌ షేరు మరో 5 శాతం క్షీణించి మూడేళ్ల కనిష్టస్థాయి రూ. 873 వద్ద ముగిసింది. రూ. 1,150 ధరతో దాదాపు 5 శాతం షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు గత శనివారం ఇన్ఫోసిస్‌ చేసిన ప్రకటన...ఈ షేరుపై సానుకూల ప్రభావం చూపలేదు. విశాల్‌ సిక్కా హఠాత్తుగా రాజీనామా చేసిన ప్రభావంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. రెండు ఎక్సే్ఛంజీల్లో కలిపి భారీగా 4.5 కోట్ల ఇన్ఫీ షేర్లు ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌–30లో అత్యధికంగా పతనమైన షేరు ఇదే. అదాని పోర్ట్స్, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీలు 2.7 శాతం వరకూ క్షీణించాయి. యాక్సిస్‌ బ్యాంక్, మహింద్రా, టెక్‌ మహింద్రా, ఐటీసీలు స్వల్పంగా పెరిగాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement