ఇన్ఫీ సీక్రెట్స్ బయటపెట్టిన విశాల్ సిక్కా
ఇన్ఫీ సీక్రెట్స్ బయటపెట్టిన విశాల్ సిక్కా
Published Fri, Jul 14 2017 12:19 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తమ కంపెనీ సీక్రెట్లను బయటపెట్టారు. భవిష్యత్తులో తమ కంపెనీ వృద్ది కోసం వేటివేటిపై దృష్టిసారించనున్నారో జూన్ క్వార్టర్ ఫలితాల సమీక్ష సందర్భంగా వెల్లడించారు. తమ రెవెన్యూలను పెంచుకోవడానికి ఎక్కువగా కొత్త టెక్నాలజీపై ఫోకస్ చేయనున్నట్టు చెప్పారు. రోబోటిక్స్, ఏఐ, డ్రైవర్‌లెస్ కార్లు వీటిలో ప్రధానమైనవిగా వివరించారు. మైసూర్‌లో ఉన్న సంస్థ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో పూర్తిగా డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధికే కేటాయించినట్టు చెప్పారు. ఎవరు చెప్పారు తాము ట్రాన్సఫర్మేటివ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయమని అని ప్రశ్నించారు. డ్రైవర్‌లెస్ కారు తాము ఎక్కువగా ఫోకస్ చేసిన టెక్నాలజీలో ఒకటని, తమ రెవెన్యూలో 10 శాతం కొత్త టెక్నాలజీలు, సర్వీసుల నుంచే వచ్చాయని పేర్కొన్నారు.
తాము రెవెన్యూలు ఆర్జించిన ఈ సర్వీసులు, టెక్నాలజీలు రెండేళ్ల క్రితం అసలు మార్కెట్లో లేనేలేవని వెల్లడించారు. దీంతో వీటిపై తాము ఎక్కువగా దృష్టిసారించినట్టు చెప్పారు. స్వతంత్ర, అనుసంధాన వాహనాలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ సామర్థ్యాలను ప్రదర్శిస్తామని సిక్కా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వ్యాపార అవకాశాల ప్రాజెక్టులలో పనిచేసే సామర్థ్యమున్న వేలకొద్దీ ఇంజనీర్లను సృష్టిస్తున్నట్టు కూడా తెలిపారు. కాగ, శుక్రవారం ఉదయం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు రూ.3,483 కోట్లగా నమోదుచేసింది. అంచనాల ప్రకారం ఇన్ఫీకి రూ.3,429 కోట్ల లాభాలు మాత్రమే వస్తాయని విశ్లేషకులు భావించారు.
Advertisement
Advertisement