ముంబై: రాజకీయ చదరంగంలో ఓడినా.. న్యాయం తమవైపే ఉందని, ప్రజాక్షేత్రంలో నెగ్గి తీరతామని మరోసారి ఉద్ఘాటించారు శివ సేన అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోనుందుకే ఇదంతా జరిగిందని మరోసారి సంక్షోభంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ గుర్తింపు వ్యవహారం ఈసీ దగ్గర ఉన్న తరుణంలో.. తాజా ఇంటర్వ్యూలో థాక్రే మరోసారి సీఎం షిండేపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.
‘‘వాళ్లు(రెబల్స్) నన్ను మోసం చేశారు. పార్టీని చీల్చారు. శివ సేన గౌరవ వ్యవస్థాపకులు బాల్‌థాక్రే ఫొటోను ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు. దమ్ముంటే.. అలా అడుక్కోవడం ఆపండి. మీ మీ సొంత తండ్రుల ఫొటోలను వాడి ఓట్లు సంపాదించుకోండి’’ అంటూ చురకలంటించారు.
వాళ్లు శివ సేన అనే మహా వృక్షానికి పట్టిన చీడ. కుళ్లిన ఆకులు వెళ్లిపోయాయి. అయినా శివ సేనే నేలకు ఒరగదు. నా ప్రభుత్వం కుప్పకూలినా.. నా పదవి పోయినా.. నాకేం బాధ లేదు. కానీ, నా సొంత వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారన్న బాధను సహించలేకపోతున్నా. ఆపరేషన్ జరిగి కోలుకుంటున్న సమయంలో.. కోలుకోలేని దెబ్బ వేశారు నా అనుకున్నవాళ్లే.
నమ్మి పార్టీలో నెంబర్ 2 స్థానం ఇచ్చిన వ్యక్తే నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎలాగైనా పార్టీని నిలబెడతాడన్న నమ్మకం అతనిపై ఉండేది. కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్లతో పొత్తు పెట్టుకున్నాడు. కుట్రకు తెరలేపాడు. ఆ నమ్మక ద్రోహికి సవాల్ చేస్తున్నా.. నీ తండ్రి ఫొటోతో ఎన్నికల్లో నెగ్గి చూపించూ.. అంటూ పరోక్షంగా షిండేపై విమర్శలు గుప్పించారాయన. తన తండ్రి తర్వాత పార్టీ చీలిపోకుండా ఉండేందుకు తాను ప్రయత్నించానని, కానీ, అయినవాళ్లే ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇతర పార్టీలకు చెందిన గొప్ప నాయకుల పేర్లను, వాళ్ల పాపులారిటీని వాడుకుని బీజేపీ లాభపడాలని ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ నుంచి సర్దార్ పటేల్‌ను ఎలాగ వాడుతుందో.. ఇప్పుడు తన తండ్రి(బాల్‌థాక్రే) విషయంలోనూ అదే పని చేస్తోందని చెప్పారు. బాల్ థాక్రేకు అసలైన వారసులం, శివ సైనిక్‌లం తామేనంటూ మహారాష్ట్ర సీఎం షిండే ప్రకటించిన నేపథ్యంలో.. ఉద్దవ్ థాక్రే ఇలా తీవ్రంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment