ఫెడ్ కోతతో ఇబ్బందిలేదు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్)తో... దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రభావమేమీ ఉండబోదని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. భారత్ ఎగుమతులు పుంజుకుంటున్నాయని, అదేవిధంగా కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) సైతం మెరుగుపడుతోందన్నారు. సోమవారం ఇక్కడ విడుదల చేసిన అర్ధవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఈ విషయాలను పేర్కొన్నారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ ట్యాపరింగ్ పరిణామాలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంది.
ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో జీడీపీతో పోలిస్తే క్యాడ్ 3%లోపే ఉండొచ్చు’ అని రాజన్ చెప్పారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో క్యాడ్ 3.05 శాతానికి దిగొచ్చింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆశ్చర్యకరంగా 1.2 శాతానికి పరిమితం కావడం గమనార్హం. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది చరిత్రాత్మక గరిష్టానికి(4.8%) ఎగబాకడం విదితమే. బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) గడిచిన ఆరు నెలలుగా పెరుగుతూవస్తుండటం అత్యంత ఆందోళనకరంగా పరిణమించిందని రాజన్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి వ్యవస్థీకృత ముప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే... బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి 4.6 శాతానికి ఎగబాకవచ్చని నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి స్థూల ఎన్‌పీఏలు 4.2 శాతం(రూ.2.29 లక్షల కోట్లు)గా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో ఈ పరిమాణం రనూ.167 లక్షల కోట్లు. కాగా, మొత్తం రుణాల్లో పునర్‌వ్యవస్థీకరణ రుణాలు కూడా 2013-14 క్యూ2(జూలై-సెప్టెంబర్) నాటికి ఆల్‌టైమ్ గరిష్టానికి(రూ.4 లక్షల కోట్లు) దూసుకెళ్లడం గమనార్హం. క్రితం క్యూ2తో పోలిస్తే 10.2 శాతం ఎగబాకినట్లు నివేదిక వివరించింది. కాగా, 2015 మార్చినాటికి స్థూల ఎన్‌పీఏలు 4.4 శాతానికి మెరుగుపడొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. అయితే, ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారితే ఇది 7 శాతానికి కూడా పెరిగే ముప్పు ఉందని నివేదిక హెచ్చరించింది. అన్నింటికంటే ప్రభుత్వరంగ బ్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీరేట్ల తగ్గింపు ఇతరత్రా పాలసీ సడలింపులపై దృష్టిపెట్టాలనుకున్నా.. అధిక ద్రవ్యోల్బణం కారణంగా సాధ్యంకావడం లేదని రాజన్ చెప్పారు. మంచి వర్షపాతంతో వ్యవసాయ దిగుబడులు పుంజుకోనున్నాయని, దీంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో వృద్ధి కాస్త మెరుగయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
స్థిరమైన సర్కారు రాకపోతే అంతే..!
2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల రూపంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త రిస్క్‌లు పొంచిఉన్నాయని నివేదిక పేర్కొంది. ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోతే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇది ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తుందన్నారు. స్థిరమైన సర్కారు ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కూడా దీనికోసమే ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.