![KSR Comment On AP Chandrababu Red Book Rule](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/CBN_Kommineni.jpg.webp?itok=mx5BboZP)
ఆంధ్రప్రదేలో కూటమి సర్కార్ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిధులను తమకిష్టమైన వారికి పందేరం పెట్టేందుకు టీడీపీ, జనసేనలు తామిచ్చిన హామీను కూడా పక్కనబెట్టేస్తున్నాయి. దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర కూడా పడింది. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ కోసం అప్పులు చేసి మరీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. అదేకాకుండా నీరు-చెట్టు స్కీమ్ పెండింగ్ బకాయిల పేరుతో ప్రభుత్వం నిధుల గోల్‌మాల్‌కు పాల్పడతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పైగా అప్పట్లో జరిగిన భారీ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు పెట్టిన కేసులను సైతం ఎత్తివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటే, అవినీతికి ఏ స్థాయిలో మద్దతు ఇస్తున్నది అర్థమవుతుంది.
2014-19లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు పనులు చేయకుండానే పెద్ద ఎత్తున బిల్లులు క్లెయిమ్ చేశారని అంచనా. అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు కూడా ఈ పథకంలోనే రూ.13 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చిన నిధులను కూడా టీడీపీ వారు కైంకర్యం చేసేశారని కూడా ఆయన విమర్శించారు. నీరు-చెట్టు కింద ఆ స్థాయిలో అవినీతి జరిగితే ఇప్పుడు ఆ స్కీమ్ లో ఖర్చు చేశామని చెబుతూ వచ్చిన బిల్లులన్నిటిని చెల్లించాలని నిర్ణయించారట. సుమారు రూ.900 కోట్ల బిల్లులు ఇచ్చేస్తున్నారట.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ పథకంలో అవినీతిని నిగ్గుతేల్చి పనులు చేసిన వారికే నిధులు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా.. విజిలెన్స్ శాఖ అవినీతిపై నివేదికలు సిద్ధం చేశారు. కొందరిపై కేసులూ పెట్టారు. అప్పట్లో కొంత మంది తమకు చెల్లించాల్సిన బిల్లులపై కోర్టుకెల్లి సానుకూల తీర్పులు పొందగలిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నీరు-చెట్టు పథకం కాంట్రాక్టులు పొందిన వారి పంట పండింది. గత ప్రభుత్వపు విజిలెన్స్ నివేదికలు కూడా పక్కనబెట్ట కేసులన్నిటిని ఎత్తివేసి మరీ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కేడర్, నేతలు, అప్పట్లో పనులు చేసిన వారిపై కక్ష కట్టి వేధిస్తోంది. బిల్లులు నిలిపి వేస్తోంది. టీడీపీ, జనసేన ,బీజేపీలకు చెందిన వారిపై మాత్రం ఎన్ని అవకతవకలు జరిగినా అవాజ్య ప్రేమ కనబరుస్తోంది. సూపర్ సిక్స్ హామీలకు డబ్బులు లేవని చెప్పే ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల బిల్లులకు మాత్రం వందల కోట్లు చెల్లించడానికి సిద్దమైన తీరు ‘ఔరా’ అనిపిస్తోంది.
జనం ఏమైపోయినా ఫర్వాలేదు..తమ కార్యకర్తలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే చాలన్నట్లుగా కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఆ రోజుల్లో విజిలెన్స్ అధికారులు కేసులు పెడితే అక్రమం అని అంటున్న కూటమి నేతలు, ఇప్పుడు YSRCP వారిపై పెడుతున్న విజిలెన్స్, ఇతర శాఖల కేసులు మాత్రం సక్రమమని చెబుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సైతం వేధిస్తూ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజా చర్యతో ఎవరిపైన అయినా కేసులు పెట్టాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. ఇప్పుడు కక్షపూరితంగా పెడుతున్న కేసులను ఒకవేళ మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే ఎత్తివేయదా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.
జగన్ టైమ్‌లో గ్రామాలలో నిర్మాణమైన అనేక భవనాలకు బిల్లులు పెండింగులో ఉన్న వాటిని మంజూరు చేయడం లేదని చెబుతున్నారు. YSRCP వారు ఎవరైనా పార్టీ మారి కూటమికి మద్దతు ఇచ్చి, ఎవరైనా కూటమి ఎమ్మెల్యేనో, లేక మంత్రినో ప్రసన్నం చేసుకుంటేనే అవి వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎదురుగా కనబడుతున్న పనులకు బిల్లులు ఇవ్వకుండా, అసలు జరిగాయో లేదో తెలియని, కనిపించని నీరు చెట్టు పనులకు మాత్రం కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకో సంగతి చెప్పాలి.
ఏపీ ప్రభుత్వంలో కోటి రూపాయల మించి జరిగే పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించారట. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తే తీవ్ర స్థాయిలో తప్పు పట్టిన చంద్రబాబు, తెలుగుదేశం ఇతర నాయకులు, ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలకు పైగా పనులు చేపడితే చాలు.. అడ్వాన్స్ మొత్తం పొందవచ్చు. నిధులు తీసుకున్న తర్వాత ఎంతమేర కాంట్రాక్టులు సజావుగా జరుగుతాయో తెలియదు. ఆ రోజుల్లో భారీ ప్రాజెక్టులను ఈపీసీ (ఎస్టిమేషన్ ,ప్రొక్యూర్ మెంట్, కనస్ట్రక్షన్ ) పద్ధతిలో నిర్మించడం కోసం అడ్బాన్స్ లు ఇవ్వాలని తలపెట్టారని, ఇప్పుడు అన్ని పనులకు ఇలా చేస్తే పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ ఒకరు అన్నారు.
సూపర్ సిక్స్ అమలుకు డబ్బులు లేవని చెప్పే ప్రభుత్వం,ఇలా నీరు-చెట్టు స్కీమ్ బకాయిలు, మొబిలైజేషన్ అడ్వాన్స్ లకు మాత్రం ఉదారంగా డబ్బులు ఇస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక విషయంలో కాదు.. అనేక అంశాలలో ప్రభుత్వ తీరు ఇలాగే ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో చూడండి.. రాజకీయంగా తమకు సవాల్ విసురుతున్న ప్రముఖులను ఆ కేసులో ఎలాగొలా ఇరికించాలని టీడీపీ నేతలు విశ్వయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తానే వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరి అనే నిందితుడిని అడ్డం పెట్టుకుని రకరకాల పన్నాగాలు చేస్తున్నారు. ఈ కేసును సీబీఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్నా, కొత్త కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ బంధువులు, సన్నిహితులు కొందరిని ఇరికించడానికి కుట్ర జరుగుతున్నట్లుగా ఉంది. తను జైలులో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఇరవై కోట్లు తెచ్చి ప్రలోభపెట్టాడని దస్తగిరి గతంలో ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు చేసి విచారణ చేసి, అలాంటిది ఏమీ జరగలేదని గత నవంబర్‌లో అధికారులు తేల్చారు. దానిని కోర్టు కూడా ఓకే చేసింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మరోసారి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించిందన్న వార్త చూస్తే రెడ్ బుక్ పాలన ఇలా ఉంటుందన్న మాట అనిపిస్తుంది.
తెలంగాణ హైకోర్టు మాత్రం నిందితుడైన దస్తగిరిని సాక్షిగా ఎలా మార్చారని సీబీఐ ప్రశ్నించడం గమనార్హం. మరో వైపు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, సినీ నిర్మాత రాంగోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారించిన తీరు కూడా రెడ్ బుక్ వ్యవహారంగానే కనిపిస్తుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం తీసిన ఒక సినిమాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచితంగా సన్నివేశాలు పెట్టారని, మార్పింగ్ జరిగిందని అందువల్ల తమ మనోభావాలు గాయపడ్డాయని ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త కేసు పెట్టారు.అంతే! పోలీసులు వాయు వేగంతో స్పందించి వర్మను విచారణకు పిలిచారు. మరో కేసులో ఆయనను అరెస్టు చేయాలని ప్రయత్నించారు కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆ పని చేయలేక పోయారు. అయినా రెడ్ బుక్ వేధింపుల పర్వంలో భాగంగా ఆయనను అన్ని గంటలు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు తనను పోలీసులు హింసించారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ సాగిస్తున్నారు.. ఆయనపై హింస జరగలేదని నివేదిక ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్ ప్రభావతిని కూడా తొమ్మిది గంటలు ప్రశ్నించారట. ఆమె కూడా ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
విశేషం ఏమిటంటే కులాలు, మతాల మధ్య ద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పెట్టిన కేసేమో పక్కకు పోయింది. ఆయన తనను హింసించారంటూ చేసిన ఫిర్యాదుకేమో హడావుడి చేస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన కేసు అంటూ అనేకమంది వైఎస్సార్‌సీపీ వారిని అరెస్టు చేశారు. తనతో బలవంతంగా కేసు పెట్టించారని పిటిషన్ దారుడు ఉపసంహరించుకోవడం సంచలమైంది. అయినా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏదోరకంగా రెడ్ బుక్ ప్రయోగించాలని నిర్ణయించుకుని అరెస్టు చేశారు. తమకు కావల్సినవారు నేరాలు చేసినా కేసులు ఎత్తివేయడం, తమ ప్రత్యర్థులు నేరాలు చేసినా, చేయకపోయినా, ఏదో ఒక సాకు చూపుతూ కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పడం చేస్తున్నారు. నిజంగానే రెడ్ బుక్‌కు పిచ్చి కుక్క మాదిరి వాడుతున్నారన్న వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్య మాదిరిగానే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తుంది. భారత రాజ్యాంగం బదులు రెడ్ బుక్ పాలనను కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వైనం ఏపీకి తీరని నష్టం చేస్తోంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/KSR-Main_10.jpg)
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment