Insurability
-
ఎన్పీపీఏ అధికారాలకు కత్తెర
న్యూఢిల్లీ: జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ(ఎన్పీపీఏ) అధికారాల్లో కేంద్రం కోత విధించింది. అత్యావసరంకాని ఔషధాల(నాన్-అసెన్షియల్) ధరలపై పరిమితి విధింపునకు సంబంధించి డ్రగ్ప్రైస్ కంట్రోల్ ఆర్డర్(డీపీసీఓ)-2013లోని నిబంధనలను కొన్నింటిని ఉపసంహరించుకుంది. ఎరువులు, రసాయనాల శాఖ అధీనంలో పనిచేస్తున్న ఫార్మాసూటికల్స్ విభాగం గత శుక్రవారం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఎన్‌పీపీఓ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల 43 ఔషధాల ధరలపై పరిమితి విధింపుపై ఫార్మా కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. డీపీసీఓ 2013లోని 19వ పేరాగ్రాఫ్ ప్రకారం హెచ్ఐవీ, గుండెసంబంధ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే కొన్ని నాన్-అసెన్షియల్ డ్రగ్స్‌పై పరిమితి విధించేందుకు ఈ ఏడాది మే 29న తాము మర్గదర్శకాలను ఇచ్చామని... దీన్ని తక్షణం ఉపసంహరించుకుంటున్నట్లు సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఎన్పీపీఏ వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూలై 10న 108 నాన్-అసెన్షియల్ ఔషధాల ధరలపై పరిమితికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలను ఇందులో ప్రస్తావించలేదు. ఫార్మా కంపెనీలకు సానుకూలం... ప్రభుత్వ ఆదేశాలమేరకు ఇకపై డీపీసీఓ ప్రకారం తమకు నాన్-అసెన్షియల్ ఔషధాల ధరలను నియంత్రించే(పరిమితి విధింపు) అధికారం పోయినట్లేనని ఎన్పీపీఏ అధికారి ఒకరు వివరించారు. ప్రాణాధార ఔషధాల జాబితా(ఎన్ఎల్ఈఎం)లో లేని కొన్ని డ్రగ్స్ ధరలను ప్రజా ప్రయోజనాలరీత్యా అసాధారణ పరిస్థితుల్లో నియంత్రించేందుకు డీపీసీఓ-2013లోని పేరాగ్రాఫ్ 19 ఎన్‌పీపీఏకి వీలు కల్పిస్తోంది. దీనిప్రకారమే కొన్ని ఔషధాల ధరలపై పరిమితులను ఇటీవలి కాలంలో ఎన్పీపీఏ విధించింది. డీపీసీఓ-2013 ప్రకారం ఎన్ఎల్ఈఎం జాబితాలో ఉన్న 348 డ్రగ్స్ ధరలను ఇప్పటికే కేంద్రం నియంత్రిస్తోంది. -
నేటి బడ్జెట్‌పై ఆశలెన్నో
సాక్షి, ముంబై: ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ‘అచ్చే దిన్ ఆయేంగే’ (మంచి రోజులు వస్తాయి) అనే నినాదంతో చేసిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. ఎన్నోకల సమయంలో ముంబై అభివృద్ధికి మోడీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలని ముంబైకర్లు కోరుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు, రైలు చార్జీలు, ఇంధన ధరలు పెరగడంతో సామాన్యులు బేజారవుతున్నాడు. మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లో ముంబైకి ఎంతమేర ప్రాధాన్యం ఇస్తారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముంబైలో ప్రతీరోజు 75 లక్షల మంది ప్రయాణికులు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వానికి అందే ఆర్థిక వనరుల్లో లోకల్ రైళ్ల వాటా అత్యధికంగా ఉంటుంది. ఏటా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ముంబైకర్లకు మొండిచేయి ఎదురవుతుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన అనేక రైల్వే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. తీవ్రజాప్యం వల్ల వీటి వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. నిధులు లేక కొన్ని ప్రాజెక్టులు అర్థంతరంగా నిలిచిపోయాయి. కనీసం ఈ బడ్జెట్లోనైనా నిధులు మంజూరైతే అవి పూర్తవుతాయని నగరవాసులు భావిస్తున్నారు. ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) ద్వారా మూడు ప్రాజెక్టులు పూర్తిచేయాలని రైల్వే బోర్డు సంకల్పించింది. అందులో మొదటి ప్రాజెక్టు కోసం రూ.3,125 కోట్లు మంజూరు చేశారు. ప్రాజెక్టు పనులు జాప్యం కావడంతో అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు పెరిగింది. ఇందులో తొమ్మిది బొగీలున్న లోకల్ రైళ్లను 12, 15 బోగీలుగా మార్చే ప్రాజెక్టు కూడా ఉంది. రెండో ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు మంజూరు చేశారు. అనేక కారణాలవల్ల ఇవన్నీ పెండింగులోనే ఉన్నాయి. దీంతో ప్రాజెకుల్ట వ్యయం రూ.7,013 కోట్లకు చేరుకున్నా పనులు పూర్తికాలే దు. మూడో ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు మంజూరు చేస్తామని గత బడ్జెట్లో ప్రకటించినా, ఇప్పటికీ అవి విడుదల కాలేదు. దీంతో ఠాణే-సీఎస్టీ స్టేషన్ల మధ్య ఐదు, ఆరో రైల్వే లేన్ల పనులు పెండింగులోనే ఉన్నాయి. ఈ పనులు సమయానికి పూర్తయినట్లతే లోకల్ రైలు సేవలను మరింత మెరుగుపరిచేందుకు వీలు పడేది. ముంబై రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు నిర్మించడం, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించడం, రైల్వే ప్రమాదాల నివారణ, ప్లాట్‌ఫారాల ఎత్తు పెంచడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేదా సబ్వే నిర్మాణం వంటి దీర్ఘకాల డిమాండ్లపై మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ముంబైకర్లు కోరుకుంటున్నారు. -
ఐసీఐసీఐ విదేశీ విస్తరణ
వడోదర: విదేశాల్లో విస్తరణ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మారిషస్ల్లో బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయనున్నామని బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్ చెప్పారు. అంతేకాకుండా చైనాలో ఉన్న రిప్రజంటేటివ్ ఆఫీస్‌ను పూర్తి స్థాయి బ్యాంక్ శాఖగా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. వీటన్నింటికి తగిన ఆమోదాలు ఆర్బీఐ నుంచి పొందామని వివరించారు. బ్యాంక్ 20వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే విదేశీ నెట్‌వర్క్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ అతి పెద్ద బ్యాంక్ అని పేర్కొన్నారు. మూడు అనుబంధ బ్యాంకులతో, ఎనిమిది రిప్రజంటేటివ్ ఆఫీస్లతో విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 653 బ్యాంక్ శాఖలను, 834 ఏటీఎంలను ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 3,753కు, ఏటీఎంలు 11,315కు పెరిగాయని చందా కొచ్చర్ తెలిపారు. వృద్ధి సాధనపై దృష్టి సారించే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ యంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, మంచి పనితీరు సాధించామని తెలిపారు. ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలను నమోదుచేయగలమన్న విశ్వాసాన్ని కొచర్ వ్యక్తం చేశారు. -
బొగ్గు ఉత్పత్తి పెంచండి
కోల్ ఇండియాకు కేంద్ర మంత్రి గోయల్ ఆదేశం న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తిని పెంచేందుకు వీలుగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయల్ కోల్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించారు. ‘బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తవ్వకాలు జరుపుతున్న గనుల నుంచి మరింత బొగ్గును వెలికితీసేందుకు అనుమతించాల్సిందిగా పర్యావరణ, అటవీ శాఖను కోరాం. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా పెరిగే విధంగా ఈ-వేలంలో బొగ్గు పరిమాణాన్ని తగ్గించాలని ఆదేశించాం..’ అని ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని విద్యుదుత్పత్తి కంపెనీలన్నిటికీ సరఫరా చేసేందుకు బొగ్గు ఉత్పత్తిని 50-60 శాతం పెంచాలని కోల్ ఇండియాను కోరినట్లు చెప్పారు. దేశంలో విద్యుత్ కొరతకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రైవేట్ విద్యుత్ దిగ్గజాలు అనిల్ అంబానీ (రిలయన్స్ పవర్), గౌతమ్ ఆదానీ (ఆదానీ గ్రూప్), వినీత్ మిట్టల్ (వెల్స్పన్ ఎనర్జీ), నవీన్ జిందాల్ (జిందాల్ పవర్) తదితరులతో గోయల్ సమావేశం నిర్వహించారు. -
ధరల కట్టడే లక్ష్యం...
