ఇన్ఫీ ప్రమోటర్లకు జాక్‌పాట్! | Infosys Founders Including Murthy Sell Stakes for $1.1 Billion | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ ప్రమోటర్లకు జాక్‌పాట్!

Published Tue, Dec 9 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

ఇన్ఫీ ప్రమోటర్లకు జాక్‌పాట్!

ఇన్ఫీ ప్రమోటర్లకు జాక్‌పాట్!

వాటాల అమ్మకంతో రూ.6,500 కోట్లు...

3.26 కోట్ల షేర్లను విక్రయించిన నలుగురు సహ వ్యవస్థాపకులు...
జాబితాలో నారాయణ మూర్తి, శిబులాల్, నీలేకని, దినేశ్
ఇంకా కంపెనీలో 5.2% మేర వాటా..
దీని విలువ దాదాపు 18,000 కోట్లు..
5% పైగా పడిపోయిన షేరు విలువ..

 
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు అదిరిపోయే లాభాలను సొంతం చేసుకున్నారు. కంపెనీని స్థాపించిన దాదాపు 35 ఏళ్ల తర్వాత భారీస్థాయిలో వాటాలను విక్రయించడం ద్వారా నలుగురు ప్రమోటర్లు, వాళ్ల కుటుంబ సభ్యులు ఏకంగా రూ.6,500 కోట్ల మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. సహ వ్యవస్థాపకులైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, ఎస్‌డీ శిబులాల్, నందన్ నీలేకని, కె.దినేశ్‌లు సోమవారం ఈ భారీ డీల్‌తో స్టాక్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచారు. కంపెనీ సీఈఓగా తొలిసారి బయటివ్యక్తి విశాల్ సిక్కా పగ్గాలు చేపట్టడం.. బోనస్ షేర్ల జారీ నేపథ్యంలో వాటాలను విక్రయించడం గమనార్హం. ఇంత భారీ అమ్మకం కారణంగా ఇన్ఫీ షేరు ధర 5% పైగా పతనమైంది.
 
బెంగళూరు: ఇన్ఫోసిస్... దేశీ స్టాక్ మార్కెట్లో సోమవారం ఒక కుదుపు కుదిపింది. కంపెనీ సహ వ్యవస్థాపకులైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, ఎస్‌డీ శిబులాల్, నందన్ నీలేకని, కె. దినేశ్.. వాళ్ల కుటుంబ సభ్యులు తమ వాటాల్లో కొంత భాగాన్ని బల్క్ డీల్ ద్వారా విక్రయించారు. 3.26 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా దాదాపు రూ.6,500 కోట్ల మొత్తం లభించింది. ఒక్కో షేరును రూ.1,988 చొప్పున విక్రయించినట్లు సమాచారం.

బీఎస్‌ఈలో శుక్రవారం నాటి ముగింపు ధర రూ.2,069తో పోలిస్తే ఇది 4 శాతం మేర తక్కువ కావడం గమనార్హం. ఈ భారీ డీల్‌ను విదేశీ బ్రోకరేజి దిగ్గజం డాయిష్ బ్యాంక్ పూర్తి చేసింది. ఇంత భారీ స్థాయిలో షేర్లు చేతులుమారడంతో కంపెనీ షేరు ధర భారీగా పడింది. ఒకానొకదశలో 5 శాతం పైగా పడిపోయి రూ.1,958 స్థాయికి దిగజారింది. చివరకు 4.88 శాతం నష్టపోయి... రూ.1,968 వద్ద స్థిరపడింది.  కాగా, కంపెనీ మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే సుమారు రూ.12,000 కోట్లు ఆవిరైంది.

ఇంకా 5.2 శాతం వాటా....
ఈ నలుగురు ప్రమోటర్లు, వాళ్ల కుటుంబీకులకు ఇప్పటిదాకా కంపెనీ మొత్తం ఈక్విటీలో 12.4 కోట్ల షేర్లు(సుమారు 8 శాతం వాటా) ఉన్నాయి. తాజాగా విక్రయించిన 3.26 కోట్ల షేర్లు.. మొత్తం కంపెనీ ఈక్విటీలో సుమారు 2.8 శాతం వాటాకు సమానం. అంటే ఇంకా 5.2 శాతం వాటా ఈ నలుగురు సహ వ్యవస్థాపకులు(ప్రమోటర్లు), వాళ్ల కుటుంబీకులకు ఉన్నట్లు లెక్క. దీని విలువ సోమవారం షేరు ముగింపు ధరతో చూస్తే... సుమారు రూ.18,000 కోట్ల పైమాటే కావడం గమనార్హం.

కాగా, 1981లో కంపెనీని స్థాపించిన ఏడుగురు సహ వ్యవస్థాపకుల(అశోక్ అరోరా, క్రిష్ గోపాలకృష్ణన్, ఎన్‌ఎస్ రాఘవన్‌లతో కలిపి) మొత్తం వాటా ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి దాదాపు 15.9%. దీనిలో ఇప్పుడు నలుగురు ప్రమోటర్ల వాటా అమ్మకాన్ని(2.8 శాతం) తీసేస్తే.. 13.1 శాతంగా లెక్కతేలుతోంది. ఇక ఈ సెప్టెంబర్ చివరికి విదేశీ ఇన్వెస్టర్లకు 42.67% వాటా, దేశీ సంస్థల(డీఐఐ)కు 14.68%, కార్పొరేట్లు.. రిటైల్ ఇన్వెస్టర్లు, ఇతరులకు 26.93% వాటాలు ఉన్నాయి.

కొత్త సీఈఓ రాకతో...
గడిచిన రెండేళ్లుగా ఐటీ రంగంలోని ఇతర పోటీ కంపెనీలతో పోలిస్తే ఇన్ఫోసిస్ అటు వ్యాపారపరంగా.. ఇటు స్టాక్ మార్కెట్లో షేరు విలువ పరంగా కూడా వెనుకబడిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడం.. ఆయన కుమారుడు రోహన్ మూర్తిని తనకు సహాయకుడిగా నియమించుకోవడం జరిగాయి. అయితే, ఈ చర్యలపై ఇన్వెస్టర్లతో పాటు అటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సుమారు 14 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఇన్ఫోసిస్‌ను వదిలిపెట్టారు కూడా. ఈ నేపథ్యంలో సీఈఓ వేట ప్రారంభించిన కంపెనీ.. జర్మనీ ఐటీ దిగ్గజం శాప్(ఎస్‌ఏపీ)కి చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్.. విశాల్ సిక్కాను సారథిగా నియమించింది.

నారాయణమూర్తితో పాటు అప్పటి సీఈఓ శిబులాల్, క్రిస్ గోపాల కృష్ణన్ కూడా కంపెనీ పదవుల నుంచి వైదొలిగారు. కాగా, ఆగస్టులో సిక్కా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఫీ షేరు ఇప్పటిదాకా 20 శాతం పైగానే దూసుకెళ్లింది. షేరు ధర ఆల్‌టైమ్ గరిష్టమైన రూ.4,400 స్థాయిని కూడా అందుకుంది. రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా అనూహ్యంగా ఒక్కో షేరుకి మరో షేరును బోనస్‌గా కంపెనీ ప్రకటించడం తెలిసిందే. ఇటీవలే ఈ బోనస్ ఇష్యూ అమల్లోకి రావడంతో షేరు విలువ సగమైంది.
 
విశ్లేషకులు ఏమంటున్నారు...
సహ వ్యవస్థాపకుల వాటా విక్రయం వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ‘కార్పొరేట్ నైతిక నియమావళి(గవర్నెన్స్) విషయంలో అత్యున్నత ప్రమాణాలను ఇన్ఫీ నెలకొల్పింది. ఇది ఇకపైనా కొనసాగనుంది. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఈ ప్రమోటర్లు, వాళ్ల కుటుంబీకులెవరూ పాలుపంచుకోవడం లేదు.

అందువల్ల భారీగా షేర్ల విక్రయం వల్ల స్టాక్ ధరపై తక్షణం కొంత ప్రభావం ఉన్నప్పటికీ.. కంపెనీ మూలాలు పటిష్టంగానే ఉన్నందున భవిష్యత్తుకు ఢోకా లేదు’ అని బ్రోకరేజి సంస్థ ప్రభుదాస్ లీలాధర్ అభిప్రాయపడింది. టీసీఎస్‌తో పోలిస్తే ఇన్ఫోసిస్ కాస్త వెనుకబడినప్పటికీ.. సిక్కా ఆగమనంతో మళ్లీ పునర్‌వైభవం దిశగా అడుగులేస్తోందని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ మాయురేష్ జోషీ అన్నారు. వ్యవస్థాపకుల వాటా విక్రయంవల్ల కంపెనీ ఫండమెంటల్స్‌పై ప్రభావమేమీ ఉండబోదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement