
ముంబై: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 3న జరిగే తూర్పు అంధేరీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వార్గాలకు వీల్లేకుండా పోయింది. రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని చెప్పినా ఈసీ ఎవరికీ కేటాయించలేదు.
దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తూర్పు అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు 'శివసేన బాలా సాహెబ్ థాక్రే', లేదా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పార్టీ పేర్లలో ఏదో ఒకదాన్ని కేటాయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల గుర్తుగా త్రిశూలం, లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. తమ మొదటి ఎంపిక శివసేన బాలా సాహెబ్ థాక్రే, త్రిశూలం గుర్తు అని, అవి కుదరకపోతే రెండో ఆప్షన్‌కు ఈసీ ఓకే చేయాలని థాక్రే వర్గం కోరుతోంది.
అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ శనివారం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. వచ్చే ఉపఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది.
చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి
Comments
Please login to add a commentAdd a comment