ఐర్లాండ్‌ వరల్డ్‌ రికార్డు.. ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఘనత | Ireland Break South Africa 119 Year Old Record Become 1st Team In World To | Sakshi
Sakshi News home page

119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్‌ ఘనత

Published Tue, Feb 11 2025 6:37 PM | Last Updated on Tue, Feb 11 2025 8:26 PM

Ireland Break South Africa 119 Year Old Record Become 1st Team In World To

ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు(PC: Ireland Cricket)

ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు(Ireland Cricket Team) సరికొత్త చరిత్ర లిఖించింది. టెస్టు(Test Format)ల్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. ‘హ్యాట్రిక్‌’ విజయాలతో 119 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఈ ఫీట్‌ నమోదు చేసింది.

రాణించిన ఆండీ మెక్‌బ్రిన్‌ 
కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం ఐర్లాండ్‌ జట్టు.. జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో బులవాయో వేదికగా ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ జరిగింది. క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఐరిష్‌ టీమ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

అయితే, జింబాబ్వే బౌలర్ల ధాటికి ఐర్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఈ క్రమంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆండీ మెక్‌బ్రిన్‌ 90 పరుగులు(నాటౌట్‌), టెయిలెండర్‌ మార్క్‌ అడెర్‌ 78 పరుగులతో రాణించారు. ఫలితంగా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 260 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగగా.. ఎంగరవ రెండు, ట్రెవర్‌ గ్వాండు ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక జింబాబ్వే తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్‌ అయి.. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. నిక్‌ వెల్చ్‌ 90, ముజర్బాని 47 పరుగులతో రాణించారు.

292 పరుగుల లక్ష్యం.. జింబాబ్వే బ్యాటర్ల వైఫ ల్యం
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఐర్లాండ్‌ 298 పరుగులకు ఆలౌట్‌ అయింది. తద్వారా జింబాబ్వే ముందు 292 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐరిష్‌ స్పిన్నర్‌ మాథ్యూ హంప్‌రెస్‌ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. మరోవైపు బ్యారీ మెకార్తీ రెండు, మార్క్‌ అడెర్‌, ఆండీ మెక్‌బ్రిన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (195 బంతుల్లో 84; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బ్రియాన్‌ బెనెట్‌ (72 బంతుల్లో 45; 3 ఫోర్లు), జొనాథన్‌ క్యాంప్‌బెల్‌ (62 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించినా ఫలితం లేకపోయింది. 228 పరుగులకే జింబాబ్వే కుప్పకూలగా.. ఐర్లాండ్‌ 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 

వరుసగా మూడో టెస్టు విజయం
తద్వారా టెస్టుల్లో వరుసగా మూడో విజయాన్ని(‘హ్యాట్రిక్‌’) నమోదు చేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఐర్లాండ్‌ ప్లేయర్‌ ఆండీ మెక్‌బ్రిన్‌ (90 పరుగులు; 4 వికెట్లు)కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

కాగా ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నుంచి టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌ జట్టు ఆడిన తొలి ఏడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అయితే, గత ఏడాది మార్చిలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఎనిమిదో టెస్టులో గెలిచి ఈ ఫార్మాట్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది. అనంతరం జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన తొమ్మిదో టెస్టులో నెగ్గి వరుసగా రెండో గెలుపు రుచి చూసింది.

తాజాగా జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో ఐర్లాండ్‌ 63 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫార్మాట్‌లో ఈ మేర ‘హ్యాట్రిక్‌’ సాధించింది. ఇప్పటి వరకు కేవలం పది టెస్టులే ఆడిన ఐర్లాండ్‌.. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలుపొందడం ద్వారా.. అత్యంత తక్కువ టెస్టుల్లో ‘హ్యాట్రిక్‌’ విజయాలు అందుకున్న తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. అంతకు ముందు సౌతాఫ్రికా 1906లో పద్నాలుగు మ్యాచ్‌ల తర్వాత హ్యాట్రిక్‌ కొట్టింది.

తక్కువ మ్యాచ్‌ల వ్యవధిలోనే టెస్టుల్లో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసిన జట్లు
👉ఐర్లాండ్‌- 10 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 2025
👉సౌతాఫ్రికా- 14 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 1906
👉ఇంగ్లండ్‌- 23 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 1886
👉పాకిస్తాన్‌- 25 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 1959
👉వెస్టిండీస్‌- 35 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 1950
👉ఆస్ట్రేలియా- 50 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 1898
👉శ్రీలంక- 87 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 1998
👉బంగ్లాదేశ్‌- 88 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 2014
👉ఇండియా- 109 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 1969
👉న్యూజిలాండ్‌- 260 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌- 1998.

చదవండి: తప్పు చేస్తున్నావ్‌ గంభీర్‌.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement