రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ వర్గాల అంచనా
ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, జీసీసీల ద్వారా అవకాశాలు
రిటైల్ రంగంలోనూ అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ లెక్కలు
కీలకంగా మారనున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక
ఉద్యోగాల కల్పన, మార్కెట్ వృద్ధి, సామర్థ్యాల పెంపుదల్లో జీసీసీల ముఖ్యపాత్ర
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ఉద్యోగాల కల్పనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి అధునాతన సాంకేతికత కూడా ఈ అంశాన్ని ప్రభావితం చేస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కొత్త ఏడాదిలో తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన జోరందుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐటీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క తెలంగాణలోనే వివిధ రంగాల్లో పది లక్షల మేర సాధారణ ఉద్యోగాల కల్పన సాధ్యమని అంటున్నాయి.
ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాలతో పాటు రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల విభాగం అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని అంటున్నారు. గత ఏడాదిలో తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.8 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గగా, 2025లో ఇది మరింత తగ్గుతుందని వివిధ నివేదికలు వెల్లడిస్తుండటం గమనార్హం.
పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చినట్లు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం ప్రకటించింది. 2023తో పోలిస్తే ఎఫ్‌డీఐల్లో 33 శాతం వృద్ధి నమోదు కాగా, రూ.3,185 కోట్లు అదనంగా వచ్చాయి. 2024లో వచ్చిన ఎఫ్‌డీఐల్లో 93 శాతం అంటే రూ.11,970 కోట్లు హైదరాబాద్‌కు రాగా, రంగారెడ్డి జిల్లాకు రూ.680 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.116 కోట్లు, మెదక్‌కు 96.99 కోట్లు వచ్చాయి.
ఇదేవిధంగా ఎఫ్‌డీఐల రాక కొత్త ఏడాది కూడా కొనసాగుతుందని, ఉద్యోగాల కల్పనకు ఇవి కీలకంగా మారతాయని అధికార వర్గాలంటున్నాయి. ఐటీ రంగంలో గడిచిన రెండేళ్లుగా నెలకొన్న మాంద్యం, భారత్‌లో ఎన్నికల వాతావరణం తదితర కారణాలతో ఉద్యోగ నియామకాలకు దూరంగా ఉన్న అమెరికా, ఐరోపా కంపెనీలు ఈ ఏడాది జరిపే నియామకాల్లో తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
జీసీసీలకు కేంద్రంగా తెలంగాణ
అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటు ద్వారా ఉద్యోగాల కల్పన భారీగా సాధ్యమవుతుందనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీసీసీలను ఆకర్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ, పుణే, ముంబయి, చెన్నై వంటి దేశంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. భారత సాంకేతిక వాతావరణం, ఉద్యోగాల కల్పన, మార్కెట్ వృద్ధి, సామర్థ్యాల పెంపుదల తదితరాల్లో 2030 నాటికి ఈ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు.
గత ఐదేళ్లలో భారత్‌లో ఏర్పాటైన జీసీసీల్లో 30 శాతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 355 జీసీసీలు ఉండగా, సాఫ్ట్‌వేర్/ఇంటర్‌నెట్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఎఫ్‌ఎంసీజీ, సెమికండక్టర్, ఫార్మా స్యూటికల్స్, రిటైల్, మెడికల్ డివైసెస్, టెలీ కమ్యూనికేషన్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఆటోమేటివ్, వృత్తిపరమైన సేవల రంగాల్లో కొత్త జీసీసీల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే జీసీసీలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లోనూ ఏర్పాటు చేయాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సరీ్వస్ కంపెనీస్ (నాస్కామ్) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దేశంలోని జీసీసీల్లో పనిచేస్తున్న 19 లక్షల మంది ఉద్యోగుల్లో 12 శాతం మంది తెలంగాణకు చెందిన నిపుణులే ఉండటం గమనార్హం. ఇది వచ్చే రెండేళ్లలో 15 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంఎస్‌ఎంఈలదీ పెద్ద పాత్రే..
ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ద్వారా రాష్ట్రంలో 5.6 లక్షల మంది ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఎంఎస్‌ఎంఈ పాలసీ ద్వారా ఈ ఏడాది ఈ రంగంలో ఉద్యోగాల కల్పన 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment