బొగ్గు ఉత్పత్తి పెంచండి
కోల్ ఇండియాకు కేంద్ర మంత్రి గోయల్ ఆదేశం
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తిని పెంచేందుకు వీలుగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయల్ కోల్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించారు. ‘బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తవ్వకాలు జరుపుతున్న గనుల నుంచి మరింత బొగ్గును వెలికితీసేందుకు అనుమతించాల్సిందిగా పర్యావరణ, అటవీ శాఖను కోరాం.
విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా పెరిగే విధంగా ఈ-వేలంలో బొగ్గు పరిమాణాన్ని తగ్గించాలని ఆదేశించాం..’ అని ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని విద్యుదుత్పత్తి కంపెనీలన్నిటికీ సరఫరా చేసేందుకు బొగ్గు ఉత్పత్తిని 50-60 శాతం పెంచాలని కోల్ ఇండియాను కోరినట్లు చెప్పారు. దేశంలో విద్యుత్ కొరతకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రైవేట్ విద్యుత్ దిగ్గజాలు అనిల్ అంబానీ (రిలయన్స్ పవర్), గౌతమ్ ఆదానీ (ఆదానీ గ్రూప్), వినీత్ మిట్టల్ (వెల్‌స్పన్ ఎనర్జీ), నవీన్ జిందాల్ (జిందాల్ పవర్) తదితరులతో గోయల్ సమావేశం నిర్వహించారు.