టెక్నాలజీ ‘ఎవరెస్ట్’ పై... తెలుగోడు | New Microsoft CEO Satya Nadella faces challenges in mobile, investor relations | Sakshi
Sakshi News home page

టెక్నాలజీ ‘ఎవరెస్ట్’ పై... తెలుగోడు

Published Wed, Feb 5 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

టెక్నాలజీ ‘ఎవరెస్ట్’ పై... తెలుగోడు

టెక్నాలజీ ‘ఎవరెస్ట్’ పై... తెలుగోడు

బిల్ గేట్స్... స్టీవ్ బామర్... తరవాతి పేరు మన వాడిదే. తెలుగువాడు సత్య నాదెళ్లదే. 39 ఏళ్ల చరిత్ర ఉన్న
 మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈఓగా హైదరాబాదీ సత్య నాదెళ్ల ఎంపికయ్యాడు. మణిపాల్, విస్కాన్సిన్ మీదుగా హైదరాబాద్ నుంచి రెడ్‌మండ్ చేరిన ఈ సత్య... తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో ఏకంగా స్కూలే పెట్టారు. ప్రతి భారతీయుడికీ ఆయన
 ప్రస్థానం స్ఫూర్తినిచ్చేదే.
 
 న్యూయార్క్: నిన్న మొన్నటిదాకా ఊహగానాలకి పరిమితమైనది మొత్తానికి వాస్తవరూపం దాల్చింది. మరో అమెరికన్ దిగ్గజానికి మన ఇండియన్ సారథ్యం వహించనున్నారు. 78 బిలియన్ డాలర్ల టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కి సీఈవోగా మన తెలుగువాడు సత్య నాదెళ్ల నియమితులయ్యారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. సత్యను సీఈవోగా నియమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. బిల్‌గేట్స్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో మన సత్య నాదెళ్ల (47) ముచ్చటగా మూడో సీఈవో. తనతో పోటీపడిన గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుందర్ పిచ్చయ్యను తోసిరాజని సత్య దీన్ని దక్కించుకున్నారు.

క్రికెట్ అంటే ఇష్టపడే సత్య.. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. ప్రస్తుత సీఈవో స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇండిపెండెంట్ డెరైక్టర్ జాన్ థాంప్సన్ తాజాగా చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ బిల్ గేట్స్ ఇకపై టెక్నాలజీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు. కంపెనీ ఉత్పత్తులు, టెక్నాలజీల రూపకల్పనకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెడతారు. ఒకవైపు విండోస్, ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండటం మరోవైపు.. డివైజ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొంగొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ విస్తరిస్తున్న తరుణంలో సత్య సీఈవోగా బాధ్యతలు చేపడుతుండటం గమనార్హం. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 31,400 కోట్ల డాలర్లు.

 మైక్రోసాఫ్ట్‌కి తగిన సారథి..
 కంపెనీ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో .. సంస్థను ముందుంచి నడిపేందుకు సత్యను మించి మరొకరు లేరంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, అందర్నీ ఏకతాటిపైకి తేగలిగే సత్తా గల నాయకుడిగా సత్య తన సామర్థ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటూనే ఉన్నారంటూ గేట్స్ ప్రశంసించారు. మరోవైపు, మైక్రోసాఫ్ట్‌కి సరైన సారథి సత్య అని స్టీవ్ బామర్ పేర్కొన్నారు. ఆయనతో 20 ఏళ్లకుపైగా కలసి పనిచేశానని, మైక్రోసాఫ్ట్‌కి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారన్నారు.

 అసాధ్యాలను సాధ్యం చేయగలం..
 సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌లో సత్య.. ‘అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి.. అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి’ అంటూ ప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్‌వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజ్‌ల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థా సాధికారత సాధించగలిగేలా చూడగలగడం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నారు.

 మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరిం తగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కి సీఈవో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా.. నవకల్పనలకే పెద్దపీట దక్కుతుందని సత్య చెప్పారు.
 
 
 సత్య... మిస్టర్ నైస్ గై
     పూర్తి పేరు:          నాదెళ్ల సత్యనారాయణ చౌదరి
     స్వస్థలం:                అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, బుక్కాపురం
     పుట్టిన సంవత్సరం:    1967, హైదరాబాద్‌లో
     వయసు:                47
     కుటుంబం:        భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. తండ్రి బీఎన్ యుగంధర్ నాయుడు  మాజీ ఐఏఎస్ అధికారి.  
     నివాసం:        వాషింగ్టన్‌లో.
     చదువు:         బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో మొదలు
     డిగ్రీలు:          మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అమెరికా మిల్‌వాకీలోని విస్కాన్సిన్ వర్సిటీ నుంచి                                  ఎంఎస్. షికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ.
     ఉద్యోగ ప్రస్థానం:        తొలుత సన్‌మైక్రోసిస్టమ్స్‌లో చేరారు. తరవాత 1992 నుంచీ మైక్రోసాఫ్ట్‌లో.
     {పస్తుత స్థానం:        క్లౌడ్ కంప్యూటింగ్ హెడ్
     వేతనం:               76 లక్షల డాలర్లు (2012-13)
 కలిసొచ్చినవివే...
   స్టీవ్ బామర్ కన్నా సత్యకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. విస్తృతమైన ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్. 1992లో మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరాక... క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఎన్నో  కొత్త ఆవిష్కరణలు చేశారు. ఈయనను ‘క్లౌడ్ గురు’గా పిలుస్తారు
   మైక్రోసాఫ్ట్‌కు చెందిన 2000 కోట్ల డాలర్ల సర్వర్ అండ్ టూల్స్ బిజినెస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశారు.  దీనికి ముందు ఆన్‌లైన్ సర్వీసెస్ డివిజన్‌కు చెందిన ఆర్ అండ్ డీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, మైక్రో సాఫ్ట్ బిజినెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా సేవలందించారు.
   ఆఫీస్ 365 ప్రోగ్రామ్ విజయం వెనక ఆయన కృషి ఎంతో ఉంది.
 
 ‘క్లౌడ్ ఓఎస్’ ఘనత సత్యదే..
 మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్‌నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకూ ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 20 బిలియన్ డాలర్ల వ్యాపారమైన సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్‌లైన్ సర్వీసెస్ డివిజన్, బిజినెస్ డివిజన్‌లలో ఆయన గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 38 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన బిల్‌గేట్స్, స్టీవ్ బామర్‌లే ఇంతవరకూ సీఈవోలుగా పనిచేశారు. ఇప్పుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈవో.
 
 క్రికెట్ ఎన్నో నేర్పింది...
 కవితలన్నా, క్రికెటన్నా సత్య నాదెళ్లకు చాలా ఇష్టం. క్రికెట్ వల్లే టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని సీఈవోగా తన నియామకం ఖరారైన అనంతరం ఆయన చెప్పారు. అత్యంత సుదీర్ఘంగా సాగే టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ఆసక్తికరమైన మలుపులు తిరిగే మ్యాచ్‌ను చూస్తుంటే.. రష్యన్ నవల చదువుతున్నట్లుగా ఉంటుందని చెప్పారాయన. కవితలైతే రహస్య సంకేతాల్లా అనిపిస్తాయన్నారు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన సాధనాలను మైక్రోసాఫ్ట్ అందిస్తోందని, అది చూశాకే ఆ కంపెనీలో చేరానని చెప్పారాయన.  ‘నేను నిర్మించడాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతా. ఇప్పటికీ తరచు బోలెడన్ని ఆన్‌లైన్ కోర్సులు చేస్తుంటా. అప్పట్లో మాస్టర్స్ డిగ్రీ చదివేటప్పుడు ప్రతి శుక్రవారం రాత్రి షికాగోకి వెళ్లేవాణ్ణి. శనివారాలు క్లాసులకు హాజరయ్యి.. మళ్లీ సోమవారానికల్లా రెడ్‌మండ్ (మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉన్న చోటు)కి వచ్చేసేవాణ్ని. దాదాపు రెండున్నరేళ్లు పట్టింది కానీ... మొత్తానికి మాస్టర్స్ డిగ్రీ అలా పూర్తి చేసేశా.   కొత్తవి నేర్చుకోవటం ఆపేస్తే మనం ఉపయోగకరమైన పనులు చేయడం మానేసినట్లేనన్నది నా ఉద్దేశం’’
 
 సన్నిహితుల సంతోషం...
 హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ బాస్‌గా సత్య నాదెళ్ల నియామకం గురించి తెలియటంతో ఆయన కుటుంబం, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆయన తల్లిదండ్రులుంటున్న నివాసానికి సన్నిహితులు, విలేకరులు వెల్లువెత్తారు. అయితే, సత్య తండ్రి , మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎస్.యుగంధర్ మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆయన స్పందన కోసం మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు పంపినా స్పందించలేదు. మరోవైపు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌పీఎస్ సొసైటీ కార్యదర్శి ఫయాజ్ ఖాన్ వెల్లడించారు.

హెచ్‌పీఎస్‌లో చదివిన సత్యకి.. ఫయాజ్ సహాధ్యాయి. తగిన సమయం చూసుకుని సత్యను స్కూలుకు ఆహ్వానిస్తామని ఖాన్ చెప్పారు. సత్య సారథ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త శిఖరాలను అధిరోహించగలదని మరో సహాధ్యాయి, నగరానికి చెందిన టెక్నాలజీ సంస్థ మాజీ సీఈవో అయిన ఎం.చంద్రశేఖర్ ఆకాంక్షించారు. ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఒక భారతీయుడు సీఈవో కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఇంజనీరింగ్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ సీఎండీ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. సత్య నియామకంపై హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థి, అపోలో హాస్పిటల్స్ సీఈవో హరి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement