మూర్తి లేఖ: ఇన్ఫీలో మళ్లీ చెలరేగిన వివాదం
మూర్తి లేఖ: ఇన్ఫీలో మళ్లీ చెలరేగిన వివాదం
Published Thu, Aug 3 2017 8:27 PM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM
బెంగళూరు : మరోసారి సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, దాని వ్యవస్థాపకులకు లుకలుకలు ప్రారంభమయ్యాయి. పనాయా కొనుగోలుకు సంబంధించిన విచారణ రిపోర్టును బహిర్గతం చేయాలంటూ ఎన్‌ఆర్ నారాయణమూర్తి ఇటీవల బోర్డు సభ్యులకు రాసిన లేఖతో మళ్లీ వివాదాలు చెలరేగాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. 200 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన పనాయా విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆరోపించింది. సెబీ ఆరోపణలపైనా, మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సాల్ సెవరెన్స్ ప్యాకేజీలో తలెత్తిన వివాదం విషయంలోనూ, ప్రస్తుత సీఈవో అత్యధికమైన ఖర్చుల ఆరోపణల విషయంలోనూ కంపెనీ అంతర్గతంగా విచారణ చేపట్టింది. జూన్‌లోనే వీటిపై కంక్లూజిన్ అండ్ సమ్మరీ ఫైండింగ్ స్టేట్‌మెంట్‌ను ప్రచురించింది. పనాయా కేసు, సీఈఓ వ్యయాలు వంటి విషయంలో వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిర్థారణ లేదని గిబ్సన్ డన్ అండ్ క్రుచర్ అనే న్యాయ సంస్థ కూడా పేర్కొంది.
కానీ మొత్తం రిపోర్టులను బహిర్గతం చేయాలని నారాయణమూర్తి డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ రిపోర్టును అందించాలని ఆయన కోరుతున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ రిపోర్టును ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కంపెనీ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఈ రిపోర్టును బహిర్గతం చేస్తే, పనాయా ఇన్వెస్టర్లకు, దాని లిమిటెడ్ పార్టనర్లకు మధ్యనున్న క్లయింట్ రహస్య ఒప్పందాలను ఉల్లంఘించినట్టు అవుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కొనుగోలుచేసిన వాటిలో పనాయా రెండో అతిపెద్ద డీల్. దీంతో మరోసారి కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు వివాదం తలెత్తినట్టు తెలిసింది.
Advertisement
Advertisement