driverless cars
-
‘ఆ కార్లు భారత్‌లోకి ఎప్పటికీ రావు.. రానీయను’
సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. దీన్నే డ్రైవర్ లెస్ కార్, అటానమస్ కార్, రొబోటిక్ కార్ అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. మానవ ప్రమేయం లేకుండా రోడ్లపై పరుగులు తీసే ఈ కార్లు అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇలాంటి డ్రైవర్‌లెస్ కార్లు ఎప్పటికీ భారత్‌లోకి అడుగుపెట్టబోవు అంటున్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఆయన ఎందుకీ మాటన్నారు.. కారణమేంటి అన్నది తెలుసుకుందాం. ఐఐఎం నాగ్‌పూర్ నిర్వహించిన జీరో మైల్ సంవాద్‌లో పాల్గొన్న నితిన్ గడ్కరీ దేశంలో రోడ్డు భద్రత సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను వివరించారు. కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడం, రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం, ఎలక్ట్రిక్ మోటర్స్ చట్టాన్ని బలోపేతం చేసి ప్రమాదాలకు పాల్పడేవారికి పెద్ద ఎత్తున జరిమానాలను విధించడం వంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. డ్రైవర్‌లెస్ కార్లకు ఆస్కారం లేదు భారతదేశంలో డ్రైవర్ రహిత కార్ల ప్రవేశాన్ని నితిన్ గడ్కరీ గట్టిగా వ్యతిరేకించారు. వాటి వల్ల డ్రైవర్లు జోవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరగనివ్వనని, డ్రైవర్ల పొట్టకొట్టే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారతదేశంలోకి రావడాన్ని తాను ఎప్పటికీ అనుమతించనని ఆయన బిజినెస్ టుడేతో స్పష్టం చేశారు. టెస్లాకు చురకలు భారతదేశంలోకి టెస్లాను స్వాగతిస్తున్నామని పేర్కొన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి.. చైనాలో తయారు చేసి ఇక్కడ విక్రయిస్తామంటే మాత్రం కుదరదని స్పష్టం చేశారు. భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్ ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అధునాతన సాంకేతికతను స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. -
ఇక డాక్టర్‌కు కాల్ చేసే డ్రైవర్‌లెస్ కార్లు..
న్యూఢిల్లీ : డ్రైవర్ అవసరం లేకుండా సొంతంగా డ్రైవ్ చేసుకునే (డ్రైవర్‌లెస్ కార్స్) కార్లలో మున్ముందు మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయని ‘మిత్సుబిషి’ కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిరోషి హోనిషి తెలిపారు. ‘కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వారు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? గుండె పోటుకు గురయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు గమనించే సెన్సర్లతోపాటు వారి ఆరోగ్య పరిస్థితి గురించి వెంటనే వారి వైద్యులను సెల్‌ఫోన్ అనుసంధానం ద్వారా అప్రమత్తం చేసే సెన్సర్లు కలిగిన కార్లు 2030 నాటికి మనకు అందుబాటులోకి వస్తాయని హిరోషి తెలిపారు. జపాన్‌కు చెందిన ‘మిత్సుబిషి’ కంపెనీ ‘ఎమిరాయ్ ఎస్’ పేరిట డ్రైవర్‌లెస్ కారును తీసుకొస్తోంది. ఈ కారు మోడల్‌ను ఈరోజు టోక్యోల ప్రారంభమైన కార్ల ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు పెట్టింది. ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 4వ తేదీ వరకు కొనసాగుతోంది. తాము ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ మోడల్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారా, సుఖంగానే ప్రయాణిస్తున్నారా? అన్న అంశాలను పరిశీలించి ప్రయాణికులకు అనుగుణంగా డ్రైవింగ్ మోడ్‌ను మార్చే సెన్సర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారు వాహనాలను నడుపుతుండడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎమర్జెన్సీకి హెచ్చరికలు చేసే సెన్సర్లు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దాన్నే మరింతగా అభివృద్ధి చేస్తే డాక్టర్లను అప్రమత్తం చేసేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం డ్రైవర్‌లెస్ కార్లలో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆ కార్లతో ఉద్యోగాలు పోతాయా?
న్యూఢిల్లీ: గత ఏప్రిల్ నెలలో ‘జనరల్ మోటార్స్’ను కూడా అధిగమించిన అమెరికా కార్ల కంపెనీ ‘తెల్సా’ డ్రైవర్ రహిత కార్ల సాంకేతిక పరిజ్ఞానంలో వేగంగా దూసుకుపోతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగాలు నిర్వహిస్తున్న డెయిమ్లర్, డైటర్, జట్చే, గూగుల్, ఆపిల్ కంపెనీల కన్నా తెల్సా ఎంతో ముందుంది. అయినప్పటికీ బొత్తిగా డ్రైవర్ అవసరం లేకుండా పూర్తిగా దానంతట అదే నడిచే కార్లు వినియోగదారుడి వద్దకు చేరాలంటే ఎంత లేదన్నా ఇంకా దశాబ్ద కాలం పడుతుంది. ట్రాఫిక్ సెన్స్ లేకుండా అడ్డదిట్టంగా నడిచే వాహనాల మధ్య, గుంతలుపడి అధ్వాన్నంగా ఉండే భారతీయ రోడ్లపైకి ఈ డ్రైవర్ రహిత కార్లు రావాలంటే మరో రెండు దశాబ్దాలు కావాల్సిందే. అప్పటివరకు ఆగకుండా మన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీగారు కంగారుపడి కోట్ల మంది డ్రైవర్ల ఉద్యోగాలను కొల్లగొట్టే డ్రైవర్ రహిత వాహనాలను భారత్‌లో అనుమతించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు. డ్రైవర్ రహిత కార్లపై గడ్కరి ఆందోళన వ్యక్తం చేయడంలో అర్థమేమైనా ఉందా? కార్లు లేనప్పుడు బండ్లు, రిక్షాలు, టాంగాలపై ప్రజలు ప్రయాణించారు. వాటిని నడిపే మనుషుల పొట్ట కొట్టుతాయనుకుంటే నేడు కార్లు వచ్చేవా? భారత్‌లో వాషింగ్ మెషిన్లు విరివిగా అందుబాటులోకి వచ్చినప్పుడు దోబీలు ఏమయ్యారు? 1970, 1980 దశకాల్లో భారత్‌లో కంప్యూటరీకరణ వేగం పుంజుకున్నప్పుడు ఎంతమంది ఉద్యోగాలు పోలేదు! పోతాయనుకుంటే ఆ ఉద్యోగాలు మాత్రమే పోతాయి. వాటిస్థానంలో అంతకన్నా ఎక్కువ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వస్తాయి. ఇంటింటికి ఇస్త్రీ పెట్టలున్నా, వాషింగ్ మెషిన్లు వచ్చినా దోబీలకు ఏమాత్రం డిమాండ్ తగ్గకపోగా డిమాండ్ పెరిగిదంటే అతిశయోక్తి కాదు. కంప్యూటర్ల విప్లవంతో పోయినా ఉద్యోగాలకన్నా ఐటీలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంతో ఎక్కువన్నది అందరికీ తెల్సిందే. ఇప్పుడు పడిపోతున్న ఆ రంగం గురించి ఆలోచించడంలో అర్థం ఉంటుంది. పాత టెక్నాలజీ స్థానంలో వచ్చే కొత్త టెక్నాలజీ ఎప్పుడూ పురోగమనాన్ని కోరుకుంటుంది. ఈ పురోగమనంలో పాత ఉద్యోగాలు పోతుంటాయి. కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. అది సహజ సిద్దాంతం. దశాబ్దంలోగా డ్రైవర్ రహిత కార్లు వినియోగదారులకు చేరినా కొంతకాలంపాటు పర్యవేక్షకుడిలా వాటికీ డ్రైవర్ అసరమే. కాకపోతే డ్రైవర్ స్థానంలో సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన చాఫర్లు వచ్చి చేరవచ్చు. ఇప్పటికే ఈ ప్రజా రవాణా రంగంలో ‘రైడ్ హేలింగ్ యాప్స్’ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఉబర్, ఓలా లాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటివల్ల ఆటో డ్రైవర్లు రోడ్డున పడతారని ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. కారు డ్రైవింగ్ వచ్చిన వారు ఆటోడ్రైవర్లలో ఎక్కువమంది క్యాబ్ డ్రైవర్లుగా మారిపోయారు. ఇంకా ఆటోలనే నడుపుతున్న డ్రైవర్లను ఓలా లాంటి కంపెనీలు తమ నెట్‌వర్క్‌లో చేర్చుకున్నాయి. కొత్తగా వచ్చే మార్పు వల్ల ఎన్ని ఉద్యోగాలు పోతాయో, ఆ మార్పు ప్రభావం ఎలా ఉంటుందో కచ్చితంగా ఎవరూ ముందుగా ఊహించలేరు. ఆ మార్పుతోపాటే మరెన్నో మార్పులు సంభవిస్తూ పాత ఉద్యోగాలు పోతూ కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. కొత్తను ఆహ్వానించినప్పుడే ముందుకుపోగలం. -
ఇన్ఫీ సీక్రెట్స్ బయటపెట్టిన విశాల్ సిక్కా
న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తమ కంపెనీ సీక్రెట్లను బయటపెట్టారు. భవిష్యత్తులో తమ కంపెనీ వృద్ది కోసం వేటివేటిపై దృష్టిసారించనున్నారో జూన్ క్వార్టర్ ఫలితాల సమీక్ష సందర్భంగా వెల్లడించారు. తమ రెవెన్యూలను పెంచుకోవడానికి ఎక్కువగా కొత్త టెక్నాలజీపై ఫోకస్ చేయనున్నట్టు చెప్పారు. రోబోటిక్స్, ఏఐ, డ్రైవర్‌లెస్ కార్లు వీటిలో ప్రధానమైనవిగా వివరించారు. మైసూర్లో ఉన్న సంస్థ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో పూర్తిగా డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధికే కేటాయించినట్టు చెప్పారు. ఎవరు చెప్పారు తాము ట్రాన్సఫర్మేటివ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయమని అని ప్రశ్నించారు. డ్రైవర్‌లెస్ కారు తాము ఎక్కువగా ఫోకస్ చేసిన టెక్నాలజీలో ఒకటని, తమ రెవెన్యూలో 10 శాతం కొత్త టెక్నాలజీలు, సర్వీసుల నుంచే వచ్చాయని పేర్కొన్నారు. తాము రెవెన్యూలు ఆర్జించిన ఈ సర్వీసులు, టెక్నాలజీలు రెండేళ్ల క్రితం అసలు మార్కెట్లో లేనేలేవని వెల్లడించారు. దీంతో వీటిపై తాము ఎక్కువగా దృష్టిసారించినట్టు చెప్పారు. స్వతంత్ర, అనుసంధాన వాహనాలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ సామర్థ్యాలను ప్రదర్శిస్తామని సిక్కా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వ్యాపార అవకాశాల ప్రాజెక్టులలో పనిచేసే సామర్థ్యమున్న వేలకొద్దీ ఇంజనీర్లను సృష్టిస్తున్నట్టు కూడా తెలిపారు. కాగ, శుక్రవారం ఉదయం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు రూ.3,483 కోట్లగా నమోదుచేసింది. అంచనాల ప్రకారం ఇన్ఫీకి రూ.3,429 కోట్ల లాభాలు మాత్రమే వస్తాయని విశ్లేషకులు భావించారు. -
ఇంటెల్ భారీ కొనుగోలు
జెరూసలెం: అమెరికాకు చెందిన కంప్యూటర్ చిప్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ డ్రైవర్ లెస్ కారును అందుబాటులోకి తెచ్చే యోచనలో భారీ డీల్ కుదుర్చుకుంది. ఇజ్రాయిల్ కంప్యూటర్ కంపెనీ..మొబైల్ ఐ కంపెనీని కొనుగోలు చేసింది. డ్రైవర్ లెస్ టెక్నాలజీలో విశేష కృషి చేస్తున్న మొబైల్ ఐ ని 15 బిలియన్ డాలర్లకు (దాదాపు లక్షలకోట్ల రూపాయలు) కి సొంతం చేసుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు సోమవారం ఒక ప్రకటన జారీ చేశాయి. రాబోయే తొమ్మిది నెలల్లో ఈ ఒప్పందం పూర్తికానుందని తెలిపాయి. డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తీసుకు రావడానికి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్న నేపథ్యంలో ఈ డీల్ భారీ ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ వాటాదారులకు,ఆటోమోటివ్ పరిశ్రమకు ఇది గొప్పముందడుగు అని ఇంటెల్ సీఈవో బ్రియాన్ క్రజానిచ్ తెలిపారు. డ్రైవింగ్ లెస్ కారు ఆవిష్కరణను వేగవంతం చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రక్రియలో ఇంటెల్ కీలకమైన, పునాది సాంకేతికలను అందిస్తోంటే, మొబైల్ ఐ పరిశ్రమకు ఉత్తమ ఆటోమోటివ్ గ్రేడ్ కంప్యూటర్ విజన్ అందిస్తోంది. దీంతో ఇకముందు తమ భాగస్వామ్యంలో తక్కువ ఖర్చుతో, మెరుగైన ప్రదర్శనతో క్లౌడ్ టు-కారు సొల్యూషన్ తో భవిష్యత్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మరింత వేగంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. 2030 నాటికి డ్రైవర్ లెస్ కార్ మార్కెట్ వాల్యూ 70 బిలియన్ డాలర్లుగా ఉండనుందని ఇంటెల్ అంచనా వేస్తోంది. ప్రముఖ కార్ల ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్‌తో తమ సంబంధాలు యధావిథిగా కొనసాగుతాయని మొబైల్ ఐ ప్రకటించింది. ప్రస్తుత ఉత్పత్తి లో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. అటు ఇది అతి భారీ కొనుగోలు అని ఇజ్రాయిల్ మీడియా నివేదించింది. ఆటోమేటివ్ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలకు నాంది కానుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కాగా మొబైల్ ఐ ఇప్పటికే ప్రపంచ కారు దిగ్గజాలు బీండబ్ల్యు, ఫోక్స్‌వాగన్ లాంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే మేపింగ్ సేవల సంస్థ హియర్ (HERE) సంస్థలో డాటా షేరింగ్ ఒప్పందం కూడా ఉంది. 1999లో స్థాపించిన మొబైల్ ఐ 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ అయింది. 2007లో గోల్డ్మన్సాచి 130 మిలియన్ల డాలర్ల పెట్టుబడుల అనంతరం వాహన ప్రమాదాలను, మరణాలను అరికట్టేందుకు ఓ మిషన్‌ను ప్రారంభించింది. ఈ వార్తలతో మొబైల్ ఐ షేరు అమెరికా మార్కెట్ లోదాదాపు 32 శాతం లాభపడి ఆల్ టైం గరిష్టాన్నినమోదు చేసింది. మరోవైపు గత ఏడాది 2021 నాటికి డ్రైవర్ లెస్ కారును అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటెల్, మొబైల్ ఐ కంపెనీలతో జత కట్టింది మరో కార్ల దిగ్గజం బీఎండబ్ల్యు. అమెరికా, యూరప్‌లో దాదాపు 40 సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టనున్నట్టు గత జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.