Embraer
-
హైదరాబాద్‌లో ఎంబ్రార్ ఎంఆర్వో కేంద్రం
న్యూఢిల్లీ: విమానాల తయారీలో ఉన్న బ్రెజిల్ దిగ్గజం ఎంబ్రార్.. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) కేంద్రాన్ని హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఎయిరిండియాతో చేతులు కలిపింది. ఎయిరిండియా ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం ద్వారా ఆగ్నేయాసియా దేశాల్లో ఎంబ్రార్కు చెందిన ప్రైవేట్, బిజినెస్ జెట్స్‌కు ఎంఆర్వో సేవలందిస్తారు. 2018 చివరికి ఈ ప్రాంతంలో 40 విమానాలను ఎంబ్రార్ విక్రయించనున్న నేపథ్యంలో మెయింటెనెన్స్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎయిరిండియా ఇప్పటికే 6 విమానాశ్రయాల్లో ఎంఆర్వో కేంద్రాలను నిర్వహిస్తోంది. -
ప్రైవేటు జెట్స్ కి డిమాండ్ అంతంతే: ఎంబ్రాయర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ జెట్స్ (సొంత విమానాలు) విభాగంలో డిమాండ్ స్థిరంగా ఉందని చిన్న విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్ తెలిపింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు తగ్గడంతో ప్రైవేట్ జెట్స్ డిమాండ్ స్థిరంగా ఉండటానికి కారణమని ఎంబ్రాయర్ వైస్ ప్రెసిడెంట్ (అమ్మకాలు) క్లాడియో కామిలియర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఏటా 8 నుంచి 10 ప్రైవేటు జెట్స్కి డిమాండ్ ఉందన్నారు. సుమారు 150 ప్రైవేట్ జెట్స్ ఇండియాలో ఉండగా అందులో 21 ఎంబ్రాయర్ ఎగ్జిక్యూటివ్ జెట్స్ ఉన్నాయన్నారు. వచ్చే పదేళ్లలో చైనా కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 490 ఎగ్జిక్యూటివ్ జెట్స్‌కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎంట్రీలెవెల్ బిజినెస్ జెట్ ఫినోమ్ 100ఈ విమానాన్ని టైటాన్ ఏవియేషన్ గ్రూపునకు అందచేశారు. ఈ విమానం కొనుగోలు చేసిన వ్యక్తి పేరును తెలియచేయడానికి కంపెనీ నిరాకరించింది. -
ఎయిర్ కోస్టా భారీ ఆర్డర్
సాక్షి, విజయవాడ: దక్షిణ భారత దేశంలో విమానయాన సర్వీసులను అందించడంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకున్న ‘ఎయిర్ కోస్టా’ మరో 50 ఈ-జెట్స్ విమానాలు కొనేందుకు సిద్ధమైంది. ఇందుకుగాను బ్రెజిల్ దేశానికి చెందిన ఎంబ్రాయిర్ ఎస్ఏ అనే విమానాల తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లో గురువారం జరిగిన ఒక ఎయిర్ షోలో ఎయిర్ కోస్టా ఛైర్మన్ లింగమనేని రమేష్, ఎంబ్రాయిర్ కమర్షియల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో పౌలో సిజర్ సిల్వా మధ్య 2.94 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.18,300 కోట్లు) ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ190-ఈ2ఎస్, ఈ195-ఈ2ఎస్ మోడల్ విమానాలు 25 చొప్పున 2018 నాటికి ఎయిర్ కోస్టాకు అందుతాయి. ఈ190ఈ2 మోడల్ విమానంలో 98 ద్వితీయశ్రేణి, ఆరు ప్రథమశ్రేణి సీట్లుంటాయి. ఈ195-ఈ2లో 118 సీట్లు, 12 ప్రథమశ్రేణి సీట్లుంటాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడలతోపాటు ఉత్తరభారతదేశంలోని అహ్మదాబాద్,ై జెపూర్లతో కొన్ని పట్టణాలకు ఎయిర్ కోస్టా సంస్థ సేవలను అందిస్తోంది. నూతన విమానాలను కొనుగోలు చేయడం ద్వారా వైజాగ్, గోవా, పూనా, మధురై వంటి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విమాన సేవలను విస్తరించాలని, కొన్ని నగరాలకు నేరుగా విమాన సర్వీసులు నడపడంతో పాటు వ్యాపార లావాదేవీలు బాగా జరిగే పట్టణాలకు విమాన సేవలు అందించాలని భావిస్తోంది. ఎయిర్ కోస్టాతో ఒప్పందం ద్వారా భారతదేశంలో తమ సంస్థ అడుగుపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సిల్వా తెలిపారు. కొత్తగా విమానాలు కోనుగోలు చేయడం ద్వారా భారత దేశమంతంటికీ తమ సంస్థ సేవలను విస్తరించాలని భావిస్తున్నట్లు ఎయిర్ కోస్టా చైర్మన్ లింగమనేని రమేష్ తెలిపారు.