ధరల కట్టడే లక్ష్యం...
ఇరాక్ సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంటాం
- తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయ్...
- క్యాడ్ కూడా భారీగా దిగొచ్చింది...
- ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడి
ముంబై: ధరల పెరుగుదలకు కళ్లెం వేయడమే తమ ప్రధాన కర్తవ్యమని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రానున్న కొద్ది త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా తమ చర్యలు కొనసాగుతాయని... దీనిపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో అధిక ధరలకు అడ్డుకట్టవేయాలంటే ప్రభుత్వం ఆహారోత్పత్తులకు సంబంధించి తగిన నిర్వహణ విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను ఆర్‌బీఐ, ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నాయని, గత రెండు మూడు నెలలుగా ఆహార ధరలు మళ్లీ పుంజుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
మంగళవారమిక్కడ ఎస్‌బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే నెలలో టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణంరేటు ఐదు నెలల గరిష్టానికి(6.01%) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ రేటు 5.2%. ఆహారోత్పత్తులు, నిత్యావసరాల రేట్లు ఎగబాకడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. కాగా, ఎల్ నినోతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవచ్చని... దీంతో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకే ప్రమాదం పొంచిఉందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. కాగా, రాజన్ తాజా వ్యాఖ్యలతో ఇప్పట్లో పాలసీ వడ్డీరేట్ల తగ్గింపు ఉండబోదన్న సంకేతాలు బలపడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇరాక్ అనిశ్చితిపై...
ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా నెలకొన్న సంక్షోభం సహా ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కోగల సత్తా భారత్‌కు ఉందని రాజన్ పేర్కొన్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకోవడంలో మనం మరింత మెరుగైన స్థితిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘దేశంలో తగినన్ని విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా భారీగా దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాక్ సహా ఇతరత్రా ఎలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైనా మనకు ముప్పేమీ లేదు.
ఇరాక్‌లో చమురు నిల్వలన్నీ దక్షిణ ప్రాంతంలోనే ఉన్నాథ యి. అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం ఆ దేశ క్రూడ్ బిజినెస్‌పై పెద్దగా ప్రభావమేమీ చూపకపోవచ్చు. అయినప్పటికీ ఈ అంశం కొంత ఆందోళనకరమైనదే. అక్కడి సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నాం’ అని రాజన్ పేర్కొన్నారు. బంగారం ఇతరత్రా దిగుమతులు దిగిరావడంతో గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో క్యాడ్ జీడీపీలో 1.7 శాతానికి(32.4 బిలియన్ డాలర్లు) తగ్గడం రూపాయిపై కొంత ఒత్తిడి తగ్గించింది. అంతేకాదు ఆఖరి త్రైమాసికంలో అయితే, ఈ లోటు ఏకంగా 0.2 శాతానికి(1.2 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టమైన 4.7 శాతానికి(87.8 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే.
ఇరాక్ ప్రభుత్వంపై సున్నీ తీవ్రవాదుల భీకర దాడులు... చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో చమురు ధరలకు రెక్కలు రావడం తెలిసిందే. ఈ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలోనూ తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి కూడా. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ కూడా మళ్లీ 60 దిగువకు పడిపోవడం గమనార్హం. క్రూడ్ రేట్ల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం కూడా ఎగబాకే ప్రమాదం పొంచిఉంది. కాగా, చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్‌కు క్రూడ్ రేట్ల పెరుగుదల ఇబ్బందికర అంశమే.