న్యూఢిల్లీ: పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా 2013లో ప్రవేశపెట్టిన 80:20 బంగారం దిగుమతుల పథకాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) వ్యతిరేకించినట్లు తెలిసింది. ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) ఉప కమిటీతో ఆర్థిక శాఖ అధికారులు ఈ వివరాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఆ పథకం ప్రారంభించడంలో అవలంబించిన పద్ధతులు, విధానాలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని ఉప కమిటీ నిర్ణయించింది.
రెవెన్యూ కార్యదర్శితో పాటు ఈడీ, సీబీడీటీ, సీబీఈసీ ఉన్నతాధికారులు ఉప కమిటీ ముందు హాజరై ఈ పథకం గురించి వివరణ ఇచ్చారు. 80:20 పథకంతో నల్లధనం తెల్లధనంగా మారడంతో పాటు, మనీ లాండరింగ్ పెరుగుతుందని అప్పట్లోనే డీఆర్‌ఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్వ ఏడాది దిగుమతుల నుంచి 20 శాతం బంగారాన్ని ఎగుమతి చేసిన తరువాతే మళ్లీ బంగారాన్ని దిగుమతి చేసుకోవాలనే నిబంధనతో తెచ్చిన ఈ పథకాన్ని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత 2014 నవంబర్‌లో రద్దు చేసింది.
కార్తీకి నార్కో పరీక్షలు?: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన కార్తీ చిదంబరానికి నార్కో పరీక్ష చేయడానికి అనుమతి కోరుతూ సీబీఐ ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. మార్చి 9న ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పెషల్ జడ్జీ సునీల్ రానా చెప్పారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగించుకుని కార్తీ మళ్లీ అదే రోజు కోర్టుకు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ భాస్కరరామన్, సహ నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీలపై జారీ అయిన వారెంట్లు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లనూ కోర్టు విచారణకు చేపడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్తీ విచారణకు సహకరించడం లేదన్న నేపథ్యంలో నార్కో పరీక్షల కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment