ఆర్థిక వ్యవస్థపై ఎన్నికల అనిశ్చితి ప్రభావం
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి కారణంగా ఆర్థిక వ్యవస్థపై దుష్ర్పభావం పడే అవకాశాలున్నాయని పారిశ్రామిక చాంబర్ అసోచామ్ అధ్యయనంలో వెల్లడైంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కష్టమేనని ఇన్వెస్టర్లు, పారిశ్రామిక దిగ్గజాలు, ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ కిచిడీ సంకీర్ణ ప్రభుత్వం గనుక వస్తే... ఇప్పుడున్న పాలసీలతోపాటు మరిన్ని ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టవచ్చని వారు భయపడుతున్నట్లు అసోచామ్ అధ్యయన నివేదికలో పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ...
- ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్ సభ ఎన్నికల విషయంలో అనిశ్చితిని మరింత పెంచాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ ఎన్నికల్లో అనూహ్య శక్తిగా అవతరించడంతో కచ్చితంగా ప్రాంతీయ, చిన్న పార్టీలు తమ ప్రాభల్యాన్ని పెంచుకోవచ్చనే సంకేతాలు బలపడ్డాయి.
- ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న దాఖలాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. పారిశ్రామిక, సేవల రంగంలోని చాలా విభాగాల్లో సానుకూల పరిస్థితులు కానరావడం లేదు.
- రానున్న కొత్త ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా క్లిష్టమే. భారీ సామాజిక పథకాల కారణంగా ప్రభుత్వ వ్యయం భారీగా ఎగబాకనుంది. మరోపక్క, ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతుండటంతో... ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం అనుకున్నంతగా రావడం లేదు.
- ఆర్థిక వ్యవస్థ రికవరీకి ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్రంలో అనిశ్చిత సంకీర్ణ ప్రభుత్వం ఖాయమన్న అంచనాలు తీవ్ర ప్రతికూలతలకు దారితీస్తాయి.
- కేంద్రంలో రానున్న కొత్త సర్కారు తక్షణం అమలు చేయాల్సిన ప్రధాన సవాళ్లను కూడా గుర్తించారు.
- ప్రభుత్వ సబ్సిడీల వ్యయానికి అడ్డుకట్టవేయడం ఉపాధి కల్పనకు కీలకమైన అధిక వృద్ధి బాటలోకి ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణ ఇందులో ముఖ్యమైనవి.
- అదేవిధంగా తీవ్ర రుణ భారంతో సతమతమవుతున్న రియల్టీ, టెలికం, పవన విద్యుత్, యంత్ర పరికరాలు, ఇన్‌ఫ్రా తదితర రంగాల్లోని కంపెనీలు కొత్త ప్రభుత్వం నుంచి చాలా అశిస్తున్నాయి.
- పారిశ్రామిక రంగం పుంజుకోవాలంటే... తయారీ రంగాన్ని పునరుత్తేజపరచడం, భారీ మౌలిక రంగ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు జోరందుకునేలా చేయ డం వంటివి కొత్త ప్రభుత్వానికితక్షణ విధులు.