
ఇన్ఫీలో ‘సిక్కా’ కలకలం..!
సీఈఓ విశాల్ సిక్కా వేతనం పెంపుపై వ్యవస్థాపకుల కన్నెర్ర!
• అభ్యంతరం తెలుపుతూ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు...
• కంపెనీ ప్రయోజనాల కోసమేనన్న ఇన్ఫీ
• అన్ని అంశాలనూ సవివరంగా వెల్లడించినట్లు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లో కార్పొరేట్ యుద్ధం పూర్తిగా సద్దుమణగకముందే... మరో ప్రతిష్టాత్మక కంపెనీలో కలకలం మొదలైంది. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లోనూ ‘టాటా’ తరహా ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా వేతనాన్ని భారీగా పెంచడం పట్ల వ్యవస్థాపకులు కన్నెర్రజేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. సిక్కాతో పాటు కంపెనీని వీడిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా వీడ్కోలు ప్యాకేజీ ఇవ్వటంపైనా ప్రమోటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారని సమాచారం. ఈ అంశాలపై కంపెనీ కీలక వ్యవస్థాపకులు ఎన్.ఆర్.నారాయణ మూర్తి, క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నీలేఖని గత నెలలో ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు లేఖ రాసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
దీంతో ఇన్ఫీ ఇన్వెస్టర్లలో కలకలం మొదలైంది. ఇప్పటికే ప్రతికూల వ్యాపార పరిస్థితులతో భారీగా పడిపోతూ వస్తున్న కంపెనీ షేరు ధరపై... ప్రమోటర్లు, సీఈఓల మధ్య విభేదాలు మరింత ప్రభావం చూపుతాయన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. 2016 డిసెంబర్ చివరినాటికి ఉన్న గణంకాల ప్రకారం చూస్తే... ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు (వారి కుటుంబ సభ్యులతో కలిపి) కంపెనీలో 12.75 శాతం వాటా ఉంది. ఎక్కువ మంది స్వతంత్ర డైరెక్టర్లే ఉన్న బోర్డులో... వీరెవరూ లేరు కూడా.
అబ్బే.. అంతా కంపెనీ మంచికే: ఇన్ఫీ
సీఈఓ, వ్యవస్థాపకుల మధ్య పాలనపరమైన అగ్గి రాజుకుందన్న వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ బుధవారం వివరణ ఇచ్చింది. సిక్కా వేతనం పెంపు, ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆఫర్ చేసిన రాజీనామా ప్యాకేజీలను సమర్థించుకుంది. ‘పూర్తిగా కంపెనీ ప్రయోజనాల మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. బోర్డులో అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం జరిగింది’ అని ఇన్ఫోసిస్ ఈ–మెయిల్ ప్రకటనలో పేర్కొంది. ప్రమోటర్లతో పాటు ఇతర వాటాదారులు అన్ని పక్షాల నుంచి తీసుకున్న సూచనలు, అభిప్రాయాలను బోర్డు పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏ అంశంపైనయినా నిర్ణయం తీసుకుంటుందని ప్రకటనలో ఇన్ఫీ వివరించింది.
ఏం జరిగిందంటే: ఇన్ఫోసిస్‌కు నేతృత్వం వహించేందుకు తొలిసారి బయటి వ్యక్తి (ప్రమోటర్ కాని) విశాల్ సిక్కాను సీఈఓగా తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సిక్కా వచ్చాక కంపెనీ పనితీరు కాస్త మెరుగుపడిందన్న భరోసా అటు ఇన్వెస్టర్లలోనూ ఇటు ప్రమోటర్లలోనూ నెలకొంది. ఎస్‌డీ శిబులాల్ (చిట్టచివరి ప్రమోటర్ సీఈఓ) నుంచి 2014 ఆగస్టు 1న సిక్కాకు పగ్గాలు అప్పగించిన తర్వాత ఇన్ఫోసిస్ పాలనా వ్యవహరాల్లో వ్యవస్థాపకులు పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాల్లేవు. అయితే, గతేడాది ఇన్ఫోసిస్ బోర్డు... సిక్కా పదవీ కాలాన్ని 2021 వరకూ పొడిగించడమే కాకుండా ఆయన వార్షిక వేతన ప్యాకేజీని భారీగా 11 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 74 కోట్లు) పెంచింది.
ఇందులో బేస్ శాలరీ 1 మిలియన్ డాలర్లు, పనితీరు ఆధారిత వేరియబుల్ పే 3 మిలియన్ డాలర్లు కాగా, మిగతాది స్టాక్స్ రూపంలో చెల్లిస్తారు. పాత ఒప్పందం ప్రకారం ఆయన మొత్తం వార్షిక ప్యాకేజీ 7.08 మిలియన్ డాలర్లు. ఇప్పుడు గ్లోబల్ ఐటీ కంపెనీల సీఈఓల స్థాయికి సిక్కా వేతనం చేరింది. ఇన్ఫీ మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సల్, మాజీ జనరల్ కౌన్సిల్ డేవిడ్ కెన్నడీలకు కూడా కంపెనీ నుంచి వైదొలగినందుకుగాను భారీ ప్యాకేజీలనే ఇన్ఫీ ఆఫర్ చేసింది. బన్సల్ 2014–15లో వేతన ప్యాకేజీ కింద రూ. 4.72 కోట్లు తీసుకోగా.. ఆయనకు వీడ్కోలు ప్యాకేజీ రూపంలో రూ.23.02 కోట్లను ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఓకే చెప్పింది. కెన్నడీ ఈ ఏడాది జనవరిలో ఇన్ఫీని వీడారు. ఆయనకు రాజీనామా ప్యాకేజీ, ఇతరత్రా చెల్లింపుల రూపంలో 8,68,250 డాలర్లు(దాదాపు రూ.5.85 కోట్లు) చెల్లించేందుకు ఇన్ఫీ అంగీకరించింది. ఇంత భారీ స్థాయి చెల్లింపుల పట్ల వ్యవస్థాపకులు తీవ్ర ఆందోళేన వ్యక్తం చేస్తూ.. బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం.
షేర్ల బైబ్యాక్?
అమెరికాలో హెచ్1బీ వీసాలపై నియంత్రణ ఆందోళనలు, ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) వంటి పరిణామాలు ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్న భయాలతో కొంత కాలంగా ఐటీ షేర్లు తిరోగమనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇన్ఫీ షేరు కూడా గత కొంతకాలంగా పడుతూవస్తోంది. గతేడాది జూన్‌లో 52 వారాల గరిష్ట స్థాయి(రూ.1,278)న నుంచి క్రమంగా క్షీణిస్తూ నవంబర్‌లో రూ. 900(52 వారాల కనిష్టం)కు పడిపోయింది. మం గళవారం ఇన్ఫీ షేరు ధర బీఎస్‌ఈలో దాదాపు 1% దిగజారి రూ.936 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.2,15,097 కోట్లు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచేం దుకు కంపెనీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించే యోచనలో ఉంది. రూ.12,000 కోట్లను ఈ బైబ్యాక్‌కు వినియోగించనుందని సమాచారం. కీలక వాటాదారులు, వ్యవస్థాపకుల నుంచి బైబ్యాక్‌కు ఆమో దం లభించాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇన్ఫీ వద్ద రూ.35 వేల కోట్ల భారీ నగదు నిల్వలు ఉన్నాయి.
బోర్డు సమాధానం ఇవ్వాలి: మోహన్‌దాస్ పాయ్
సిక్కా, మరో ఇద్దరికి భారీ ప్యాకేజీలు ఇవ్వడంపట్ల ఇన్షోసిస్ వ్యవస్థాపకులు ఆందోళన వ్యక్తం చేశారన్న వార్తలపై కంపెనీ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ స్పందించారు. వ్యవస్థాపకులకు ఆయన మద్దతు పలికారు. కంపెనీ ప్రయోజనాలమేరకే అంటూ నామమాత్ర ప్రకటనకాకుండా.. సవివరంగా సమాధానాన్ని బోర్డు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘కంపెనీని నెలకొల్పి అద్భుతమైన విలువను చేకూర్చిన వ్యవస్థాపకులు సీరియస్ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సహజమే. ఇప్పటివరకూ భారత్‌లో ఏ సీఎఫ్‌ఓకూ ఇంత భారీ వీడ్కోలు ప్యాకేజీ(24 నెలల వేతనం–బన్సల్‌ను ఉద్దేశిస్తూ) ఇవ్వడం నేను చూడలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.