రిపోర్టులపై ఇన్ఫోసిస్ రియాక్షన్...
దేశ కార్పొరేట్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల స్టేక్ అమ్మకం విషయంపై తొలిసారి కంపెనీ నుంచి గట్టి స్పందనే వచ్చింది. ఇన్ఫీ సీఈవో విశాల్ సిక్కా దీనిపై స్పందించారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తాను పూర్తిగా విశ్వసిస్తానని, కానీ ఎన్ఆర్ నారాయణమూర్తినే ఈ అమ్మక విషయాన్ని కొట్టిపారేస్తున్నారని చెప్పారు. ఇవి కేవలం మీడియా రూమర్లు లేదా నిందలేనని తేల్చిచెప్పినట్టు పేర్కొన్నారు. '' ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, ముఖ్యంగా ఎన్ఆర్ నారాయణమూర్తి చాలా ప్రత్యేకమైన, గౌరవప్రదమైన వ్యక్తి. చాలా హుందాతనంగా నడుచుకుంటారు. భారతీయులందరికీ ఆయన హీరో, భారతీయులకే కాక చాలామందికి ఆయన ఆదర్శం. ముఖ్యంగా మూర్తి విషయాన్ని తీసుకుంటే, మూర్తినే నన్ను నియమించుకున్నారు. ఆయన వల్లే నేను ఇన్ఫోసిస్ లోకి వచ్చాను. వారు తీసుకునే ఏ నిర్ణయానైనా నేను విశ్వసిస్తాను, కట్టుబడి ఉంటాను'' అని సిక్కా చెప్పారు.
మూర్తినే ఈ అమ్మక రూమర్లను కొట్టిపారేస్తున్నారని సిక్కా పేర్కొన్నారు. ఈ రూమర్లను మరింత విస్తరించవద్దని తను, తన కొలిగ్స్ కలిసి కోరుకుంటున్నట్టు సిక్కా అభ్యర్థించారు. ఈ రూమర్లు ఇటీవల కాలంలో తమకు చాలా ప్రతికూలంగా మారుతున్నాయని, బిజినెస్ లను దెబ్బతీస్తున్నట్టు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు, బోర్డు సభ్యులకు ఇటీవల చోటుచేసుకున్న లుకలుకలతో ఈ అమ్మక రిపోర్టులు వచ్చాయి. మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ అత్యధిక సెవరెన్స్ వేతనం, ప్రస్తుత సీఈవో, సీఓఓల భారీ వేతన పెంపులో కార్పొరేట్ ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఇన్ఫీ వ్యవస్థాపకులు బహిరంగంగానే కంపెనీ యాజమాన్యంపై మండిపడ్డారు.