ఉక్రెయిన్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. డోనెస్క్ అధికారి ఒకరు భారత మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ యుద్ధం అనే వంకతో రష్యాను నాశనం చేసేదాకా వదలవని, ఆపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొన్నారు.
డోనెస్క్.. ఉక్రెయిన్ రెబల్ నగరం. రష్యా ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ మిలిటరీ చర్యకు సరిగ్గా కొన్నిరోజుల ముందు స్వతంత్ర ప్రాంతంగా(డోనెస్క్ పీపుల్స్ రిపబ్లిక్)గా ప్రకటించింది. అయితే యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ బలగాలు తిరిగి ఈ ప్రాంతంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా బలగాలు డోన్‌బస్ వైపు మోహరిస్తుండగా, ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై డోనెస్క్ అధికార ప్రతినిధి ఎడువార్డ్ అలెక్సాండ్రోవిచ్ బసురిన్ స్పందిస్తూ.. సంచలన ఆరోపణలకు దిగాడు.
భారత్‌కు చెందిన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్-రష్యా సరిహద్దు ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ.. అమెరికా నేతృత్వంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ పరిణామాల్లో జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ‘‘కానీ, ఇది ఇక్కడితోనే ఆగదు. రష్యాను నాశనం చేస్తేనే కానీ వాళ్లు శాంతించరు. అటుపై శక్తివంతమైన దేశం భారత్‌పై దృష్టి పెడతారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఏదైనా కుట్రకు తెర తీస్తారు. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ ఫలితం ఏంటన్నది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
గొప్ప ఆయుధ సంపత్తి లేకపోయినా బ్రిటిషర్లను తరిమి కొట్టిన పోరాట పటిమ భారతీయులదని కొనియాడిన బసురిన్.. తాము కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ‘మా చరిత్రను వదులుకునేందుకు మేం సిద్ధంగా లేం.. వేరే వాళ్లతో మేమెందుకు కలవాలి?’ అని పునరుద్ఘాటించారు ఆయన. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా పాల్పడుతోంది దురాక్రమణ కాదని, ఏం జరుగుతుందో తాను మొదటి నుంచి కళ్లారా చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘‘ఉక్రెయిన్ ఆర్మీ మాపై(డోనెస్క్, డోన్‌బస్) పడి.. ప్రజలను పొట్టనబెట్టుకుంటోంది. పరిస్థితి ఉక్రెయిన్ ఆర్మీకి వ్యతిరేకంగా మారడంతో ఇప్పుడు రష్యాను నిందిస్తోంది. ఇది రష్యా దూకుడు కాదు. పాశ్చాత్య దేశాలు, అక్కడి మీడియా అంతా.. రష్యాను నాశనం చేసేందుకు చేస్తున్న ప్రచారం మాత్రమే’’ అని పేర్కొన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment