ఇక ఫలితాలే దిక్సూచి..
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లు జోరు చూపుతాయని అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేశారు. ఇందుకు అంతర్జాతీయ సంకేతాలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు వంటివి సహకరిస్తాయని తెలిపారు. వీటికి జనవరి రెండో వారంనుంచీ వె లువడనున్న ‘అక్టోబర్-డిసెంబర్’ త్రైమాసిక ఫలితాల అంచనాలు జత కలుస్తాయని చెప్పారు. ఇక మరోవైపు డిసెంబర్ నెలకు బుధవారం(జనవరి 1న) వెల్లడికానున్న వాహన అమ్మకాల నేపథ్యంలో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలుస్తాయని వివరించారు. సమీప కాలానికి మార్కెట్లను త్రైమాసిక ఫలితాలే నడిపిస్తాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. వారం మధ్యలో కొత్త క్యాలండర్ ఏడాది(2014) మొదలుకానున్న కారణంగా ఈ వారం సెంటిమెంట్ బుల్లిష్‌గానే కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.
ద్రవ్యలోటుపై దృష్టి: రానున్న రోజుల్లో ద్రవ్యలోటు, తయారీ సంబంధ గణాంకాలు వెలువడనున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు కొంతమేర జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. డిసెంబర్‌లో ఎఫ్‌ఐఐలు నికర కొనుగోలుదారులుగా వ్యవహరిస్తుండటంతో సెంటిమెంట్ బుల్లిష్‌గా మారిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. వీటన్నిటికితోడు విదేశీ మార్కెట్లు పటిష్టంగా సాగుతుండటంతో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ మరింత పుంజుకునేందుకు అవకాశమేర్పడిందని చెప్పారు. వెరసి నిఫ్టీకి 6,325 పాయింట్ల స్థాయి సాంకేతికంగా కీలకంగా నిలవనుందని అంచనా వేశారు. ఈ స్థాయిని అధిగమిస్తే మరింత పురోగమిస్తుందని పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఐల జోరు: కాగా, దేశీయ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ నికరంగా... రూ.15,500 కోట్లను(250 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు.