న్యూఢిల్లీ : డ్రైవర్ అవసరం లేకుండా సొంతంగా డ్రైవ్ చేసుకునే (డ్రైవర్‌లెస్ కార్స్) కార్లలో మున్ముందు మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయని ‘మిత్సుబిషి’ కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిరోషి హోనిషి తెలిపారు. ‘కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వారు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? గుండె పోటుకు గురయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు గమనించే సెన్సర్లతోపాటు వారి ఆరోగ్య పరిస్థితి గురించి వెంటనే వారి వైద్యులను సెల్‌ఫోన్ అనుసంధానం ద్వారా అప్రమత్తం చేసే సెన్సర్లు కలిగిన కార్లు 2030 నాటికి మనకు అందుబాటులోకి వస్తాయని హిరోషి తెలిపారు.
జపాన్‌కు చెందిన ‘మిత్సుబిషి’ కంపెనీ ‘ఎమిరాయ్ ఎస్’ పేరిట డ్రైవర్‌లెస్ కారును తీసుకొస్తోంది. ఈ కారు మోడల్‌ను ఈరోజు టోక్యోల ప్రారంభమైన కార్ల ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు పెట్టింది. ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 4వ తేదీ వరకు కొనసాగుతోంది. తాము ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ మోడల్‌లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారా, సుఖంగానే ప్రయాణిస్తున్నారా? అన్న అంశాలను పరిశీలించి ప్రయాణికులకు అనుగుణంగా డ్రైవింగ్ మోడ్‌ను మార్చే సెన్సర్లు ఉన్నాయని ఆయన తెలిపారు.
వృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారు వాహనాలను నడుపుతుండడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎమర్జెన్సీకి హెచ్చరికలు చేసే సెన్సర్లు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దాన్నే మరింతగా అభివృద్ధి చేస్తే డాక్టర్లను అప్రమత్తం చేసేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం డ్రైవర్‌లెస్ కార్లలో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment