Infosys Board
-
మూర్తి లేఖ: ఇన్ఫీలో మళ్లీ చెలరేగిన వివాదం
బెంగళూరు : మరోసారి సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, దాని వ్యవస్థాపకులకు లుకలుకలు ప్రారంభమయ్యాయి. పనాయా కొనుగోలుకు సంబంధించిన విచారణ రిపోర్టును బహిర్గతం చేయాలంటూ ఎన్ఆర్ నారాయణమూర్తి ఇటీవల బోర్డు సభ్యులకు రాసిన లేఖతో మళ్లీ వివాదాలు చెలరేగాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. 200 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన పనాయా విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆరోపించింది. సెబీ ఆరోపణలపైనా, మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ సెవరెన్స్ ప్యాకేజీలో తలెత్తిన వివాదం విషయంలోనూ, ప్రస్తుత సీఈవో అత్యధికమైన ఖర్చుల ఆరోపణల విషయంలోనూ కంపెనీ అంతర్గతంగా విచారణ చేపట్టింది. జూన్‌లోనే వీటిపై కంక్లూజిన్ అండ్ సమ్మరీ ఫైండింగ్ స్టేట్మెంట్ను ప్రచురించింది. పనాయా కేసు, సీఈఓ వ్యయాలు వంటి విషయంలో వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిర్థారణ లేదని గిబ్సన్ డన్ అండ్ క్రుచర్ అనే న్యాయ సంస్థ కూడా పేర్కొంది. కానీ మొత్తం రిపోర్టులను బహిర్గతం చేయాలని నారాయణమూర్తి డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ రిపోర్టును అందించాలని ఆయన కోరుతున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ రిపోర్టును ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కంపెనీ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఈ రిపోర్టును బహిర్గతం చేస్తే, పనాయా ఇన్వెస్టర్లకు, దాని లిమిటెడ్ పార్టనర్లకు మధ్యనున్న క్లయింట్ రహస్య ఒప్పందాలను ఉల్లంఘించినట్టు అవుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కొనుగోలుచేసిన వాటిలో పనాయా రెండో అతిపెద్ద డీల్. దీంతో మరోసారి కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు వివాదం తలెత్తినట్టు తెలిసింది. -
ఇన్ఫీలో లుకలుకలకు ఫుల్ స్టాప్?
కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ ఇటీవల ఇన్ఫోసిస్ బోర్డులో నెలకొన్న లుకలుకలపై ఆ దిగ్గజ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ఫౌండర్ చైర్మన్ నారాయణమూర్తి ఇక ఫుల్‌స్టాఫ్ చెప్పాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బోర్డుతో నెలకొన్న ఫైటింగ్‌కు ఇక ఇక్కడితో స్వస్తి చెప్తామని నారాయణమూర్తి పేర్కొనట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల తలెత్తిన ప్రశ్నలపై కంపెనీ ఓ డీల్ చేపడుతుందని మూర్తి చెప్పినట్టు సమాచారం. ఇన్ఫోసిస్ కంపెనీ కార్పొరేట్ నైతిక ప్రమాణాలు(గవర్నెన్స్) దిగజారాయని స్వయాన నారాయణ మూర్తే పేర్కొనడంతో ఆ లుకలుకలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. సీఈఓ విశాల్ సిక్కాకు వేతన ప్యాకేజీని భారీగా పెంచడం, మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు పెద్ద మొత్తంలో వీడ్కోలు ప్యాకేజీని ఆఫర్ చేయడంపై ఇన్ఫీ వ్యవస్థాపకులు అభ్యంతరం వ్యక్తం చేశారంటూ వార్తలు గుప్పుమనడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. అయితే, విశాల్ సిక్కా పనితీరుపై నారాయణమూర్తి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ వ్యవహారం ఆయనకు సంబంధించింది కాదన్నారు. '' ఇక ఇక్కడితో ఆపుద్దాం. కంపెనీ ఎక్కువగా వేతనాలు చెల్లించడం వ్యవస్థాపకుల్ని తికమకలో పడేసింది. ప్రస్తుతం దీనిని పరిష్కరించుకుద్దాం. నా దగ్గర సమయం లేదు. బోర్డు కాని, మేనేజ్మెంట్ కాని ఈ విషయంపై సమయం వెచ్చిచవద్దు'' అని మూర్తి చెప్పినట్టు రిపోర్టులు వస్తున్నాయి. వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య నెలకొన్న పరిస్థితులు వృద్ధిని మందగించేలా చేస్తాయని పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ కంపెనీపై ప్రభావం చూపుతుందని మూర్తి ఆందోళన వ్యక్తంచేశారట.. సహవ్యవస్థాపకుల కమ్యూనికేషన్లను హ్యాండిల్ చేయడానికి కంపెనీ ఓ న్యాయసంస్థను ఏర్పాటుచేసిన వెంటనే, మూర్తి సంధికి పిలుపునివ్వడం గమనార్హం.