ఎయిర్ కోస్టా భారీ ఆర్డర్
సాక్షి, విజయవాడ: దక్షిణ భారత దేశంలో విమానయాన సర్వీసులను అందించడంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకున్న ‘ఎయిర్ కోస్టా’ మరో 50 ఈ-జెట్స్ విమానాలు కొనేందుకు సిద్ధమైంది. ఇందుకుగాను బ్రెజిల్ దేశానికి చెందిన ఎంబ్రాయిర్ ఎస్‌ఏ అనే విమానాల తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లో గురువారం జరిగిన ఒక ఎయిర్ షోలో ఎయిర్ కోస్టా ఛైర్మన్ లింగమనేని రమేష్, ఎంబ్రాయిర్ కమర్షియల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో పౌలో సిజర్ సిల్వా మధ్య 2.94 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.18,300 కోట్లు) ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందం ప్రకారం ఈ190-ఈ2ఎస్, ఈ195-ఈ2ఎస్ మోడల్ విమానాలు 25 చొప్పున 2018 నాటికి ఎయిర్ కోస్టాకు అందుతాయి. ఈ190ఈ2 మోడల్ విమానంలో 98 ద్వితీయశ్రేణి, ఆరు ప్రథమశ్రేణి సీట్లుంటాయి. ఈ195-ఈ2లో 118 సీట్లు, 12 ప్రథమశ్రేణి సీట్లుంటాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడలతోపాటు ఉత్తరభారతదేశంలోని అహ్మదాబాద్,ై జెపూర్‌లతో కొన్ని పట్టణాలకు ఎయిర్ కోస్టా సంస్థ సేవలను అందిస్తోంది.
నూతన విమానాలను కొనుగోలు చేయడం ద్వారా వైజాగ్, గోవా, పూనా, మధురై వంటి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విమాన సేవలను విస్తరించాలని, కొన్ని నగరాలకు నేరుగా విమాన సర్వీసులు నడపడంతో పాటు వ్యాపార లావాదేవీలు బాగా జరిగే పట్టణాలకు విమాన సేవలు అందించాలని భావిస్తోంది. ఎయిర్ కోస్టాతో ఒప్పందం ద్వారా భారతదేశంలో తమ సంస్థ అడుగుపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సిల్వా తెలిపారు. కొత్తగా విమానాలు కోనుగోలు చేయడం ద్వారా భారత దేశమంతంటికీ తమ సంస్థ సేవలను విస్తరించాలని భావిస్తున్నట్లు ఎయిర్ కోస్టా చైర్మన్ లింగమనేని రమేష్ తెలిపారు.