సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. దీన్నే డ్రైవర్ లెస్ కార్, అటానమస్ కార్, రొబోటిక్ కార్ అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. మానవ ప్రమేయం లేకుండా రోడ్లపై పరుగులు తీసే ఈ కార్లు అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇలాంటి డ్రైవర్‌లెస్ కార్లు ఎప్పటికీ భారత్‌లోకి అడుగుపెట్టబోవు అంటున్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఆయన ఎందుకీ మాటన్నారు.. కారణమేంటి అన్నది తెలుసుకుందాం.
ఐఐఎం నాగ్‌పూర్ నిర్వహించిన జీరో మైల్ సంవాద్‌లో పాల్గొన్న నితిన్ గడ్కరీ దేశంలో రోడ్డు భద్రత సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను వివరించారు. కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడం, రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం, ఎలక్ట్రిక్ మోటర్స్ చట్టాన్ని బలోపేతం చేసి ప్రమాదాలకు పాల్పడేవారికి పెద్ద ఎత్తున జరిమానాలను విధించడం వంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
డ్రైవర్‌లెస్ కార్లకు ఆస్కారం లేదు
భారతదేశంలో డ్రైవర్ రహిత కార్ల ప్రవేశాన్ని నితిన్ గడ్కరీ గట్టిగా వ్యతిరేకించారు. వాటి వల్ల డ్రైవర్లు జోవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరగనివ్వనని, డ్రైవర్ల పొట్టకొట్టే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారతదేశంలోకి రావడాన్ని తాను ఎప్పటికీ అనుమతించనని ఆయన బిజినెస్ టుడేతో స్పష్టం చేశారు.
టెస్లాకు చురకలు
భారతదేశంలోకి టెస్లాను స్వాగతిస్తున్నామని పేర్కొన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి.. చైనాలో తయారు చేసి ఇక్కడ విక్రయిస్తామంటే మాత్రం కుదరదని స్పష్టం చేశారు. భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్ ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అధునాతన సాంకేతికతను స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment