ఐటీ మునుపటి కళ తప్పింది: విదేశీ మీడియా
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ పదవులకు విశాల్ సిక్కా రాజీనామా నేపథ్యంలో భారతీయ ఐటీ రంగం ఎగుమతులు గత ఏడేళ్లలో ఎన్నడూలేని విధంగా కుదేలైన తీరును విదేశీ మీడియా విశ్లేషించింది. దేశీయ ఐటీ సేవల ఎగుమతులు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో పతనమవడం ఆందోళన రేకెత్తిస్తున్నదని, కరెంట్ ఖాతా లోటును పెంచడమే కాకుండా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పాలకులు కలత చెందుతున్నట్టు ఫారెన్ మీడియా పేర్కొంది. కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్‌కు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఇబ్బందికరమని వ్యాఖ్యానించింది.
హెచ్1బీ వీసాలపై ట్రంప్ వైఖరి భారత్ ఇంజనీర్లు అమెరికాలో అడుగుపెట్టేందుకు అవరోధమని ఎకనమిక్ సర్వే విస్పష్టంగా పేర్కొనడాన్ని విదేశీ మీడియా ప్రస్తావించింది. ఆటోమేషన్ దెబ్బతో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయన్న వరల్డ్ బ్యాంక్ నివేదిక, 2020 వరకూ భారత్‌లో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కోల్పోతాయని హెడ్ హంటర్స్ ఇండియా అంచనాలూ టెక్నోక్రాట్ల దుస్థితికి అద్దంపడుతున్నాయని పేర్కొంది.