ప్రైవేటు జెట్స్ కి డిమాండ్ అంతంతే: ఎంబ్రాయర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ జెట్స్ (సొంత విమానాలు) విభాగంలో డిమాండ్ స్థిరంగా ఉందని చిన్న విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్ తెలిపింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు తగ్గడంతో ప్రైవేట్ జెట్స్ డిమాండ్ స్థిరంగా ఉండటానికి కారణమని ఎంబ్రాయర్ వైస్ ప్రెసిడెంట్ (అమ్మకాలు) క్లాడియో కామిలియర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఏటా 8 నుంచి 10 ప్రైవేటు జెట్స్‌కి డిమాండ్ ఉందన్నారు. సుమారు 150 ప్రైవేట్ జెట్స్ ఇండియాలో ఉండగా అందులో 21 ఎంబ్రాయర్ ఎగ్జిక్యూటివ్ జెట్స్ ఉన్నాయన్నారు. వచ్చే పదేళ్లలో చైనా కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 490 ఎగ్జిక్యూటివ్ జెట్స్‌కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎంట్రీలెవెల్ బిజినెస్ జెట్ ఫినోమ్ 100ఈ విమానాన్ని టైటాన్ ఏవియేషన్ గ్రూపునకు అందచేశారు. ఈ విమానం కొనుగోలు చేసిన వ్యక్తి పేరును తెలియచేయడానికి కంపెనీ నిరాకరించింది.