ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే జయంతిని ఇకపై ‘ప్రతిజ్ఞా దివస్’గా జరుపుకోనున్నట్లు ఆ పార్టీ కార్యధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గతంలో ఠాక్రే జయంతిని శివసైనికులు తమ తమ ప్రాంతాల్లోనే జరుపుకున్నారని, ఈసారి మాత్రం కార్యకర్తలందరూ జనవరి 23న సోమయ్య మైదానానికి చేరుకోవాలన్నారు. అక్కడ బాల్‌ఠాక్రే కలల సాకారం కోసం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ ఉనికిని చాటడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని, పార్టీ సత్తా ఏమిటో దసరా ర్యాలీ, శివసేన వ్యవస్థాపక దినోత్సవాల ద్వారానే చాటి చెప్పామన్నారు. శివసైనికులందరిలో తామంతా ఒకే కుటుంబమనే భావన ఉందని, అందుకే అంతా ఒకచోటుకు చేరుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇదే భావంతో కూడా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారని, అంకితభావంతో పనిచేసి ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారన్నారు. ఇది కేవలం శివసైనికులకు చిందిన కార్యక్రమమని, బీజేపీ నేతలను ఆహ్వానించడంలేదన్నారు. మోడీపై రాజ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.