అందరూ అవినీతిపరులు కారు: ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: దేశమంతా అవినీతిలో కూరుకుపోయిందన్నది చాలా తప్పుడు భావన అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. అందరూ అవినీతిపరులు కారన్నారు. నియంత్రణ సంస్థలు కూడా అందరినీ అదే దృష్టికోణంతో చూడకుండా.. క్షమించరాని ఉల్లంఘనలకు కంపెనీలు పాల్పడ్డాయని, క్రిమినల్ నేరాలు చేశాయని పక్కాగా రుజువులు ఉన్నప్పుడే రంగంలోకి దిగాలని సూచించారు.
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) స్వర్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిదంబరం ఈ విషయాలు తెలిపారు. ‘నేను అవినీతికి మద్దతు పలకడం లేదు. కానీ అందరూ అవినీతిపరులని మాత్రం నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు, మీ తల్లిదండ్రులు, మిత్రులు, ప్రతి ఒక్కరు అవినీతిపరులన్న భావన్న చాలా దారుణమైనది. ఇలా మనల్ని మనమే తక్కువ చేసుకోవడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను’ అని చిదంబరం చెప్పారు.