foreign media
-
ఉక్రెయిన్ యుద్ధం.. తర్వాతి లక్ష్యం భారత్?
ఉక్రెయిన్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. డోనెస్క్ అధికారి ఒకరు భారత మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ యుద్ధం అనే వంకతో రష్యాను నాశనం చేసేదాకా వదలవని, ఆపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొన్నారు. డోనెస్క్.. ఉక్రెయిన్ రెబల్ నగరం. రష్యా ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ మిలిటరీ చర్యకు సరిగ్గా కొన్నిరోజుల ముందు స్వతంత్ర ప్రాంతంగా(డోనెస్క్ పీపుల్స్ రిపబ్లిక్)గా ప్రకటించింది. అయితే యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ బలగాలు తిరిగి ఈ ప్రాంతంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా బలగాలు డోన్బస్ వైపు మోహరిస్తుండగా, ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై డోనెస్క్ అధికార ప్రతినిధి ఎడువార్డ్ అలెక్సాండ్రోవిచ్ బసురిన్ స్పందిస్తూ.. సంచలన ఆరోపణలకు దిగాడు. భారత్‌కు చెందిన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్-రష్యా సరిహద్దు ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ.. అమెరికా నేతృత్వంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ పరిణామాల్లో జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ‘‘కానీ, ఇది ఇక్కడితోనే ఆగదు. రష్యాను నాశనం చేస్తేనే కానీ వాళ్లు శాంతించరు. అటుపై శక్తివంతమైన దేశం భారత్‌పై దృష్టి పెడతారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఏదైనా కుట్రకు తెర తీస్తారు. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ ఫలితం ఏంటన్నది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. గొప్ప ఆయుధ సంపత్తి లేకపోయినా బ్రిటిషర్లను తరిమి కొట్టిన పోరాట పటిమ భారతీయులదని కొనియాడిన బసురిన్.. తాము కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ‘మా చరిత్రను వదులుకునేందుకు మేం సిద్ధంగా లేం.. వేరే వాళ్లతో మేమెందుకు కలవాలి?’ అని పునరుద్ఘాటించారు ఆయన. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా పాల్పడుతోంది దురాక్రమణ కాదని, ఏం జరుగుతుందో తాను మొదటి నుంచి కళ్లారా చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘‘ఉక్రెయిన్ ఆర్మీ మాపై(డోనెస్క్, డోన్బస్) పడి.. ప్రజలను పొట్టనబెట్టుకుంటోంది. పరిస్థితి ఉక్రెయిన్ ఆర్మీకి వ్యతిరేకంగా మారడంతో ఇప్పుడు రష్యాను నిందిస్తోంది. ఇది రష్యా దూకుడు కాదు. పాశ్చాత్య దేశాలు, అక్కడి మీడియా అంతా.. రష్యాను నాశనం చేసేందుకు చేస్తున్న ప్రచారం మాత్రమే’’ అని పేర్కొన్నారాయన. చదవండి: రష్యా విజయం సాధించిందన్న జెలెన్ స్కీ -
పాపం.. జిన్‌పింగ్
వాషింగ్టన్: ఏదో అనుకుంటూ.. ఇంకేదో అయ్యిందే అని బాధపడుతున్నారంట చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్. భారత భూభాగంలోకి చొరబడాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఏమైంది.. మనం సైన్యం ప్రతి దాడి చేయడంతో తోక ముడవాల్సిన పరిస్థితి తలెత్తెంది. చైనా సైన్యం దారుణంగా విఫలమయ్యింది. ఈ పరిణామాలు జిన్ పింగ్‌ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదంట. దాంతో చాలా క్రూరమైన ప్రక్షాళన చర్యలకు దిగబోతున్నాడంటూ అమెరికన్ మీడియా కోడై కూస్తూంది. ఈ మేరకు వరుస కథనాలను వెల్లడిస్తోంది. వాటి ప్రకారం తాజాగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు జిన్ పింగ్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించాడట. అతని సైన్యం మీద అపారమైన నమ్మకం ఉంచి.. దూకుడుగా ప్రవర్తించాడట. అయితే భారత్ కూడా అందుకు ధీటుగా బదులివ్వడం.. రక్షణపరంగా వ్యూహత్మకమైన శిఖరాలను ఆదీనంలోకి తీసుకోవడంతో జిన్ పింగ్ షాక్‌కు గురయ్యాడట. ఈ ఊహించని అపజయం అతడిని తీవ్రంగా కలిచి వేస్తున్నట్లు అమెరికన్ మీడియా న్యూస్‌వీక్ కథనం వెలువరించింది. దాంతో జిన్‌పింగ్ దీన్ని ఒక సాకుగా చూపించి తన రక్షణ దళ సలహాదారులను బలవంతంగా తొలగించమే కాక కొత్త వారిని నియమిస్తాడని న్యూస్‌వీక్ వెలువరించింది. ఈ ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్-చైనాల మధ్య ఘర్షణలు జరిగిన నాటి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఆక్రమించుకున్న అత్యున్న పర్వత భూభాగాలను భారత దళాలు స్వాధీనం చేసుకోవడంతో చైనా దళాలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాట. గడిచిన అరశతాబ్ధంలో భారత్ ఎప్పుడు ఇంత దుకుడుగా లేదని.. ఈ చర్యలతో చైనా దళాలు వెనక్కి తగ్గాయని న్యూస్ లింక్ తెలిపింది. అంతేకాక భారత బలగాలను నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా పేలవంగా ఉన్నట్లు తెలిపింది. చైనా గ్రౌండ్ ఫోర్స్‌లు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావవంతంగా పని చేయలేకపోయిందని వివరించింది. ఇది కేవలం 1979లో వియాత్నంకు పాఠం నేర్పించే అంశంలో మాత్రమే విజయం సాధించిందని వెల్లడించినంది. (చదవండి: 'జిన్‌పింగ్ ఓకే అంటేనే లెక్కను వివరిస్తాం') అంతేకాక ప్రస్తుతం భారత దళాలలు ఆక్రమణదారులకు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని.. ప్రస్తుతం చాలా దూకుడుగా.. రక్షణాత్మకంగా ఉన్నారని.. మొత్తానికి భారత్ తన ఆటని పూర్తిగా మార్చవేసిందని కథనం ప్రచురించింది. అయితే ఈ ఎదురుదెబ్బలను పరిగణలోకి తీసుకుని జిన్ పింగ్‌ని తక్కువ అంచనా వేయలేమని కూడా హెచ్చరించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో జి జిన్‌పింగ్ సైనిక అంశాలను పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశం ఉందని తెలిపింది. -
నమస్తే ట్రంప్ అదిరింది...
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనపై అంతర్జాతీయ మీడియా ఆసక్తి కనబరిచింది. సీఎన్ఎస్ ఇంటర్నేషనల్, న్యూయార్క్ టైమ్స్, ద గార్డియన్, బీబీసీ సహా పాకిస్తానీ మీడియా సంస్థలు ట్రంప్ పర్యటనను ప్రముఖంగా ప్రస్తావించాయి. అశేష జనసందోహం నడుమ అమెరికా అధ్యక్షుడికి భారత్‌లో ప్రేమపూర్వక స్వాగతం లభించిందని సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. భారత ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ట్రంప్‌కు స్వాగతం పలికారని వెల్లడించింది. ట్రంప్ తన ప్రసంగంలో పలు భారతీయ పదాలను పలకడంలో తడబడ్డారని పేర్కొంది. ట్రంప్ తన ప్రసంగంలో భాగంగా పేర్కొన్న ‘అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది’అనే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రధాన శీర్షికగా చేసుకుంది. అయితే, మోదీ ప్రభుత్వంపై వెల్లువెత్తే విమర్శలను ట్రంప్ ప్రస్తావించలేదని తెలిపింది. పౌరసత్వ చట్టం సహా పలు అంశాల విషయంలో గత మూడు నెలలుగా భారత్‌లో మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్ పర్యటన కాస్త ఊరడింపుగా మారిందని ద గార్డియన్ పేర్కొంది. భారత్‌లో అమెరికా అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం లభించిందని బీబీసీ పేర్కొంది. భారతీయ పదాలను పలకడంలో ట్రంప్ తడబడ్డారని తెలిపింది. ట్రంప్ పర్యటన విషయంలో పాకిస్తాన్ మీడియా మరోసారి తన తీరును వెళ్లగక్కింది. ట్రంప్ పర్యటన మొత్తంలో పాక్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే హైలెట్ చేసింది. పాక్‌తో సత్సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్ మాటలను ప్రస్తావించింది. -
కర్ణాటకంపై విదేశీ మీడియా..
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై విదేశీ మీడియా మిశ్రమంగా స్పందించింది. 224 అసెంబ్లీ స్ధానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ 104 స్ధానాలు సాధించినా మేజిక్ ఫిగర్‌కు కొద్దిదూరంలో ఆగిపోయింది. గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో బలనిరూపణలో గట్టెక్కుతారని విదేశీ మీడియా అంచనా వేసింది. కోర్టు తీర్పులు, ఎమ్మెల్యేల బేరసారాల మధ్య బీజేపీ సర్కార్ కొలువుతీరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పగ్గాలు ఎవరు చేపడతారన్నది పక్కనపెడితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి 2019 సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన స్ఫూర్తిని ఇచ్చాయని, బీజేపీ ఇప్పటికీ ప్రజల్లో ప్రతిష్ట కలిగిఉందని, రాజకీయ వ్యూహాల్లోనూ ఆరితేరిందని నిరూపించుకుందని రాజకీయ విశ్లేషణ సంస్థ యురేసియా గ్రూప్ ఆసియా డైరెక్టర్ శైలేష్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ శాసనసభలో బలనిరూపణ చేసుకుంటుందని తాము అంచనా వేస్తున్నామన్నారు. సంప్రదాయంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో పట్టున్న బీజేపీ దక్షిణాదిన కర్ణాటకలో మెరుగైన సామర్థ్యం కనబరచడం ద్వారా కాంగ్రెస్‌కు గట్టి సవాల్ విసిరిందని కుమార్ అన్నారు. కర్ణాటకలో సాధారణ మెజారిటీ సాధిస్తే బీజేపీ ఇంకా బలపడేదని విశ్లేషించారు. ఇక 78 అసెంబ్లీ స్ధానాలు సాధించిన కాంగ్రెస్, 37 స్ధానాలు గెలుచుకున్న జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం కోసం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వ్యూహాలు రచించాయి. మోదీకి కర్ణాటక రిస్క్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితలు ప్రధాని నరేంద్ర మోదీకి కీలక సవాల్‌గా విదేశీ మీడియా అభివర్ణించింది. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి 2015 బిహార్ ఎన్నికల తరహాలో జట్టుకడితే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని కన్సల్టెన్సీ సంస్థ కంటోల్ రిస్క్స్ ఇండియా, దక్షిణాసియా అసోసియేట్ డైరెక్టర్ ప్రత్యూష్ రావ్ పేర్కొన్నారు. -
ఐటీ మునుపటి కళ తప్పింది: విదేశీ మీడియా
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ పదవులకు విశాల్ సిక్కా రాజీనామా నేపథ్యంలో భారతీయ ఐటీ రంగం ఎగుమతులు గత ఏడేళ్లలో ఎన్నడూలేని విధంగా కుదేలైన తీరును విదేశీ మీడియా విశ్లేషించింది. దేశీయ ఐటీ సేవల ఎగుమతులు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో పతనమవడం ఆందోళన రేకెత్తిస్తున్నదని, కరెంట్ ఖాతా లోటును పెంచడమే కాకుండా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పాలకులు కలత చెందుతున్నట్టు ఫారెన్ మీడియా పేర్కొంది. కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్‌కు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఇబ్బందికరమని వ్యాఖ్యానించింది. హెచ్1బీ వీసాలపై ట్రంప్ వైఖరి భారత్ ఇంజనీర్లు అమెరికాలో అడుగుపెట్టేందుకు అవరోధమని ఎకనమిక్ సర్వే విస్పష్టంగా పేర్కొనడాన్ని విదేశీ మీడియా ప్రస్తావించింది. ఆటోమేషన్ దెబ్బతో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయన్న వరల్డ్ బ్యాంక్ నివేదిక, 2020 వరకూ భారత్‌లో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కోల్పోతాయని హెడ్ హంటర్స్ ఇండియా అంచనాలూ టెక్నోక్రాట్ల దుస్థితికి అద్దంపడుతున్నాయని పేర్కొంది. -
భారత్-చైనాల మధ్య యుద్ధం: ఫారెన్ మీడియా
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య తలెత్తిన డొక్లాం వివాదం ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తుందని విదేశీ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌తో యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైందని పలుమార్లు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొంది. ఇరు దేశాలు ఒకేసారి డొక్లాంలో సైన్యాన్ని వెనక్కుపిలవాలని భారత్ ప్రతిపాదించినా చైనా మొండి వైఖరి ప్రదర్శించిందని విమర్శించింది. డొక్లాంలో తమ ప్రాంతమని, అక్కడ రోడ్డు నిర్మించే హక్కు తమకు ఉందని చైనా వితండవాదం చేస్తోందని వ్యాఖ్యానించింది. డొక్లాం వివాదం చెలరేగిన నాటి నుంచి చైనా విదేశాంగ శాఖ ప్రతి రోజూ ఏదో విధంగా భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉందని పేర్కొంది. రెండు అణు శక్తి ఆయుధ సంపత్తిని కలిగిన దేశాల మధ్య హిమాలయ రాజ్యం భూటాన్ నలిగిపోతోందని చెప్పింది. హిమనీనదాలపై చైనా-భారత్‌లు పోరాడే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. మంగళవారం భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా చైనా దళాలు భారత్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా కనిపిస్తోందని పేర్కొంది. అటు వెంటనే చైనా విదేశాంగ శాఖ అవునా.. భారత్‌లోకి మా సైన్యం వచ్చిందా? అని ఎదురు ప్రశ్నించడం అనుమానాన్ని మరింత బలపరుస్తోందని చెప్పింది. ప్రస్తుతం భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత గత 30 ఏళ్లలో ఎన్నడూ లేదని రాయల్ యూనైటెడ్ ఇనిస్టిట్యూట్, లండన్‌కు చెందిన నిపుణులు పేర్కొన్నారు. ఇదే సమస్య చిలికిచిలికి గాలి వానలా మారి యుద్ధానికి దారి తీయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆసియాలో తానే బలీయమైన శక్తినని నిరూపించుకోవడానికి, తన ఉనికిని చాటుకోవడం కోసం చైనా, భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తోందని చెప్పారు. -
ఎంత నల్లధనం గుట్టురట్టు కానుందో తెలుసా?
-
ఎంత నల్లధనం గుట్టురట్టు కానుందో తెలుసా?
అవినీతి, పన్ను ఎగవేతపై ఉక్కుపాదం మోపడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఖజానాకు అక్షరాల రూ. మూడు లక్షల కోట్ల (45 బిలియన్ డాలర్ల) లాభం చేకూరనుందని విదేశీ మీడియా విశ్లేషించింది. దేశ బడ్జెట్‌కు చేరనున్న ఈ అదనపు మొత్తం ఏకంగా ఐస్లాండ్ దేశ ఆర్థిక వ్యవస్థతో సమానమని పేర్కొంది. రూ. 500, వెయ్యినోట్ల రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల ఏకంగా రూ. మూడు లక్షల కోట్ల (45బిలియన్ డాలర్ల) నల్లధనం వెలికిరానుందని, పన్నును తప్పించుకునేందుకు ఈ మొత్తాన్ని కరెన్సీని విదేశాల్లో దాచిపెట్టారని ముంబైకి చెందిన బ్రోకరేజి సంస్థ ఎడెల్వీస్ సెక్యూరిటీ లిమిటెడ్ విశ్లేషించింది. ఇక ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్ లిమిటెడ్ మరింత ఆశాజనకమైన అంచనా వేసింది. ఏకంగా 4.6 లక్షల కోట్ల నల్లధనం బయటకు రావొచ్చునని అంచనా వేసింది. ఆర్థికవేత్తలు పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రభావాలు ఏమిటన్న దానిపై లోతుగా విశ్లేషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో 17.8 లక్షల కోట్ల నగదు కరెన్సీరూపంలో చలామణిలో ఉంది. పెద్దనోట్ల రద్దుతో ఏకంగా ఇందులో 86శాతం నగదు తుడిచిపెట్టుకుపోనుంది. ఇలా తుడిచిపెట్టుకుపోతున్న కరెన్సీలో మూడోవంతు నల్లధనం లేదా, ప్రకటించని నగదు ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నల్లధనం వెలుగులోకి వస్తే.. ఆసియాలో అత్యంత ఎక్కువ ద్రవ్యలోటు కలిగిన భారత్.. ఆ లోటును భర్తీచేసుకొని మెరుగైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశముందని భావిస్తున్నారు. వెలుగులోకి వచ్చిన ఈ నల్లధనాన్ని దేశంలో పలు ఆర్థిక సంస్కరణలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చునని, అంతేకాకుండా ఆర్బీఐ తన అప్పులను తీర్చుకొని.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు కూడా సమకూర్చవచ్చునని ఎడెల్వీస్ విశ్లేషకుడు మనోజ్ బహెతీ తెలిపారు. -
పైకెళ్లింది కింద పడాల్సిందే
ఢీల్లీ ఫలితాలపై విదేశీ మీడియా న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విదీశీ మీడియా ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభావాన్ని దష్టిలో పెట్టుకొని ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తితోనే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై ప్రపంచ మీడియా దృష్టి పెట్టింది. అనూహ్యంగా ఆప్ సునామీనే సష్టించి 70 సీట్లలో 67 సీట్లను కైవసం చేసుకోవడంతో మంచి కవరేజీ ఇచ్చింది. ఆప్ ‘రాజకీయ భూకంపం’ సష్టించినట్లు వ్యాఖ్యానించడంతోపాటు ఆప్‌ను ప్రశంసించింది. ‘పైకెళ్లిన వస్తువు కింద పడాల్సిందే’ అంటూ మోదీని ఉద్దేశించి విమర్శలు కూడా చేసింది. ఆప్ సాధించిన ఫలితాలు పరిపాలనా వ్యవహారాల్లో, ఆర్థిక సంస్కరణలపై ప్రధాని మోదీపై తీవ్ర ఒత్తిడి పెంచిందని న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకత్వంలో వ్యాఖ్యానించింది. అయితే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ఈ ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయని వ్యాఖ్యానించింది. అవినీతి ప్రక్షాళన నినాదంతో వచ్చిన ఓ సామాన్యుడి పార్టీ చేతిలో మోదీ పార్టీ దిగ్భ్రాంతికరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. పెకైళ్లిన వస్తువు కింద పడాల్సిందేనంటూ న్యూటన్ భౌతికశాస్త్ర సూత్రాన్ని సీఎన్ఎన్ వ్యాఖ్యానించింది. మోదీకి ఇది మొదటి శరాఘాతం అని బీబీసి వ్యాఖ్యానించింది. మోదీకి ఇది పిడుగుపాటని లండన్ నుంచి వెలువడే ది టెలిగ్రాఫ్ వ్యాఖ్యానించింది.