ఇటీవలి కాలంలో పెరుగుతున్న ప్రార్థనా స్థలాల వివాదాలు
సంభల్ మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం పిటిషన్ దాఖలు
అజ్మీర్ షరీఫ్ దర్గాను మహాదేవుని ఆలయంగా అభివర్ణించడంతో వివాదం
మథురలోని జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదాలు
1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడిన వివాదాలు
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో గల జామా మసీదు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఏఎస్‌ఐ సర్వేకు అనుమతినిచ్చింది.
పెరుగుతున్న ప్రార్థనా స్థలాల వివాదాలు
తదనంతరం సంభల్‌లో హింస చెలరేగింది. ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ హింసాకాండలో కొందరు పోలీసులు, స్థానికులు గాయపడ్డారు. అజ్మీర్ షరీఫ్ దర్గాను మహాదేవుని ఆలయంగా అభివర్ణించడంతో చెలరేగిన వివాదం ఇంకా ముగియనే లేదు. ఈ అంశం కూడా కోర్టులో ఉంది. ఇటీవల జరిగిన ఈ వివాదాలు ఉదాహరణ మాత్రమే. దీనికి ముందు, మథురలోని జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదాలు కూడా తరహాలోని హై ప్రొఫైల్ కేసులు. ఈ వివాదాలు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడివున్నాయి.
చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆరు పిటిషన్లు
ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ప్రార్థనా స్థలాల చట్టం అనేది ఏదో ఒక మతానికి చెందిన ప్రార్థనా స్థలాలను ఇతర మతాల ప్రార్థనా స్థలంగా మార్చకుండా నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు ఈ చట్టాలనికి గల చట్టపరమైన చెల్లుబాటును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. అవి సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి.
ప్రార్థనా స్థలాల చట్టం-1991లో ఏముంది?
1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం 1947, ఆగస్టు 15కు ముందు అంటే దేశ స్వాతంత్య్రానికి ముందు ఉన్న ఏదైనా మతపరమైన ప్రార్థనా స్థలం యథాతథ స్థితిని కొనసాగించడానికి అధికారాన్ని ఇస్తుంది. అలాగే ఆయా ప్రార్థనా స్థలాలను ఇతర మతాల ప్రార్థనా స్థలాలుగా మార్చడాన్ని కూడా నిరోధిస్తుంది. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ చట్టంలో కొన్ని ముఖ్యమైన సెక్షన్లు చేర్చారు.
ప్రార్థనా స్థలం చట్టం సెక్షన్- 2
1947 ఆగస్టు 15 నాటికి ఏదైనా మతపరమైన స్థలంలో మార్పులకు సంబంధించి కోర్టులో ఏదైనా పిటిషన్ పెండింగ్‌లో ఉంటే, దానిని కొట్టివేస్తారని ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్- 2 చెబుతోంది.
ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 3
మతపరమైన స్థలాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా మరొక మతంలోకి మార్చడానికి అనుమతి లేదు. 1947 ఆగస్టు 15న ఏ విధంగా ఉన్న మత స్థలాలు యధాతథంగా ఉంటాయి. నాడువున్న మతస్థలం అంతకుముందు ఎప్పుడైనా కూల్చివేసి, మరో మతస్థలం నిర్మించినట్లు రుజువైనా, దాని ప్రస్తుత రూపాన్ని మార్చేందుకు అవకాశం లేదు.
ప్రార్ధనా స్థలం చట్టంలోని సెక్షన్- 4(1)
సెక్షన్ 4(1) ప్రకారం 1947, ఆగస్టు 15 నాటికి అన్ని మతాల ప్రార్థనా స్థలాల యథాతథ స్థితిని కొనసాగించాలి.
ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 4(2)
ప్రార్థనా స్థలాల చట్టం సెక్షన్- 4 (2) ప్రకారం, ప్రార్థనా స్థలాల చట్టం అమల్లోకి వచ్చిన తేదీన పెండింగ్‌లో ఉన్న దావాలు, చట్టపరమైన చర్యలను నిలిపివేయడం గురించి ఇది తెలియజేస్తుంది. అంటే 1947 ఆగస్టు 15కు ముందు ఉన్న వివాదంపై తిరిగి విచారణ ఉండదు.
ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 5
ఈ సెక్షన్ కింద రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని పక్కన పెట్టారు. అంటే అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఈ ప్రార్థనా స్థలాల చట్టంలోని ఎలాంటి నిబంధనలు వర్తించవు.
చట్టం ఎందుకు అవసరమయ్యింది?
అయోధ్యలో రామమందిర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఈ చట్టం వచ్చింది. ఈ వివాదం దేశమంతటిపై ప్రభావం చూపింది. దేవాలయాలు, మసీదులకు సంబంధించిన వివాదాలు తెరపైకి రావడం మొదలయ్యింది. మతపరమైన ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి. ఇలాంటి వివాదాలను నియంత్రించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకు వచ్చి, 1947 ఆగస్టు 15కి ముందు మత స్థలాల యథాతథ స్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది?
Comments
Please login to add a commentAdd a comment