వ్యక్తిగతంగా వేధించారు: సిక్కా
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవోగా వైదొలగిన విశాల్ సిక్కా కంపెనీ వ్యవస్థాపకులపై విరుచుకుపడ్డారు. ఇన్ఫోసిస్ బోర్డుకు, ఎన్‌ఆర్ నారాయణమూర్తి వంటి హై ప్రొఫైల్ వ్యవస్ధాపకులకు మధ్య తాను నలిగిన తీరును వివరించారు. కంపెనీ సీఈవో విధుల్లో కొనసాగలేనని, నిరాధారమైన విషపూరిత వ్యక్తిగత దాడులను నిలువరిస్తూ పనిచేయలేనని సిక్కా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను ఈ సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు వివరించారు. గత కొన్ని వారాలుగా రాజీనామాపై తాను తర్జనభర్జనలు పడ్డానని, సుదీర్ఘంగా ఆలోచించిన మీదట గత కొన్ని త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎండీ, సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నానన్నారు.
గత మూడేళ్లుగా కంపెనీ ఎన్నో విజయాలను సాధించి, వినూత్న ఒరవడికి బాటలు వేసినప్పటికీ నిరాధార, వ్యక్తిగత దాడులు, ఆరోపణలను తట్టుకుని ఇక తాను పనిచేయలేనని స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా కంపెనీ సాధించిన విజయాల్లో ఉద్యోగులందరి భాగస్వామ్యం ఉందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకూ ఇన్ఫోసిస్ బోర్డు, యాజమాన్యంతో కలిసి పనిచేస్తానని చెప్పారు. నాయకత్వ మార్పిడి జరిగే వరకూ బోర్డులో ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించేందుకు అంగీకరించినట్టు సిక్కా తెలిపారు.