ఇరాక్ సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంటాం తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయ్... క్యాడ్ కూడా భారీగా దిగొచ్చింది... ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడి ముంబై: ధరల పెరుగుదలకు కళ్లెం వేయడమే తమ ప్రధాన కర్తవ్యమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రానున్న కొద్ది త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా తమ చర్యలు కొనసాగుతాయని... దీనిపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో అధిక ధరలకు అడ్డుకట్టవేయాలంటే ప్రభుత్వం ఆహారోత్పత్తులకు సంబంధించి తగిన నిర్వహణ విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను ఆర్బీఐ, ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నాయని, గత రెండు మూడు నెలలుగా ఆహార ధరలు మళ్లీ పుంజుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారమిక్కడ ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే నెలలో టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణంరేటు ఐదు నెలల గరిష్టానికి(6.01%) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ రేటు 5.2%. ఆహారోత్పత్తులు, నిత్యావసరాల రేట్లు ఎగబాకడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. కాగా, ఎల్ నినోతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవచ్చని... దీంతో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకే ప్రమాదం పొంచిఉందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. కాగా, రాజన్ తాజా వ్యాఖ్యలతో ఇప్పట్లో పాలసీ వడ్డీరేట్ల తగ్గింపు ఉండబోదన్న సంకేతాలు బలపడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇరాక్ అనిశ్చితిపై... ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా నెలకొన్న సంక్షోభం సహా ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కోగల సత్తా భారత్‌కు ఉందని రాజన్ పేర్కొన్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకోవడంలో మనం మరింత మెరుగైన స్థితిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘దేశంలో తగినన్ని విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా భారీగా దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాక్ సహా ఇతరత్రా ఎలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైనా మనకు ముప్పేమీ లేదు. ఇరాక్‌లో చమురు నిల్వలన్నీ దక్షిణ ప్రాంతంలోనే ఉన్నాథ యి. అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం ఆ దేశ క్రూడ్ బిజినెస్‌పై పెద్దగా ప్రభావమేమీ చూపకపోవచ్చు. అయినప్పటికీ ఈ అంశం కొంత ఆందోళనకరమైనదే. అక్కడి సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నాం’ అని రాజన్ పేర్కొన్నారు. బంగారం ఇతరత్రా దిగుమతులు దిగిరావడంతో గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో క్యాడ్ జీడీపీలో 1.7 శాతానికి(32.4 బిలియన్ డాలర్లు) తగ్గడం రూపాయిపై కొంత ఒత్తిడి తగ్గించింది. అంతేకాదు ఆఖరి త్రైమాసికంలో అయితే, ఈ లోటు ఏకంగా 0.2 శాతానికి(1.2 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టమైన 4.7 శాతానికి(87.8 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇరాక్ ప్రభుత్వంపై సున్నీ తీవ్రవాదుల భీకర దాడులు... చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో చమురు ధరలకు రెక్కలు రావడం తెలిసిందే. ఈ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలోనూ తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి కూడా. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ కూడా మళ్లీ 60 దిగువకు పడిపోవడం గమనార్హం. క్రూడ్ రేట్ల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం కూడా ఎగబాకే ప్రమాదం పొంచిఉంది. కాగా, చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్‌కు క్రూడ్ రేట్ల పెరుగుదల ఇబ్బందికర అంశమే. -
దేశమంతా స్పైస్‌జెట్ మాన్సూన్ ఆఫర్
రూ.1,999కే విమానయానం మరో రెండు రోజులే బుకింగ్స్ జూలై 19-సెప్టెంబర్ 30 ప్రయాణాలకు వర్తింపు ముంబై: చౌకధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్ తన మాన్సూన్ ఆఫర్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. రూ.1,999(అన్ని పన్నులు కలుపుకొని) ధరకే విమానయానాన్ని దేశంలోని అన్ని నగరాలకు అందిస్తామని స్పైస్‌జెట్ మంగళవారం వెల్లడించింది. ఈ ఆఫర్ ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలతో పాటు తాము విమాన సర్వీసులు నడిపే అన్ని నగరాలకు వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, గురువారంతో (జూన్ 17 నుంచి 19 వరకూ) ముగుస్తాయని వివరించింది. వచ్చే నెల 19 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. గతవారంలోనే స్పైస్‌జెట్ కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎనిమిది దక్షిణాది నగరాలు-హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కోచి, కోజికోడ్, మైసూర్ల నుంచి విమానయానానికి ఈ ఆఫర్‌ను ఇచ్చింది. మరో చౌకధరల విమానయాన సంస్థ, ఇటీవలే సర్వీసులు ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా కోచి నుంచి విమాన టికెట్లను రూ.500కే (అన్ని పన్నులు కలుపుకొని) ఆఫర్ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో తన మాన్సూన్ ఆఫర్‌ను (రూ.1,999కే విమానయానం) దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని స్పైస్‌జెట్ తెలిపింది. -
ఉత్పాదకత, ఉన్నత ఆలోచనలు
వీటిపై దృష్టిపెట్టి సాహసోపేతంగావ్యవహరించండి * ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్బోధ * ఇన్ఫీకి మరోసారి గుడ్‌బై బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నెగ్గుకురావాలంటే వ్యక్తిగత ఉత్పాదకతపైనా, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్‌పైనా మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సూచించారు. ప్రతి ఇన్ఫోసియన్ (ఇన్ఫోసిస్ ఉద్యోగి) గొప్పగా ఆలోచించాలని, సాహసోపేతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కంపెనీ సీఈవో పగ్గాలను విశాల్ సిక్కాకి అప్పగించిన నేపథ్యంలో నారాయణమూర్తి శనివారం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి మరోసారి వైదొలిగారు. 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా షేర్హోల్డర్లు, ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వీడ్కోలు ప్రసంగంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. గడచిన ఏడాది కాలంగా తాను చేపట్టిన చర్యలతో కంపెనీ వ్యయాలు, రిస్కులు తగ్గగలవని, అమ్మకాలు మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్లు వైదొలగడంపై.. ఇటీవలి కాలంలో సీనియర్ల వలసకు కారణాలపై స్పందిస్తూ.. కొందరు ఉన్నత లక్ష్యాల సాధన కోసం వెళ్లగా, మరికొందరు సమర్థమైన పనితీరు కనపర్చలేక వైదొలిగారని మూర్తి వ్యాఖ్యానించారు. ‘దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికితీసి సంస్థను నిలబెట్టే అవకాశాన్ని వారికి కల్పించాలని, పనితీరు సరిగ్గా లేని వారిని.. వారు ఉండాల్సిన చోటుకి మార్చాలనే లక్ష్యంతో నేను ముందుకు సాగాను’ అని చెప్పారు. యోగ్యులైన వారిని లీడర్లుగా తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ పనితీరు కనపర్చే వారిని ప్రోత్సహించేందుకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ కెరియర్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మూర్తి తెలిపారు. రోహన్ మూర్తిపై.. ‘కొత్త ఆలోచనలు గలవారు, యథాతథ స్థితిని అంగీకరించని వారు, తెలివైనవారు నాకు సహాయంగా ఉండాలనుకున్నాను. అందుకే రోహన్‌ను వెంట తెచ్చుకున్నాను. టెక్నాలజీ ఊతంతో మార్కెట్లో ఇన్ఫోసిస్ విభిన్నంగా ఉండగలిగేలా.. చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టే బాధ్యతను అతనికి అప్పగించాను’ అంటూ కుమారుడు రోహన్ మూర్తిపై నారాయణ మూర్తి వివరణ ఇచ్చారు. మూర్తి సహాయకుడిగా రోహన్ మూర్తి పదవీ కాలం కూడా శనివారంతో ముగిసింది. అనుబంధ సంస్థకు ప్రొడక్టుల వ్యాపారం.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్, సొల్యూషన్స్ (పీపీఎస్) వ్యాపారాన్ని దాదాపు రూ. 480 కోట్లకు తమ అనుబంధ సంస్థ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కి బదలాయించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అయితే, ఇందులో బ్యాంకింగ్ సర్వీసుల సాఫ్ట్వేర్ పినాకిల్ ఉండదని సంస్థ పేర్కొంది. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఎడ్జ్వెర్వ్ను ఇన్ఫీ ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది. మూడేళ్లలో రెండోసారి వీడ్కోలు.. మూడు దశాబ్దాల క్రితం స్థాపించిన ఇన్ఫోసిస్ నుంచి మూర్తి 2011 ఆగస్టులో వైదొలిగిన సంగతి తెలిసిందే. 65 ఏళ్లు నిండటంతో కంపెనీ నిబంధనల ప్రకారం ఆయన తప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇన్ఫీ పనితీరు అంతంత మాత్రంగా మారుతుండటంతో కంపెనీ బోర్డు ఒత్తిడి మేరకు గతేడాది జూన్ 1న మూర్తి మరోసారి సంస్థ పగ్గాలు చేపట్టారు. సహకరించేందుకు తన కుమారుడు రోహన్ మూర్తిని కూడా ఆయన వెంట తెచ్చుకోవడం వివాదాస్పదమైంది. తాజాగా ప్రముఖ టెక్నోక్రాట్ విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవోగా నియమితులైన నేపథ్యంలో కంపెనీ నుంచి వైదొలగాలని మూర్తి నిర్ణయించుకున్నారు. దీంతో మూడేళ్లలో రెండోసారి ఇన్ఫీకి గుడ్‌బై చెప్పినట్లయింది. వాస్తవానికి ఆయన 2013 జూన్ 1 నుంచి అయిదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగాల్సి ఉంది. ‘కొత్త మేనేజ్మెంట్కి బాధ్యతల బదలాయింపు సులభంగా జరిగేందుకు, టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్‌ను దిగ్గజంగా తీర్చిదిద్దే క్రమంలో సిక్కాకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో నేను ముందుగానే వైదొలుగుతున్నాను’ అని ఏజీఎంలో నారాయణ మూర్తి చెప్పారు. అక్టోబర్ 10 దాకా ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నుంచి చైర్మన్ ఎమెరిటస్‌గా కొనసాగుతారు. -
ఇన్ఫీ కొత్త సారధి..విశాల్ సిక్కా
ఆగస్టు 1 నుంచి సీఈఓ, ఎండీగా బాధ్యతలు * తొలిసారి కంపెనీ బయటివ్యక్తికి పగ్గాలు * పదవి నుంచి రేపు వైదొలగనున్న * ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి టెక్నాలజీ పరిశ్రమ మార్గదర్శకులు నెలకొల్పిన ఇన్ఫోసిస్‌కు సారథ్యం వహించడం నాకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఇన్ఫీ ఉద్యోగులతో కలసి పనిచేయాలని, వారి నుంచి నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాను. కంప్యూటింగ్ టెక్నాలజీ అన్ని పరిశ్రమల తీరుతెన్నులను మారుస్తోంది. మా ఖాతాదారులు, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, వాటాదారుల విలువను మరింత ఇనుమడింపచేసేలా బ్రేక్‌త్రూ సొల్యూషన్స్‌ను అందించే అరుదైన అవకాశం మాకు లభించింది. - ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ, ఎండీగా ఎంపికైన తర్వాత విశాల్ సిక్కా వ్యాఖ్యలు బెంగళూరు: వరుసగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నిష్ర్కమణతో సతమతమవుతున్న సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా(47) నియమితులయ్యారు. ఆగస్టు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి శనివారం పదవి వీడనున్నారు. మరో సహ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్ కూడా అదే రోజు తప్పుకోనున్నారు. ఈ విషయాలను ఇన్ఫోసిస్ గురువారం వెల్లడించింది. కాగా, అసలు ఇన్ఫోసిస్‌కు సంబంధం లేని బయటవ్యక్తి కంపెనీకి సారథ్యం వహించడం తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, కంపెనీ వ్యవస్థాపకుల్లో లేనివ్యక్తి సీఈఓ కావడం కూడా ఇదే మొట్టమొదటిసారి. జర్మన్ సాఫ్ట్వేర్ సంస్థ శాప్ ఏజీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మాజీ సభ్యుడైన సిక్కా ఇన్ఫీ పూర్తికాల డెరైక్టర్‌గా శనివారం చేరనున్నారు. ఇప్పటివరకు ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న ఎస్.డి.శిబూలాల్ వచ్చే మార్చిలో రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ ముందుగానే పదవీ విరమణ చేస్తానని చెప్పడంతో ఆయన వారసుడిని ఎంపిక చేయాల్సి వచ్చింది. కాగా, ఇన్ఫోసిస్‌లోకి నారాయణ మూర్తి గతేడాది జూన్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రెండో ఇన్నింగ్ ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటిదాకా 11 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పడం తెలిసిందే. అక్టోబర్ వరకు నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా... గతంలో ఇన్ఫీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న నారాయణ మూర్తి, కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతేడాది జూన్ 1న మళ్లీ పగ్గాలు చేపట్టారు. మూర్తి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, గోపాలకృష్ణన్ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వచ్చే అక్టోబర్ 10 వరకు కొనసాగుతారు. ఇన్ఫీ బోర్డు ఎక్స్టర్నల్ డెరైక్టర్ కె.వి.కామత్ అక్టోబర్ 11 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారు. ‘సంస్థ పురోగతికి అందించిన సేవలకు గుర్తింపుగా అక్టోబర్ 11 నుంచి మూర్తి గౌరవ చైర్మన్ (చైర్మన్ ఎమిరిటస్)గా వ్యవహరిస్తారు..’ అని ఇన్ఫీ ప్రకటన తెలిపింది. 14 నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫీసు రద్దు... ఇన్ఫీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (నారాయణ మూర్తి) కార్యాలయం ఈ నెల 14 నుంచి రద్దు కానుంది. మూర్తి కుమారుడు, ఆయన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రోహన్ పదవీకాలం మూర్తితో పాటే ముగియనుంది. అంటే, రోహన్ శనివారం నుంచే కంపెనీని వీడనున్నారు. కంపెనీలో సీనియర్ ఉద్యోగులైన పన్నెండు మందికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా పదోన్నతి ఇవ్వడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థ కొత్త సీఈఓగా సిక్కాను ఎంపికచేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. గ్లోబల్ కార్పొరేషన్ సారథిగా పనిచేసిన ఆయన తన విలువైన అనుభవాన్ని ఇన్ఫీ అభివృద్ధికి వినియోగిస్తారు. శాప్‌లో విశేష విజయాలు సాధించిన సిక్కాను ఇన్ఫీ అత్యున్నత పదవికి ఎంపికచేయడం ఆదర్శనీయం..’ అని మూర్తి తెలిపారు. నేనూ టీచర్ కుమారుడినే: విశాల్ పంజాబీ కుటుంబంలో జన్మించిన విశాల్ సిక్కా విద్యాభ్యాసం గుజరాత్లో కొనసాగింది. ఆయన తండ్రి రైల్వే ఇంజనీరు. వడోదరలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌ను సిక్కా పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని సైరాక్యూస్ యూనివర్సిటీలో ఎంఎస్(కంప్యూటర్ సైన్స్) చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి 1996లో పీహెచ్డీ పొందారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఇన్ఫీ సీఈఓ పదవి ఆయన్ను వరించడానికి కారణం ఆయన విజ్ఞాన తృష్ణే. పలువురు సీనియర్ లెవల్ అధికారులు ఇటీవల ఇన్ఫీకి గుడ్‌బై చెప్పారు. మరోపక్క టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ నుంచి ఇన్ఫీకి పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్ఫీ సారథ్యాన్ని చేపట్టడం సవాలు వంటిదే. ‘కొత్త బాధ్యతలను నేను సంతోషంగా, వినయంగా స్వీకరిస్తున్నాను. నారాయణ మూర్తిలానే నేను కూడా ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ రాజ్‌కోట్ (గుజరాత్)లో టీచరుగా పనిచేశారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇన్ఫీ ఇస్తున్న ప్రాధాన్యత నన్ను సంభ్రమానికి గురిచేసింది..’ అని విశాల్ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత జెరాక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కొంతకాలం పనిచేసిన ఆయన ఆ తర్వాత సోదరునితో కలసి ఐబ్రెయిన్ పేరుతో తొలి కంపెనీని స్థాపించారు. ఐబ్రెయిన్ను ఆ తర్వాత పాటెర్న్ ఆర్ఎక్స్ టేకోవర్ చేసింది. తదనంతరం నెలకొల్పిన బోధ.కామ్‌ను పెరిగ్రైన్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది. అందులో కొంతకాలం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సిక్కా, 2002లో శాప్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ గ్రూప్ హెడ్‌గా చేరారు. ఐదేళ్లలోనే కంపెనీ సీటీఓ స్థాయికి ఎదిగారు. గేమ్ చేంజింగ్ ‘హానా’ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఘనత విశాల్‌దే. -
రెండేళ్ళు బుల్ జోరే..
భారత్ స్టాక్ మార్కెట్‌పై స్టాన్‌చార్ట్ అంచనా ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు రానున్న రెండేళ్ల కాలంలో మరింత పుంజుకుంటాయని ఈక్విటీ రీసెర్చ్ నివేదికలో స్టాన్‌చార్ట్ బ్యాంక్ అంచనా వేసింది. తద్వారా ఇన్వెస్టర్ల పెట్టుబడి సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంది. దీంతో గత నాలుగేళ్ల డౌన్‌ట్రెండ్ యూటర్న్ తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. వెరసి మార్కెట్లలో కనిపించనున్న బుల్ ట్రెండ్ అత్యంత శక్తివంతంగా ఉంటుందని అభిప్రాయపడింది. గత మూడేళ్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ స్టాక్స్‌లో దాదాపు 5% మేర తమ వాటాలను పెంచుకున్నారని తెలిపింది. ఇప్పటికే ఇండియా మార్కెట్లకు ఎఫ్ఐఐలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ఇది తెలియజేస్తున్నదని స్టాన్‌చార్ట్ విశ్లేషించింది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కదిలే సైక్లికల్ స్టాక్స్‌పట్ల ఎఫ్ఐఐలు అంత ఆసక్తిని కనబరచడంలేదని తెలిపింది. మోడీ ఎఫెక్ట్... నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికున్న ప్రాధాన్యతలు, నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా స్పందిస్తున్న తీరు వంటి అంశాలు పెట్టుబడుల వాతావరణానికి జోష్‌నిస్తుందని స్టాన్‌చార్ట్ విశ్లేషించింది. అంచనాలకంటే వేగంగా జీడీపీ రికవరీ ఉంటుందని అభిప్రాయపడింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికల్లా ఆర్థిక వ్యవస్థ 8% స్థాయిలో వృద్ధిని సాధించే అవకాశమున్నదని అభిప్రాయపడింది. ఆశావహ అంచనాలతో చూస్తే ద్రవ్యోల్బణం మందగించడంతోపాటు వడ్డీ రేట్లు తగ్గడం ద్వారా ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందని నివేదికలో పేర్కొంది. సమీప కాల ంలో జీడీపీ 6-6.5% స్థాయిలో పుంజుకోవాలంటే ఉత్పాదకతను పెంచే పాలసీ విధానాలు అవసరమని తెలిపింది. అడ్డంకులను తొలగించేదిశలో వేగవంత నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని వివరించింది. జీడీపీ 8% వృద్ధిని అందుకోవాలంటే ఏడాదికి 80 బిలియన్ డాలర్ల చొప్పున విదేశీ నిధులు లభించాల్సి ఉంటుందని తెలిపింది. నిజానికి 12వ పంచవర్ష ప్రణాళిక కాలం(2013-17)లో 8% జీడీపీ వృద్ధిని ప్రభుత్వం ఆశించింది. మౌలిక సదుపాయాలు తదితర రంగాలకు అవసరమైన విదేశీ పెట్టుబడుల ఆధారంగా ఈ అంచనాలు రూపొందించింది. బ్యాంకులు, సిమెంట్‌కు డిమాండ్ బుల్ ట్రెండ్ కొనసాగితే బ్యాంకులు, సిమెంట్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు భారీగా లాభపడతాయని స్టాన్‌చార్ట్ పేర్కొంది. సబ్సిడీల తగ్గింపు, సంస్కరణల అమలు అంశాలతో ఆయిల్, గ్యాస్ షేర్లకు సైతం గిరాకీ పెరుగుతుందని అంచనా వేసింది. ఎఫ్ఐఐల పెట్టుబడుల విషయానికివస్తే... ఇప్పటికే బీఎస్ఈ 500 సూచీలోని స్టాక్స్‌పై 231 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇది అందుబాటులో ఉన్న ఈక్విటీ క్యాపిటల్‌లో 19.2% వాటాకు సమానం. స్థూల ఆర్థిక వాతావరణం క్షీణిస్తున్నా ఎఫ్ఐఐలు గత 3-4 ఏళ్లుగా ఎగుమతులు, వినియోగ ఆధార రంగాలలో ఇన్వెస్ట్ చేస్తూ రావడం విశేషమని వ్యాఖ్యానించింది. బ్రిక్‌లో భారత్ బెటర్: ఓఈసీడీ న్యూఢిల్లీ: బ్రిక్(బీఆర్ఐసీ- బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) దేశాల్లో భారత్ ఆర్థిక భవిత బాగుండే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓఈసీడీ(ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) అంచనావేస్తోంది. తన కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్ఐ) ఈ విషయాన్ని సూచిస్తున్నాయని మంగళవారం విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. ప్రధానంగా బ్రిక్తోపాటు 34 అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి తీరును గమనించే ఈ సంస్థ నివేదికలో ముఖ్యాంశాలు.. * గడచిన రెండేళ్లుగా 5 శాతం దిగువన ఆర్థికాభివృద్ధి రేటును సాధిస్తున్న భారత్, తిరిగి అధిక వృద్ధి బాటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. * అయితే బ్రిక్ కూటమిలో మిగిలిన బ్రెజిల్, చైనా, రష్యాల్లో వృద్ధి ఆశించినదానికన్నా తక్కువగా ఉంది. * అమెరికా, కెనడాల్లో స్థిర వృద్ధి ధోరణిని సీఎల్ఐ సూచిస్తోంది. బ్రిటన్ ఆర్థికరంగం కొంత స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. -
ఈ ఏడాది వృద్ధి 6.2%: ఈ అండ్ వై
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) 6.2% ఉంటుందని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) తాజాగా అంచనావేసింది. రానున్న మూడేళ్లలో వృద్ధి 8 శాతాన్ని అందుకోగలదని కూడా పేర్కొంది. మారుతున్న దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2013-14లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 4.7%. వరుసగా రెండవ యేడాది 5% దిగువన జీడీపీ కొనసాగింది. రూ. 4 లక్షలకు ఐటీ పరిమితి పెంచాలి... కాగా వృద్ధికి ఊపునిచ్చే క్రమంలో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) పరిమితిని రూ. 4 లక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి సంస్థ విజ్ఞప్తి చేసింది. అలాగే జూలైలో రానున్న బడ్జెట్లో చిన్న ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికి అదనపు పన్ను ప్రయోజనాలను కల్పించాలని కోరుతున్నట్లు సంస్థ విధాన వ్యవహారాల ప్రధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. మూలధన వ్యయాలను పెంచి తద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలని కోరారు. చిన్న పొదుపులకు ప్రోత్సాహం, జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల విభాగాల్లో సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం, ప్రభుత్వ వ్యయాల్లో పునర్వ్యవస్థీకరణ కూడా అవసరమని సూచించారు. సీఎస్‌ఆర్‌పై భారీ వ్యయం: కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలు అమలులోకి వస్తే, భారత్ కార్పొరేట్ రంగం వార్షికంగా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతల(సీఎస్ఆర్) కింద రూ.22,000 కోట్లు వెచ్చించాల్సి రావచ్చని ఈ అండ్ వై అంచనావేసింది. వార్షిక నికర లాభంలో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాలపై వెచ్చించాల్సిన పరిధిలో దేశంలో దాదాపు 16,500 కంపెనీలు ఉన్నట్లు పేర్కొంది -
ఇన్ఫోసిస్‌లో 12వ వికెట్
కంపెనీ గ్లోబల్ హెడ్ ప్రసాద్ నిష్ర్కమణ బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సీనియర్ అధికారుల నిష్ర్కమణ కొనసాగుతోంది. తాజాగా కంపెనీ గ్లోబల్ హెడ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) ప్రసాద్ త్రికూటం గురువారం ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగారు. కొత్తగా సీఈవో ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఇన్ఫోసిస్ కార్యకలాపాలను కూడా చూసే ప్రసాద్ రాజీనామా చేయడం గమనార్హం. ఈయన బాధ్యతలను కంపెనీ ప్రస్తుత అధ్యక్షుడు, బోర్డ్ సభ్యుడు కూడా అయిన యు.బి. ప్రవీణ్‌రావు చూస్తారని ఇన్ఫోసిస్ ప్రతినిధి పేర్కొన్నారు. గతంలో ప్రసాద్ ఎనర్జీ, యుటిలిటీస్, కమ్యూనికేషన్స్ విభాగానికి అధినేతగా పనిచేశారు. ఇన్ఫోసిస్‌కు సీఈవో కానున్నారని ఊహాగానాలున్న బి.జి. శ్రీనివాస్ రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ప్రసాద్ వైదొలగుతున్నారు. ఇలా అయితే కష్టమే.. కాగా నారాయణ మూర్తి మళ్లీ ఇన్ఫోసిస్‌లో చేరిన ఏడాది కాలంలో కంపెనీ నుంచి ఇప్పటిదాకా 12 మంది సీనియర్ అధికారులు రాజీనామా చేశారు. అశోక్ వేమూరి, వి. బాలకృష్ణన్, బసాబ్ ప్రధాన్, చంద్రశేఖర్ కకాల్, స్టీఫెన్ ప్రట్ వంటి ఉద్దండులు కంపెనీని వీడిపోయారు. సీనియర్ ఆధికారులే కాకుండా, సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీ నుంచి వైదొలుగుతున్నారని, ఇలా అయితే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయాన్ని ఆర్జించలేకపోవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు పెదవి విరుస్తున్నాయి. ఆవేక్ష టెక్నాలజీస్‌లో ఇన్ఫీ ‘బాల’ న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి.బాల కృష్ణన్ అవేక్ష టెక్నాలజీలో చేరారు. తమ కంపెనీ సలహా మండలి సభ్యుడిగా బాలకృష్ణన్‌ను నియమించుకున్నామని అవేక్ష టెక్నాలజీస్ పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థను కొందరు ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులే స్థాపిం చారు. ఈ కంపెనీ ఐటీ కన్సల్టింగ్, సొల్యూషన్స్ సర్వీసులను అందిస్తోంది. బాలకృష్ణన్ గత ఏడాది డిసెంబర్లో ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగారు. ఇటీవల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. -
లాభంలో 2 శాతం సామాజిక కార్యక్రమాలకే
ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి జైపూర్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలకు ప్రతి ఏటా నికర లాభంలో రెండు శాతానికి పైగా ఖర్చు చేయడమే స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఉద్దేశమని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. గతంలో లాభంలో ఒక శాతాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించామని చెప్పారు. సీఎస్ఆర్లో భాగంగా స్కూలు బస్సు, అంబులెన్సు, సోలార్ ప్యానెళ్లను అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. సమాజ సేవకు నికర లాభంలో రెండు శాతానికిపైగా ఈ ఏడాది నుంచే ఖర్చు చేస్తామని తెలిపారు. -
‘రియల్’ లాభాలు కావాలంటే..
భారత్ వంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులపరంగా రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, షాపు, అభివృద్ధి చేయని భూమి... దేని లాభాలు దానికున్నాయి. వీటిని కొనుగోలు చేసే వారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక ధరకు తిరిగి అమ్మడం ద్వారా లాభం (క్యాపిటల్ గెయిన్స్) పొందడానికి కొంటున్నారా లేక వీటిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందడానికి కొనుగోలు చేస్తున్నారా అనే అంశంలో ఇన్వెస్టర్లకు స్పష్టత ఉండాలి. బాండ్లు, ఈక్విటీల వంటి ఆస్తులకు భిన్నమైనది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో అపార్ట్మెంటు లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నపుడు ఆ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయా అనేది పరిశీలించాలి. బిల్డర్ ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి. ఇంకా పొందాల్సిన పర్మిట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. సదరు ఆస్తిపై మీ పెట్టుబడిని, ఎంత ఆదాయం వస్తుందన్న అంశాలను గమనించాలి. పోర్టుఫోలియోలో ప్రాధాన్యతలు... భూమిని కొంటున్నట్లయితే నిర్వహణ వ్యయం ఎంతవుతుందో లెక్కించాలి. ఆక్రమణలను నివారిం చడానికి ఆ భూమిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలతోపాటు స్థిరాస్తి కొనదలుచుకున్న ప్రాంతంలో పరిస్థితులను గమనిస్తుండాలి. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలు, బంగారం, సెక్యూరిటీలకు ప్రాధాన్యతను పరిస్థితులకు అనుగుణంగా మారుస్తుండాలి. ఆదాయ సామర్థ్యం దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగం ధనికులకు అత్యంత ఆకర్షణీయమైనది. క్యాపిటల్ గెయిన్స్‌తో పాటు స్థిరాదాయం కూడా ఇస్తుంది. షేర్లయినా, రియల్ ఎస్టేట్ అయినా అన్ని అంశాలనూ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. నిర్దిష్ట ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. -
ఎయిరిండియాలో మరో భారీ స్కామ్
న్యూఢిల్లీ: అసలే తీవ్ర ఆర్థిక సమస్యలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియా.. ఇంటిదొంగల చేతివాటంతో మరింత కుదేలవుతోంది. ఇటీవలే ఎల్టీసీ కుంభకోణంతో కుదుపునకు గురైన సంస్థలో మరో భారీ స్కామ్ బయటపడింది. సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రయాణ ఛార్జీల స్కీమ్(ఎఫ్ఎఫ్ఎస్)కు సంబంధించి... కోట్లాది రూపాయల మోసం జరిగినట్లు విజిలెన్స్ విభాగం దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలు... ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు ఏజెన్సీలతో ముడిపడిఉన్నందున సీబీఐ విచారణకు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎఫ్ఎఫ్ఎస్ కింద ఎయిరిండియా ఉద్యోగులు తమ కుటుంబసభ్యులను ఏడాదికోసారి దేశీయంగా ఎక్కడికైనా సంస్థ విమానాల్లో రాయితీ చార్జీల్లో తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ స్కీమ్‌లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీబీఓ) బీకే మౌర్య ధ్రువీకరించారు. ఒక అనుమానిత ట్రావెల్ ఏజెన్సీ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ను దుర్వినియోగం చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని.. దీనివల్ల దాదాపు రూ.6 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఇంకా చాలా ట్రావెల్ ఏజెన్సీలకు పాత్ర ఉండొచ్చనే అనుమానిస్తున్నామని.. దీనివల్ల నష్టం కూడా భారీగా ఉండొచ్చన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ జరపాలని తాము కోరినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు ఎయిరిండియా అధికార ప్రతినిధులెవరూ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. తవ్వినకొద్దీ అక్రమాలు... ఈ స్కామ్‌పై సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ... కంపెనీ విజిలెన్స్ బృందం అంతర్గత దర్యాప్తులో 2007 నుంచి రికార్డులను పరిశీలించినట్లు వెల్లడించారు. ఒక్క సెక్టార్లోనే ఈ స్కీమ్ కింద 5,916 టిక్కెట్లలో అవకతవకలు బయటపడినట్లు తెలిపారు. ఆడిట్ కూపన్లో పేర్కొన్న ప్రయాణ చార్జీ కంటే... ప్రయాణించిన టిక్కెట్(ఫ్లైట్) కూపన్లలో చార్జీ మొత్తాన్ని అధికంగా చూపించడం ద్వారా ఒక ట్రావెల్ ఆపరేటర్ మోసానికి పాల్పడినట్లు తేలింది. విజిలెన్స్ దర్యాప్తు నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారని సీబీఐ అధికారి చెప్పారు. ఈ చార్జీల మధ్య వ్యత్యాసాన్ని సొమ్ముచేసుకున్నారని వెల్లడించారు. నిబంధనలకు తూట్లు... అంతేకాకుండా స్కీమ్‌ను దుర్వినియోగం చేయకుండా.. టిక్కెట్లలో కుటుంబ సభ్యులందరూ కలిసే ప్రయణిస్తున్నట్లు తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది. అయితే, చాలా టిక్కెట్లలో ఈ నిబంధనలను తుంగలోతొక్కినట్లు విజిలెన్స్ నివేదిక తేల్చింది. ఈ స్కామ్‌లో మోసగాళ్లతో తమ సొంత సిబ్బంది కూడా చేతులుకలిపి ఉండొచ్చని ఎయిరిండియా అనుమానిస్తున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. చెన్నై-పోర్ట్‌బ్లెయిర్, కోల్‌కతా-పోర్ట్‌బ్లెయిర్ సెక్టార్లో టిక్కెట్లపై విజిలెన్స్ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. గతంలో సిబ్బంది లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) స్కీమ్‌లో కుంభకోణాన్ని కూడా విజిలెన్స్ విభాగమే బయటపెట్టింది. దీనిపైన కూడా ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. -
శ్రమించే వాతావరణాన్ని సృష్టించాలి: కొచర్
గాంధీనగర్: భారత్‌ను ఆర్థిక సేవల కేంద్రంగా రూపొందించాలని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ బుధవారం చెప్పారు. దీని కోసం మరింత వృద్ధి సాధిం చాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అంతేకాకుండా ద్రవ్యలోటు, కరంట్ అకౌంట్ లోటుల్లో స్థిరత్వాన్ని సాధించాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచాలని ఆమె సూచించారు. ఆర్థిక సేవలు మరింత వృద్ధి చెందడానికి భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. ఇక్కడి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్(గిఫ్ట్) సిటీలో ‘ఆర్థిక సేవలు-ఆర్థిక వృద్ధికి కీలక చోదక శకి’్త అన్న అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆమె మాట్లాడారు. దేశంలో సమర్థవంతమైన, పటిష్టమైన శ్రమించే వాతావరణాన్ని సృష్టించాల్సి ఉందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రేక్షకుడిగా పాల్గొన్న ఈ సెమినార్లో ఆమె ఉద్ఘాటించారు. -
విలువైన బ్రాండ్ టాటా
లండన్: భారత దేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ అవతరించింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన ఈ గ్లోబల్ టాప్ 500 బ్రాండ్ జాబితాలో 2,110 కోట్ల డాలర్ల విలువతో టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని(భారత్ వరకూ) ఈ ఏడాది కూడా నిలుపుకుంది. గత ఏడాది 39వ స్థానంలో ఉన్న టాటా బ్రాండ్ ఈ ఏడాది 34వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో భారత కంపెనీలు గత ఏడాది ఆరు ఉండగా, ఈ ఏడాది ఈ సంఖ్య 5కు పడిపోయింది. ఒక్క టాటా మినహా మిగిలిన నాలుగు సంస్థల ర్యాంక్‌లు ఈ ఏడాది తగ్గాయి. అంతర్జాతీయ జాబితాలోని ఇతర భారత కంపెనీలు ఎస్బీఐ (347వ స్థానం), ఎయిర్టెల్(381), రిలయన్స్ ఇండస్ట్రీస్(413), ఇండియన్ ఆయిల్(474), ఈ జాబితాలో ఈ ఏడాది చోటు దక్కించుకోలేని కంపెనీగా ఐటీసీ నిలిచింది. మూడోసారీ యాపిలే ఇక ఈ జాబితాలో 10,500 కోట్ల డాలర్లతో యాపిల్ బ్రాండ్ మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది. అగ్రస్థానంలో యాపిల్ నిలవడం ఇది వరుసగా మూడో ఏడాది. 7,900 కోట్ల డాలర్లతో శామ్సంగ్ రెండో స్థానం సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, వెరిజాన్, జీఈ, ఏటీఅండ్‌టీ, అమెజాన్, వాల్‌మార్ట్, ఐబీఎంలు నిలిచాయి. ఇక అత్యంత శక్తివంతమైన అంతర్జాతీయ బ్రాండ్‌గా ఫెరారి నిలిచింది. ఈ గ్లోబల్ జాబితాలో అమెరికా బ్రాండ్లు ఎక్కువగా(185) ఉన్నాయి. -
మహీంద్రా రేవా ఈ2ఓ కారు ధర కట్
న్యూఢిల్లీ: మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ఈ2ఓ ధర రూ.1.7 లక్షల వరకూ తగ్గే ఒక కొత్త స్కీమ్‌ను మంగళవారం ప్రకటించింది. గుడ్‌బై ఫ్యూయల్, హెలో ఎలక్ట్రిక్ పేరుతో వినూత్నమైన ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్‌ను అందిస్తున్నామని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈవో చేతన్ మైణి చెప్పారు. చార్జింగ్ బ్యాటరీని కొనుగోలు చేయకుండా నెలకు రూ.2,599 చొప్పున ఐదేళ్లు చెల్లించే ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్ కారణంగా రూ. 6.69 లక్షల ధర ఉండే ఈ2ఓ కారును ఇప్పుడు రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ లిథియమ్ అయాన్ బ్యాటరీ నెలకు 800 కిమీ. చొప్పున(సగటున)ఐదేళ్లకు 50 వేల కిమీ. దూరం ప్రయాణిస్తుందని వివరించారు. బ్యాటరీ రెంటల్‌తో పాటు ఎలక్ట్రిసిటీ కంజప్షన్ చార్జీని కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇది చాలా స్వల్పంగానే ఉండగలదని ఆయన వివరించారు. 24 గంటలూ రిపేర్ సేవలు అందుబాటులో ఉంటాయని, బ్యాటరీ రిపేర్ కాలంలో మరో కారును సమకూరుస్తామని పేర్కొన్నారు. కొత్త స్మార్ట్ పోర్ట్ టెక్నాలజీతో క్విక్2చార్జ్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. దీంతో ఈ2ఓ కారును ఒక్క గంటలోనే పూర్తిగా చార్జ్ చేయవచ్చు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టోల్-ఫ్రీ సేవలు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీసులో ఆరు ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను ఖాతాదారులు నిర్వహించుకోవచ్చని బ్యాంక్ హెడ్(డిజిటల్ బ్యాంకింగ్) నితిన్ చుగ్ చెప్పారు. మినీ స్టేట్మెంట్, బ్యా లెన్స్ ఎంక్వైరీ సమాచారాన్ని ఎస్ఎం ఎస్‌ల ద్వారా ఖాతాదారులకు అందిస్తామని చెప్పారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్, చెక్‌బుక్ రిక్వెస్ట్, అకౌంట్ స్టేట్మెంట్, ఈ మెయిల్ స్టేట్మెంట్ వంటి మరో 4 సర్వీసులను పొందవచ్చన్నారు. ఈ సర్వీస్ ఉచితమని, ఎలాంటి చార్జీలు లేవని చెప్పారు. బేసిక్ మొబైల్ హ్యాండ్సెట్ ద్వారానైనా ఈ సర్వీసును రాత్రీ, పగలు ఎప్పుడైనా పొందవచ్చని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా లేదా సమీపంలోని బ్యాంక్ బ్రాం చీలో నమోదు చేసుకోవడం ద్వారా కానీ ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను పొందవచ్చని తెలిపారు. -
ఎయిర్ కోస్టా భారీ ఆర్డర్
సాక్షి, విజయవాడ: దక్షిణ భారత దేశంలో విమానయాన సర్వీసులను అందించడంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకున్న ‘ఎయిర్ కోస్టా’ మరో 50 ఈ-జెట్స్ విమానాలు కొనేందుకు సిద్ధమైంది. ఇందుకుగాను బ్రెజిల్ దేశానికి చెందిన ఎంబ్రాయిర్ ఎస్ఏ అనే విమానాల తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లో గురువారం జరిగిన ఒక ఎయిర్ షోలో ఎయిర్ కోస్టా ఛైర్మన్ లింగమనేని రమేష్, ఎంబ్రాయిర్ కమర్షియల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో పౌలో సిజర్ సిల్వా మధ్య 2.94 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.18,300 కోట్లు) ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ190-ఈ2ఎస్, ఈ195-ఈ2ఎస్ మోడల్ విమానాలు 25 చొప్పున 2018 నాటికి ఎయిర్ కోస్టాకు అందుతాయి. ఈ190ఈ2 మోడల్ విమానంలో 98 ద్వితీయశ్రేణి, ఆరు ప్రథమశ్రేణి సీట్లుంటాయి. ఈ195-ఈ2లో 118 సీట్లు, 12 ప్రథమశ్రేణి సీట్లుంటాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడలతోపాటు ఉత్తరభారతదేశంలోని అహ్మదాబాద్,ై జెపూర్లతో కొన్ని పట్టణాలకు ఎయిర్ కోస్టా సంస్థ సేవలను అందిస్తోంది. నూతన విమానాలను కొనుగోలు చేయడం ద్వారా వైజాగ్, గోవా, పూనా, మధురై వంటి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విమాన సేవలను విస్తరించాలని, కొన్ని నగరాలకు నేరుగా విమాన సర్వీసులు నడపడంతో పాటు వ్యాపార లావాదేవీలు బాగా జరిగే పట్టణాలకు విమాన సేవలు అందించాలని భావిస్తోంది. ఎయిర్ కోస్టాతో ఒప్పందం ద్వారా భారతదేశంలో తమ సంస్థ అడుగుపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సిల్వా తెలిపారు. కొత్తగా విమానాలు కోనుగోలు చేయడం ద్వారా భారత దేశమంతంటికీ తమ సంస్థ సేవలను విస్తరించాలని భావిస్తున్నట్లు ఎయిర్ కోస్టా చైర్మన్ లింగమనేని రమేష్ తెలిపారు. -
అందరూ అవినీతిపరులు కారు: ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: దేశమంతా అవినీతిలో కూరుకుపోయిందన్నది చాలా తప్పుడు భావన అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. అందరూ అవినీతిపరులు కారన్నారు. నియంత్రణ సంస్థలు కూడా అందరినీ అదే దృష్టికోణంతో చూడకుండా.. క్షమించరాని ఉల్లంఘనలకు కంపెనీలు పాల్పడ్డాయని, క్రిమినల్ నేరాలు చేశాయని పక్కాగా రుజువులు ఉన్నప్పుడే రంగంలోకి దిగాలని సూచించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) స్వర్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిదంబరం ఈ విషయాలు తెలిపారు. ‘నేను అవినీతికి మద్దతు పలకడం లేదు. కానీ అందరూ అవినీతిపరులని మాత్రం నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు, మీ తల్లిదండ్రులు, మిత్రులు, ప్రతి ఒక్కరు అవినీతిపరులన్న భావన్న చాలా దారుణమైనది. ఇలా మనల్ని మనమే తక్కువ చేసుకోవడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను’ అని చిదంబరం చెప్పారు. -
టాప్‌గేర్‌లో టాటామోటార్స్
ముంబై: దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 3 రెట్లు ఎగసి రూ.4,805 కోట్లను తాకింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో రూ.1,628 కోట్లు మాత్రమే ఆర్జించింది. బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) అమ్మకాలు పురోగమించడం ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఎఫ్‌వో సి.రామకృష్ణన్ చెప్పారు. దీనికితోడు పెట్టుబడుల విక్రయం ద్వారా రూ.1,250 కోట్ల ఇతర ఆదాయాన్ని కంపెనీ అందుకోగా, రూ.630 కోట్లమేర ట్యాక్స్ క్రెడిట్‌ను పొందింది. ఇక ఈ కాలంలో అమ్మకాలు సైతం 39% ఎగసి రూ.63,536 కోట్లను తాకాయి. అంతక్రితం ఇదే కాలంలో అమ్మకాలు రూ.45,821 కోట్లుగా ఉన్నాయి. బ్రిటిష్ సంస్థ సహ కారం డిసెంబర్ క్వార్టర్‌కు జేఎల్ఆర్ నికర లాభం 29.6 కోట్ల పౌండ్ల నుంచి 61.9 కోట్ల పౌండ్లకు ఎగసింది. నష్టాలతో కుదేలైన జేఎల్ఆర్ను టాటా మోటార్స్ 2008లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై వరుసగా ఎనిమిదో క్వార్టర్లో సైతం కంపెనీ మంచి పనితీరును చూపడం విశేషం! ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో ఆదాయం కూడా 40% పుంజుకుని 532.8 కోట్ల పౌండ్లను చేరింది. గతంలో 380.4 కోట్ల పౌండ్ల ఆదాయం నమోదైంది. వాహన అమ్మకాలు 23% వృద్ధితో 1,16,357 యూనిట్లను తాకాయి. ఇందుకు రేంజ్ రోవర్ స్పోర్ట్, జాగ్వార్ ఎఫ్‌టైప్, ఎక్స్ఎఫ్, ఎక్స్‌జే వంటి కొత్త మోడళ్లు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. కాగా, స్టాండ్అలోన్ ప్రాతిపదికన డిసెంబర్ క్వార్టర్లో రూ.1,251 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. ఆదాయం మాత్రం రూ. 10,630 కోట్ల నుంచి రూ. 7,770 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 458.5 కోట్ల నికర నష్టం నమోదైంది. వాహన విక్రయాలు కూడా 36% వరకూ తగ్గి 1,32,087 యూనిట్లకు పరిమితమయ్యాయి. బీఎస్ఈలో షేరు ధర 1% లాభంతో రూ. 364 వద్ద ముగిసింది. -
టెక్నాలజీ ‘ఎవరెస్ట్’ పై... తెలుగోడు
బిల్ గేట్స్... స్టీవ్ బామర్... తరవాతి పేరు మన వాడిదే. తెలుగువాడు సత్య నాదెళ్లదే. 39 ఏళ్ల చరిత్ర ఉన్న మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈఓగా హైదరాబాదీ సత్య నాదెళ్ల ఎంపికయ్యాడు. మణిపాల్, విస్కాన్సిన్ మీదుగా హైదరాబాద్ నుంచి రెడ్మండ్ చేరిన ఈ సత్య... తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో ఏకంగా స్కూలే పెట్టారు. ప్రతి భారతీయుడికీ ఆయన ప్రస్థానం స్ఫూర్తినిచ్చేదే. న్యూయార్క్: నిన్న మొన్నటిదాకా ఊహగానాలకి పరిమితమైనది మొత్తానికి వాస్తవరూపం దాల్చింది. మరో అమెరికన్ దిగ్గజానికి మన ఇండియన్ సారథ్యం వహించనున్నారు. 78 బిలియన్ డాలర్ల టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కి సీఈవోగా మన తెలుగువాడు సత్య నాదెళ్ల నియమితులయ్యారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. సత్యను సీఈవోగా నియమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. బిల్‌గేట్స్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో మన సత్య నాదెళ్ల (47) ముచ్చటగా మూడో సీఈవో. తనతో పోటీపడిన గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుందర్ పిచ్చయ్యను తోసిరాజని సత్య దీన్ని దక్కించుకున్నారు. క్రికెట్ అంటే ఇష్టపడే సత్య.. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. ప్రస్తుత సీఈవో స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇండిపెండెంట్ డెరైక్టర్ జాన్ థాంప్సన్ తాజాగా చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ బిల్ గేట్స్ ఇకపై టెక్నాలజీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు. కంపెనీ ఉత్పత్తులు, టెక్నాలజీల రూపకల్పనకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెడతారు. ఒకవైపు విండోస్, ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండటం మరోవైపు.. డివైజ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొంగొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ విస్తరిస్తున్న తరుణంలో సత్య సీఈవోగా బాధ్యతలు చేపడుతుండటం గమనార్హం. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 31,400 కోట్ల డాలర్లు. మైక్రోసాఫ్ట్‌కి తగిన సారథి.. కంపెనీ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో .. సంస్థను ముందుంచి నడిపేందుకు సత్యను మించి మరొకరు లేరంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, అందర్నీ ఏకతాటిపైకి తేగలిగే సత్తా గల నాయకుడిగా సత్య తన సామర్థ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటూనే ఉన్నారంటూ గేట్స్ ప్రశంసించారు. మరోవైపు, మైక్రోసాఫ్ట్‌కి సరైన సారథి సత్య అని స్టీవ్ బామర్ పేర్కొన్నారు. ఆయనతో 20 ఏళ్లకుపైగా కలసి పనిచేశానని, మైక్రోసాఫ్ట్‌కి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారన్నారు. అసాధ్యాలను సాధ్యం చేయగలం.. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్లో సత్య.. ‘అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి.. అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి’ అంటూ ప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజ్‌ల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థా సాధికారత సాధించగలిగేలా చూడగలగడం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరిం తగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కి సీఈవో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా.. నవకల్పనలకే పెద్దపీట దక్కుతుందని సత్య చెప్పారు. సత్య... మిస్టర్ నైస్ గై పూర్తి పేరు: నాదెళ్ల సత్యనారాయణ చౌదరి స్వస్థలం: అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, బుక్కాపురం పుట్టిన సంవత్సరం: 1967, హైదరాబాద్‌లో వయసు: 47 కుటుంబం: భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. తండ్రి బీఎన్ యుగంధర్ నాయుడు మాజీ ఐఏఎస్ అధికారి. నివాసం: వాషింగ్టన్లో. చదువు: బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో మొదలు డిగ్రీలు: మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అమెరికా మిల్వాకీలోని విస్కాన్సిన్ వర్సిటీ నుంచి ఎంఎస్. షికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ. ఉద్యోగ ప్రస్థానం: తొలుత సన్మైక్రోసిస్టమ్స్లో చేరారు. తరవాత 1992 నుంచీ మైక్రోసాఫ్ట్‌లో. {పస్తుత స్థానం: క్లౌడ్ కంప్యూటింగ్ హెడ్ వేతనం: 76 లక్షల డాలర్లు (2012-13) కలిసొచ్చినవివే... స్టీవ్ బామర్ కన్నా సత్యకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. విస్తృతమైన ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్. 1992లో మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరాక... క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు. ఈయనను ‘క్లౌడ్ గురు’గా పిలుస్తారు మైక్రోసాఫ్ట్‌కు చెందిన 2000 కోట్ల డాలర్ల సర్వర్ అండ్ టూల్స్ బిజినెస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. దీనికి ముందు ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్‌కు చెందిన ఆర్ అండ్ డీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, మైక్రో సాఫ్ట్ బిజినెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా సేవలందించారు. ఆఫీస్ 365 ప్రోగ్రామ్ విజయం వెనక ఆయన కృషి ఎంతో ఉంది. ‘క్లౌడ్ ఓఎస్’ ఘనత సత్యదే.. మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకూ ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 20 బిలియన్ డాలర్ల వ్యాపారమైన సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్, బిజినెస్ డివిజన్లలో ఆయన గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 38 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన బిల్‌గేట్స్, స్టీవ్ బామర్‌లే ఇంతవరకూ సీఈవోలుగా పనిచేశారు. ఇప్పుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈవో. క్రికెట్ ఎన్నో నేర్పింది... కవితలన్నా, క్రికెటన్నా సత్య నాదెళ్లకు చాలా ఇష్టం. క్రికెట్ వల్లే టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని సీఈవోగా తన నియామకం ఖరారైన అనంతరం ఆయన చెప్పారు. అత్యంత సుదీర్ఘంగా సాగే టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ఆసక్తికరమైన మలుపులు తిరిగే మ్యాచ్‌ను చూస్తుంటే.. రష్యన్ నవల చదువుతున్నట్లుగా ఉంటుందని చెప్పారాయన. కవితలైతే రహస్య సంకేతాల్లా అనిపిస్తాయన్నారు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన సాధనాలను మైక్రోసాఫ్ట్ అందిస్తోందని, అది చూశాకే ఆ కంపెనీలో చేరానని చెప్పారాయన. ‘నేను నిర్మించడాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతా. ఇప్పటికీ తరచు బోలెడన్ని ఆన్లైన్ కోర్సులు చేస్తుంటా. అప్పట్లో మాస్టర్స్ డిగ్రీ చదివేటప్పుడు ప్రతి శుక్రవారం రాత్రి షికాగోకి వెళ్లేవాణ్ణి. శనివారాలు క్లాసులకు హాజరయ్యి.. మళ్లీ సోమవారానికల్లా రెడ్మండ్ (మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉన్న చోటు)కి వచ్చేసేవాణ్ని. దాదాపు రెండున్నరేళ్లు పట్టింది కానీ... మొత్తానికి మాస్టర్స్ డిగ్రీ అలా పూర్తి చేసేశా. కొత్తవి నేర్చుకోవటం ఆపేస్తే మనం ఉపయోగకరమైన పనులు చేయడం మానేసినట్లేనన్నది నా ఉద్దేశం’’ సన్నిహితుల సంతోషం... హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ బాస్‌గా సత్య నాదెళ్ల నియామకం గురించి తెలియటంతో ఆయన కుటుంబం, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆయన తల్లిదండ్రులుంటున్న నివాసానికి సన్నిహితులు, విలేకరులు వెల్లువెత్తారు. అయితే, సత్య తండ్రి , మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎస్.యుగంధర్ మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆయన స్పందన కోసం మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు పంపినా స్పందించలేదు. మరోవైపు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌పీఎస్ సొసైటీ కార్యదర్శి ఫయాజ్ ఖాన్ వెల్లడించారు. హెచ్‌పీఎస్‌లో చదివిన సత్యకి.. ఫయాజ్ సహాధ్యాయి. తగిన సమయం చూసుకుని సత్యను స్కూలుకు ఆహ్వానిస్తామని ఖాన్ చెప్పారు. సత్య సారథ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త శిఖరాలను అధిరోహించగలదని మరో సహాధ్యాయి, నగరానికి చెందిన టెక్నాలజీ సంస్థ మాజీ సీఈవో అయిన ఎం.చంద్రశేఖర్ ఆకాంక్షించారు. ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక భారతీయుడు సీఈవో కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఇంజనీరింగ్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ సీఎండీ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. సత్య నియామకంపై హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థి, అపోలో హాస్పిటల్స్ సీఈవో హరి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
టెలికంకు ‘టాటా’..!
ముంబై: విదేశాల్లో భారీ టేకోవర్లతో దూసుకెళ్లిన టాటా గ్రూప్... స్వదేశంలో మాత్రం కీలకమైన టెలికం రంగం నుంచి వైదొలగనుందా? మార్కెట్ వర్గాలు, మీడియాలో ఇప్పుడు ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సైరస్ మిస్త్రీ... గ్రూప్‌లో భారీ వ్యూహాత్మక మార్పులకు తెరతీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టెలికం వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ పేరుతో టాటా గ్రూప్ మెజారిటీ వాటాదారుగా టెలికం సేవలను అందిస్తోంది. అయితే, ఈ రెండు కంపెనీల్లో తమకున్న వాటాను బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయని ఒక బిజినెస్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ డీల్‌కు సంబంధించిన సంప్రతింపులు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని కూడా వెల్లడించింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌దాకా అనేక ఉత్పత్తులు, సేవలకు సంబంధించి 100కు పైగా కంపెనీలు టాటా గ్రూప్‌లో ఉన్నాయి. డీల్ సంక్టిష్టమే... టాటా గ్రూప్ టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్‌కు విక్రయించడం అంత సులువేమీ కాదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే టాటా టెలీ, టాటా కమ్యూనికేషన్స్ రెండింటిలోనూ బోర్డు నిర్ణయాలను శాసించేస్థాయిలో అనేక మంది వాటాదార్లు ఉన్నారు. దీంతో డీల్ పూర్తవ్వాలంటే అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. టాటా టెలీలో జపాన్ కంపెనీ ఎన్టీటీ డొకోమోకు 26% వాటా ఉంది. 2008లో సుమారు 2.1 బిలియన్ డాలర్లకు ఈ వాటాను కొనుగోలు చేసింది. మరోపక్క, అంతర్జాతీయస్థాయిలో మొబైల్ డేటా సేవలందిస్తున్న టాటా కమ్యూనికేషన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి 26% వాటా ఉండటం గమనార్హం. ప్రభుత్వం రంగంలోని వీఎస్‌ఎన్‌ఎల్‌ను డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా టాటా గ్రూప్ చేజిక్కించుకుని టాటా కమ్యూనికేషన్స్‌గా పేరు మార్చడం తెలిసిందే. కాగా, ముందుగాా ఈ 26 శాతం ప్రభుత్వ వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసి... ఆతర్వాత మొత్తం కంపెనీ(మెజారిటీ వాటా)ని వొడాఫోన్‌కు విక్రయించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం, టాటా గ్రూప్ మధ్య సంప్రతింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా... టాటా కమ్యూనికేషన్స్‌కు ఆఫ్రికాలో ఉన్న టెలికం సంస్థ నియోటెల్‌లో మెజారిటీ వాటాను వొడాఫోన్‌కు చెందిన వొడాకామ్‌కు విక్రయించే ప్రయత్నాల్లో ఉందని వార్తలొస్తున్నాయి. కాగా, ఇవన్నీ ఊహాగానాలంటూ టాటా సన్స్ ప్రతినిధి కొట్టిపారేశారు. వొడాఫోన్ ప్రతినిధి కూడా ‘నో కామెంట్’ అనడం గమనార్హం. షేరు ధరలు ఇలా... ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్‌లో భాగమైన టాటా టెలీ(మహారాష్ట్ర) లిమిటెడ్(టీటీఎంఎల్) స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉంది. ముంబై, గోవా సర్కిళ్లలో ఇది మొబైల్ సేవలందిస్తోంది. బుధవారం బీఎస్ఈలో ఈ షేరు ధర 2.49 శాతం లాభపడి రూ.7.40 వద్ద స్థిరపడింది. ఇక టాటా కమ్యూనికేషన్స్ షేరు కూడా 2.26% పెరిగి రూ.281 వద్ద స్థిరపడింది. -
‘సాక్ష్యాలు లేనందునే నిరాకరించా’
న్యూఢిల్లీ: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ సీఎం ఆశోక్ చవాన్ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలను సీబీఐ చూపించలేకపోయిందని రాష్ట్ర గవర్నర్ కె.శంకర నారాయణన్ అన్నారు. ఈ సొసైటీలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం కల్పించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి హోదాలో అశోక్ చవాన్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలపై సాక్ష్యాన్ని సీబీఐ సేకరించలేకపోయిందని న్యూఢిల్లీలో బుధవారం విలేకరులతో అన్నారు. దీన్ని ఆధారంగానే చేసుకునే చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతించలేదని వివరించారు. 2000వ సంవత్సరంలో ఫ్లాట్ల కేటాయింపులో చవాన్ క్రిడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయని, అయితే 2004లో జూన్ 18న చవాన్ వదిన చేసుకున్న దరఖాస్తును తిరస్కరణకు గురైందన్నారు. 2000 సమావేశానికి, 2004 దరఖాస్తుకు చాలా కాలం వ్యత్యాసముందన్నారు. చివరగా 2008, నవంబర్ 10న ఆమెకు సభ్యత్వం ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సమయంలో చవాన్ రెవెన్యూ శాఖ మంత్రి కానీ, సీఎం హోదాలో కానీ లేరని తెలిపారు. సీఆర్పీసీ 197 సెక్షన్ కింద మాత్రమే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరిందని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద కాదని చెప్పారు. తన వద్దకు వచ్చిన అన్ని పత్రాలను పరిశీలించాకే సీబీఐ విచారణకు అనుమతించలేదని వివరించారు. గతంలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సీఎం పదవికి అశోక్ చవాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కుంభకోణం నుంచి చవాన్ పేరును తప్పించాలంటూ ఇటీవల బాంబే హైకోర్టుకు వెళ్లిన సీబీఐకి చుక్కెదురైంది. -
హామీ ఇచ్చాం..తగ్గించాం
ముంబై: గత ఏడాది నవంబర్ 19వ తేదీన ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్‌ను 20 శాతం తగ్గించామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గించిందని ఇప్పుడు మా ప్రభుత్వం చార్జీలు తగ్గించిందనే విపక్షాల విమర్శలు అవాస్తవం. మేం గతంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే తగ్గించాం. ఈ నిర్ణయంపై ఎవరి ప్రభావం లేదు. ప్రతిపక్షాలు దీనిపై ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే స్వేచ్ఛగా చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. విద్యుత్ టారిఫ్ తగ్గింపు వల్ల ప్రభుత్వంపై రూ.7,200 కోట్ల భారం పడుతుంది..’ అని తెలిపారు. ఇదిలా ఉండగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌పార్టీ విఫలమైందన్న బీజేపీ నేత వినేద్ తావ్డే విమర్శలకు చవాన్ స్పందించారు.‘ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కలిసి పోటీ చేస్తుంది..’ అని స్పష్టం చేశారు.