పీఎస్‌యూ బ్యాంకులకు మరో రూ.8 వేల కోట్ల మూలధనం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనాన్ని పెంచేందుకు కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8 వేల కోట్ల అదనపు క్యాపిటల్‌ను అందించే అవకాశముంది. తాత్కాలిక బడ్జెట్లో ఇందుకు రూ.11,200 కోట్లు కేటాయించామనీ, ఇంతకంటే ఎక్కువ మొత్తం అవసరం ఉన్నప్పటికీ రూ.6,000 - 8,000 కోట్ల స్థాయిలో సమకూర్చుతామనీ ఆర్థిక సేవల కార్యదర్శి జి.ఎస్.సాంధు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో మంగళవారం ఆర్థిక మంత్రి చిదంబరం సమావేశం అనంతరం సాంధు మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేది కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వమేనని చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.14 వేల కోట్ల మూలధనాన్ని పీఎస్‌యూ బ్యాంకులకు అందించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.రెండు వేల కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.1,200 కోట్లు వెళ్లాయి. గ్లోబల్ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకులన్నీ టైర్-1 క్యాపిటల్‌ను పెంచుకునే యత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ప్రమాణాల ప్రకారం భారతీయ బ్యాంకులకు రూ.5 లక్షల కోట్ల అదనపు క్యాపిటల్ అవసరమని రిజర్వు బ్యాంకు అంచనా.
నిధుల సమీకరణకు హోల్డింగ్ కంపెనీలు..
విస్తరణకు అవసరమైన నిధుల కోసం హోల్డింగ్ కంపెనీ, స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పీఎస్‌యూ బ్యాంకులకు చిదంబరం సూచించారు. మార్చితో ముగిసిన క్వార్టర్లో బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ) పరిస్థితి మెరుగుపడి 4.44 శాతానికి చేరిందనీ, అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.07 శాతంగా ఉందనీ తెలిపారు.
ప్రభుత్వ వాటా తగ్గాలి - నాయక్ కమిటీ నివేదిక
ముంబై: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల్లో సర్కారు తన వాటాను 50 శాతం కంటే తక్కువ స్థాయికి తగ్గించుకోవాలని యాక్సిస్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.జె.నాయక్ సారథ్యంలోని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సూచించింది. బ్యాంకులను ప్రస్తుతం పాలిస్తున్న తీరును విమర్శించింది. రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక శాఖల పెత్తనం, సీవీసీ, కాగ్ వంటి బాహ్య సంస్థల నిఘా తదితర పరిమితులతో పీఎస్‌యూ బ్యాంకులు సతమతం అవుతున్నాయని నాయక్ కమిటీ రూపొందించిన నివేదిక పేర్కొంది. ‘పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువకు తగ్గిపోతే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.
ఇలా చేయడం వల్ల బ్యాంకులపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గకుండానే ఆ బ్యాంకుల్లో ప్రధాన వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుంది. తద్వారా బ్యాంకులు మరింత విజయవంతంగా పనిచేయడానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బ్యాంకుల పాలనా సంబంధమైన పలు విధులకు ప్రభుత్వం దూరంగా ఉండాలి. 1970, 80ల నాటికి బ్యాంకుల జాతీయకరణ చట్టాలతో పాటు ఎస్‌బీఐ చట్టం, ఎస్‌బీఐ (అనుబంధ బ్యాంకుల) చట్టాలను రద్దు చేయాలి. అన్ని బ్యాంకులనూ కంపెనీల చట్టం పరిధిలోకి తీసుకురావాలి. బ్యాంకుల్లోని ప్రభుత్వ వాటా బదిలీకోసం బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని ఏర్పాటుచేయాలి...’ అని కమిటీ సూచించింది.