
భారత్-చైనాల మధ్య యుద్ధం: ఫారెన్ మీడియా
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య తలెత్తిన డొక్లాం వివాదం ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తుందని విదేశీ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌తో యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైందని పలుమార్లు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొంది.
ఇరు దేశాలు ఒకేసారి డొక్లాంలో సైన్యాన్ని వెనక్కుపిలవాలని భారత్ ప్రతిపాదించినా చైనా మొండి వైఖరి ప్రదర్శించిందని విమర్శించింది. డొక్లాంలో తమ ప్రాంతమని, అక్కడ రోడ్డు నిర్మించే హక్కు తమకు ఉందని చైనా వితండవాదం చేస్తోందని వ్యాఖ్యానించింది. డొక్లాం వివాదం చెలరేగిన నాటి నుంచి చైనా విదేశాంగ శాఖ ప్రతి రోజూ ఏదో విధంగా భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉందని పేర్కొంది.
రెండు అణు శక్తి ఆయుధ సంపత్తిని కలిగిన దేశాల మధ్య హిమాలయ రాజ్యం భూటాన్ నలిగిపోతోందని చెప్పింది. హిమనీనదాలపై చైనా-భారత్‌లు పోరాడే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. మంగళవారం భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా చైనా దళాలు భారత్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా కనిపిస్తోందని పేర్కొంది. అటు వెంటనే చైనా విదేశాంగ శాఖ అవునా.. భారత్‌లోకి మా సైన్యం వచ్చిందా? అని ఎదురు ప్రశ్నించడం అనుమానాన్ని మరింత బలపరుస్తోందని చెప్పింది.
ప్రస్తుతం భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత గత 30 ఏళ్లలో ఎన్నడూ లేదని రాయల్ యూనైటెడ్ ఇనిస్టిట్యూట్, లండన్‌కు చెందిన నిపుణులు పేర్కొన్నారు. ఇదే సమస్య చిలికిచిలికి గాలి వానలా మారి యుద్ధానికి దారి తీయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆసియాలో తానే బలీయమైన శక్తినని నిరూపించుకోవడానికి, తన ఉనికిని చాటుకోవడం కోసం చైనా, భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తోందని చెప్పారు.