ఐటీ ఇండస్ట్రీకి విశాల్ సిక్కా గుడ్ న్యూస్
ముంబై : ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కా.. ఇటీవల చేసిన కామెంట్లు ఇండస్ట్రీపై ఆశలు పెంచుతున్నాయి. 2014-15 రెండో క్వార్టర్ నుంచి మొదటిసారి ఐటీ రంగంలో ధర స్థిరత్వం ఉన్నట్టు సిక్కా చెప్పారు. ఇది ఐటీ ఇండస్ట్రీకి పాజిటివ్ డెవలప్ మెంట్ అని బ్రోకరేజ్ యూబీఎస్ అభివర్ణించింది. విశాల్ సిక్కా చేసిన కామెంట్ తో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీలలో భారీ ఎత్తున ఐటీ బడ్జెట్ పెరుగుతాయని, ముఖ్యంగా అమెరికాలో పెరుగుతాయని బ్రోకరేజ్ తెలిపింది. భారతీయ ఐటీ వెండర్స్ కు మేజర్ క్లయింట్స్ గా అమెరికానే ఉండటం విశేషం.
2017లో ఇండస్ట్రి వృద్ధికి కూడా ఇది సహకరించనున్నట్టు పేర్కొంది. మంచి డిమాండ్ పరిస్థితులను ఈ ధర స్థిరత్వ వాతావరణం సూచిస్తుందని బ్రోకరేజ్ సంస్థ వివరించింది. ఆటోమేషన్, వీసా సమస్యలు, రూపాయి విలువ పెరగడం మాత్రమే కాక, సాంప్రదాయ ఐటీ సర్వీసు బిజినెస్ లలో ఒకానొక ప్రధాన సమస్యలో ధరల ఒత్తిడి కూడా ఒకటి. ఈ సమస్యలతో 2016లో బీఎస్ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 5.5 శాతం పడిపోయింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 12.4 శాతం పైకి ఎగిసింది. కానీ ప్రస్తుతం ధరల స్థిరత్వం ఏర్పడటం సానుకూల అంశమని బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది.