ఇన్ఫోసిస్ సీఈవోగా విశాల్ సిక్కా
బెంగళూరు : దేశంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ కొత్త సిఈఓగా విశాల్ సిక్కా పేరు ఖరారు అయ్యింది. మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆయనే చేపట్టనున్నారు. ఆగస్ట్ 1వ తేదీ నుంచి విశాల్ సిక్కా ఇన్ఫీ పగ్గాలు చేపడతారు. ఆయన శిబూలాల్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పిహెచ్‌డీ చేసిన సిక్కా.. ఎస్ఏపీ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఎస్ఏపీలో క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ అప్లికేషన్ల ఎనాలసిస్‌ల విభాగాలను నిర్వహిస్తున్నారు.
మరోవైపు నారాయణ మూర్తి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతారు. గౌరవ అధ్యక్షుడిగా మాత్రం కొనసాగతారు. కొత్త సీఈఓ వార్త నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ధర లాభపడింది. ఈరోజు మళ్లీ ఒక శాతానికి పైగా నష్టపోతోంది. ప్రస్తుతం 3,150కి సమీపంలో ట్రేడవుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఇన్ఫోసిస్ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అందరూ వెళ్లిపోతున్న నేపథ్యంలో కొత్త సీఈఓ రావడం కంపెనీకి కాసింత పాజిటివ్ న్యూసేనని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అయితే కంపెనీ గత వైభవాన్ని తీసుకురావడం మాత్రం చాలా పెద్ద సవాల్ అని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా రిటైర్ మెంట్ తర్వాత నారాయణమూర్తి మళ్లీ ఇన్పోసిస్ కంపెనీలో చేరిన గత 12 నెలల్లో 12 మంది రాజీనామా సమర్పించారు.