శాంతించిన టోకు ధరలు | WPI inflation eases to 5-month low of 6.16% in December | Sakshi
Sakshi News home page

శాంతించిన టోకు ధరలు

Published Thu, Jan 16 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

శాంతించిన టోకు ధరలు

శాంతించిన టోకు ధరలు

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తరహాలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)  ఆధారిత ద్రవ్యోల్బణం కూడా డిసెంబర్ నెలలో తగ్గింది. 5 నెలల కనిష్ట స్థాయిలో 6.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2012 డిసెంబర్‌తో పోల్చితే 2013 డిసెంబర్‌లో టోకు ధరల వేగం 6.16 శాతమన్నమాట. నవంబర్‌లో ఈ రేటు 14 నెలల గరిష్టం 7.52 శాతంగా ఉంది.
 
 రేట్ల కోతపై అంచనాలు!
 డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.87 శాతానికి (నవంబర్‌లో 11.16%)తగ్గడంతోపాటు, ఇప్పుడు టోకు ద్రవ్యోల్బణం కూడా కొంత తగ్గడంతో జనవరి 28న పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ  వడ్డీ రేట్ల కోత నిర్ణయం తీసుకోవచ్చని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి క్షీణత(ఐఐపీ నవంబర్‌లో మైనస్ 2.1%), అదుపులోకి వచ్చిన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) వంటి అంశాలు వడ్డీరేట్ల కోతకు వీలు కల్పిస్తుందనేది వారి వాదన. ప్రస్తుత పరిస్థితి పాలసీ రేట్ల కోతకు సానుకూలంగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్‌బీఐ సానుకూల దృష్టితో పరిశీలించాలని కోరారు. అయితే ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను తీసుకుంటే ఇప్పటికీ వాటి ధరలు సామాన్యునికి అందుబాటులో లేవని, ఈ దృష్ట్యా రేట్ల కోత ఉండకపోవచ్చన్నది మరికొందరి నిపుణుల అంచనా.
 
 నిత్యావసరాల ధరల తీరు ఇలా...
 సూచీ మొత్తంలో 14.34 శాతం వాటా కలిగిన నిత్యావసర ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదిక డిసెంబర్‌లో 13.68 శాతంగా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ శాతం 19.93 శాతం. కూరగాయల ధరల పెరుగుదల రేటు 57.33 శాతం కాగా, నవంబర్‌లో ఈ రేటు 95.25 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు తగ్గడం మొత్తం కూరగాయల విభాగానికి కలసొచ్చిన అంశం. ఉల్లికి సంబంధించి ద్రవ్యోల్బణం 190.34 శాతం నుంచి 39.56 శాతానికి దిగివచ్చింది. అయితే ఆలూ ధర మాత్రం పెరిగింది. నవంబర్‌లో ఈ రేటు 26.71 శాతం కాగా, 54.65 శాతానికి ఎగసింది. పండ్ల ధరలు 9.07 శాతం పెరిగాయి. మొత్తం సూచీలో దాదాపు 64% వెయిటేజ్ వాటా ఉన్న కోర్ గ్రూప్ (తయారీ రంగం) ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో  2.64% వద్ద స్థిరంగా(నవంబర్‌లో 2.64%)  ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement