మహీంద్రా రేవా ఈ2ఓ కారు ధర కట్
న్యూఢిల్లీ: మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ఈ2ఓ ధర రూ.1.7 లక్షల వరకూ తగ్గే ఒక కొత్త స్కీమ్‌ను మంగళవారం ప్రకటించింది. గుడ్‌బై ఫ్యూయల్, హెలో ఎలక్ట్రిక్ పేరుతో వినూత్నమైన ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్‌ను అందిస్తున్నామని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈవో చేతన్ మైణి చెప్పారు.
చార్జింగ్ బ్యాటరీని కొనుగోలు చేయకుండా నెలకు రూ.2,599 చొప్పున ఐదేళ్లు చెల్లించే ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్ కారణంగా రూ. 6.69 లక్షల ధర ఉండే ఈ2ఓ కారును ఇప్పుడు రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ లిథియమ్ అయాన్ బ్యాటరీ నెలకు 800 కిమీ. చొప్పున(సగటున)ఐదేళ్లకు 50 వేల కిమీ. దూరం ప్రయాణిస్తుందని వివరించారు. బ్యాటరీ రెంటల్‌తో పాటు ఎలక్ట్రిసిటీ కంజప్షన్ చార్జీని కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇది చాలా స్వల్పంగానే ఉండగలదని ఆయన వివరించారు.
24 గంటలూ రిపేర్ సేవలు అందుబాటులో ఉంటాయని, బ్యాటరీ రిపేర్ కాలంలో మరో కారును సమకూరుస్తామని పేర్కొన్నారు. కొత్త స్మార్ట్ పోర్ట్ టెక్నాలజీతో క్విక్2చార్జ్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. దీంతో ఈ2ఓ కారును ఒక్క గంటలోనే పూర్తిగా చార్జ్ చేయవచ్చు.