ప్రైమరీ మార్కెట్లకు ఊతమిచ్చే దిశగా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చర్యలు తీసుకుంటోంది.
ముంబై: ప్రైమరీ మార్కెట్లకు ఊతమిచ్చే దిశగా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఐపీవోలకు గ్రేడిం గ్ తప్పనిసరన్న నిబంధనను సడలించాలని యోచి స్తోంది. మరో వారం, పది రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా తెలిపారు. సెబీ ఆమోదం లభించినా ఇప్పటికీ సుమారు రూ. 72,000 కోట్ల విలువ చేసే ఐపీవో ప్రతిపాదనలు మార్కెట్లోకి రాలేదని అంచనా.
ఈ నెల 24న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, కార్పొరేట్ బాండ్లకు సంబంధించి షెల్ఫ్-ప్రాస్పెక్టస్ జారీ చేయగలిగే అర్హత నిబంధనలను సడలించడం ద్వారా మరిన్ని కంపెనీలకు ఈ ప్రయోజనాన్ని వర్తింప చేసే యోచన కూడా ఉన్నట్లు సిన్హా వివరించారు. ఒకే ప్రాస్పెక్టస్‌ని ఉపయోగించి బాండ్ ఇష్యూ పరిమాణాన్ని విడతల వారీగా సమీకరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాగా, లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించడంపైనా దృష్టి పెట్టినట్లు సిన్హా తెలిపారు.